Begin typing your search above and press return to search.

మ్యూజిక్ తో మొదలుపెట్టిన అనిల్.. మల్టీస్టారర్‌కు ఫస్ట్ బజ్ అక్కడి నుంచే!

పాత తెలుగు కామెడీని గుర్తు చేసే శైలిలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్రకాష్ కుమార్‌తో రూపొందించిన సరదా వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Jun 2026 11:14 PM IST
మ్యూజిక్ తో మొదలుపెట్టిన అనిల్.. మల్టీస్టారర్‌కు ఫస్ట్ బజ్ అక్కడి నుంచే!
X

టాలీవుడ్‌లో ఒక సినిమా ప్రారంభం కాకముందే దాని చుట్టూ చర్చలు రేపడం కొంతమంది డైరెక్ట‌ర్ల‌కు మాత్రమే సాధ్యం. ఆ లిస్ట్ లో అనిల్ రావిపూడి పేరు ముందువరుసలో ఉంటుంది. తన సినిమాల్లో వినోదాన్ని ఎలా ప్లాన్ చేస్తారో, అదే తరహాలో ప్రమోషన్‌లను కూడా డిజైన్ చేయడం ఆయన ప్రత్యేకత. తాజాగా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త మల్టీస్టారర్‌కు సంబంధించిన తొలి మ్యూజిక్ సిట్టింగ్స్‌తోనే అనిల్ మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే మ్యూజిక్ సిట్టింగ్స్ ను వినోదాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచేశారు. సాధారణంగా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే స్టూడియోలో జరిగే సాధారణ ప్రక్రియగా భావిస్తారు. కానీ అనిల్ రావిపూడి దాన్నే ఒక చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్‌గా మార్చేశారు. పాత తెలుగు కామెడీని గుర్తు చేసే శైలిలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్రకాష్ కుమార్‌తో రూపొందించిన సరదా వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

ఈ సందర్భంగా మరొక ఆసక్తికర అంశం కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అదే అనిల్ రావిపూడి మ్యూజిక్ డైరెక్టర్ల ఎంపిక. తన కెరీర్‌ను పరిశీలిస్తే ఆయన ఒకే మ్యూజిక్ డైరెక్ట‌ర్ తో ఎక్కువకాలం కొనసాగడం కన్నా, కొంత గ్యాప్ తీసుకుని తర్వాత కొత్త సంగీత శైలిని తన సినిమాల్లోకి తీసుకురావడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. కెరీర్ ప్రారంభ దశలో కొన్ని సినిమాల‌కు ఒకే సంగీత దర్శకుడితో పనిచేసిన అనిల్, ఆ తర్వాత తన సినిమాల స్థాయి పెరిగిన కొద్దీ సంగీతంలోనూ వైవిధ్యాన్ని వెతికారు. దేవిశ్రీ ప్రసాద్, తమన్, భీమ్స్ సిసిరోలియో వంటి విభిన్న శైలుల మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌తో కలిసి పనిచేస్తూ ప్రతి సినిమాకు కొత్త ఆడియో గుర్తింపును తీసుకురావడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత కీలకమో ఆయనకు బాగా తెలుసు.

ఇటీవలి కాలంలో ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. ఒకప్పుడు పాటలు హిట్ అయితే సినిమా ప్రచారానికి చాలు అనుకునేవారు. ఇప్పుడు మాత్రం పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు పెద్ద బలం అవుతోంది. సోషల్ మీడియా రీల్స్ నుంచి థియేటర్‌లో ఎలివేషన్ సీన్స్ వరకు మ్యూజిక్ ఎఫెక్ట్ చాలా క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది. అందుకే అనిల్ రావిపూడి ఈసారి కొత్త ఫీల్ కోసం జీవి ప్రకాష్ కుమార్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జీవీ ప్రకాష్ ఇటీవల అందించిన పలు ఆల్బమ్‌లు, ఎమోషనల్ మెలోడీలు, ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా సీన్ కు త‌గ్గ ఎమోష‌న్స్ ను మ్యూజిక్ తో మరింత బలంగా చూపించగల సామర్థ్యం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవ‌చ్చు.

వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇమేజ్, కళ్యాణ్ రామ్ మాస్ ప్రెజెన్స్ ఉన్న ఈ మల్టీస్టారర్‌కు అలాంటి సంగీతం కొత్త ఆకర్షణగా మారే అవకాశం కనిపిస్తోంది. అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నించడం తెలిసిందే. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సినిమాను కూడా 2027 సంక్రాంతి టార్గెట్ గా రెడీ చేస్తున్నట్లు సమాచారం. అయితే సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, సంగీతంతోనే ప్రమోషన్‌లకు శ్రీకారం చుట్టడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు తొలి బజ్‌ను సృష్టించడంలో అనిల్ ఇప్పటికే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. షూటింగ్ ప్రారంభం కాకముందే మ్యూజిక్ చుట్టూ చర్చలు మొదలయ్యాయంటే, అనిల్ రావిపూడి తన తదుపరి సంక్రాంతి ప్రయాణాన్ని ఎంత ప్లాన్డ్‌గా ప్రారంభించారో అర్థం చేసుకోవచ్చు. జీవీ ప్రకాష్ అందించే సంగీతం ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు ఎంత పెద్ద బలంగా మారుతుందనే దానిపైనే ఇప్పుడంద‌రి దృష్టి ఉంది.