'ఎక్కువ మాట్లాడినందుకు రోల్ కట్'
తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో నటుడు వడ్లమాని శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్న అనిల్ రావిపూడి మరోసారి తన కామెంట్స్ తో నవ్వించారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.
By: M Prashanth | 13 Jun 2026 11:06 AM ISTటాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాలతో ఎంత ఎంటర్టైన్మెంట్ పంచుతారో.. మూవీ ఈవెంట్స్ లోనూ అంతే సరదాగా మాట్లాడుతుంటారు. ఆయన వేసే పంచ్ లు, కౌంటర్స్ అభిమానులను ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో నటుడు వడ్లమాని శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్న అనిల్ రావిపూడి మరోసారి తన కామెంట్స్ తో నవ్వించారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.
ఆ ఈవెంట్ లో ముందు మాట్లాడిన వడ్లమాని శ్రీనివాస్.. అనిల్ రావిపూడితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన సినిమాల్లో నటించడం తన కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు. అనిల్ దర్శకత్వంలో నటించిన చిత్రాల గురించి ప్రస్తావిస్తూ తాను ఏడు సినిమాలు చేశానని పేర్కొన్నారు. అయితే ఆయన మాట్లాడిన తర్వాత మైక్ అందుకున్న అనిల్ రావిపూడి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
"నేను ఇప్పటివరకు తొమ్మిది సినిమాలు చేశాను. వడ్లమాని శ్రీనివాస్ ఆరు సినిమాల్లో మాత్రమే నటించారు. కానీ ఒకటి కలిపి ఏడు అని చెప్పేశారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాల్లో ఆయన లేరు. ఎఫ్ 2 నుంచి మా టీమ్ లో చేరారు" అంటూ నవ్వులు పూయించారు. అక్కడితో ఆగకుండా ఇంకా ఫన్ చేశారు. "వేదికపై తక్కువ మాట్లాడతానని చెప్పి చాలా ఎక్కువ మాట్లాడారు. అందుకే ఒక వేషం కట్. మరో మిస్టేక్ ఏంటంటే లక్ష్మణ్ గారిని పట్టుకుని శిరీష్ అని పిలిచారు" అంటూ ఫన్నీగా వార్నింగ్ ఇచ్చారు.
అనిల్ వ్యాఖ్యలకు కార్యక్రమంలో ఉన్నవారంతా నవ్వుకున్నారు. వడ్లమాని శ్రీనివాస్ కూడా చిన్న చిరునవ్వుతో రెస్పాండ్ అయ్యారు. అయితే అనిల్ రావిపూడి, వడ్లమాని మధ్య ఉన్న రిలేషన్ స్పెషల్. ఒకప్పుడు వైజాగ్ లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన వడ్లమాని శ్రీనివాస్.. యాక్టింగ్ పై ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ ప్రయాణంలో అనిల్ రావిపూడి ఆయనకు అండగా నిలిచారని పలుమార్లు శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు.
ముఖ్యంగా ఎఫ్ 2 తర్వాత వరుస అవకాశాలు రావడానికి అనిల్ ఎంకరేజ్మెంట్ కారణమని ఆయన చెబుతుంటారు. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల ద్వారా వారిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దర్శకుడు-నటుడి రిలేషన్ ను దాటి మంచి స్నేహితులుగా కొనసాగుతున్న వీరిద్దరి మధ్య ఉండే ఫన్నీ కనర్వేజషన్స్ అభిమానులను ఆకట్టుకుంటుంటాయి.
అయితే అదే ఈవెంట్ లో తన నెక్స్ట్ ప్రాజెక్టుపై కూడా అనిల్ రావిపూడి అప్డేట్ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న తన కొత్త సినిమా జూన్ 18న అధికారికంగా ప్రారంభం కానుందని తెలిపారు. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు. అలా నార్మల్ ఈవెంట్ ను కూడా తన ఫన్ తో సందడిగా మార్చడం అనిల్ రావిపూడికే సాధ్యమని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. సరదాగా "వేషం కట్" అంటూ చేసిన కామెంట్స్ అక్కడున్న వారిని మాత్రమే కాదు.. సోషల్ మీడియాలోనూ సినీ ప్రియులను నవ్విస్తున్నాయి.
