'అనిల్ రావిపూడి లోకల్'.. చదువుకున్న కాలేజ్ లోనే బాస్ సాంగ్ లాంచ్
అనిల్ రావిపూడి తను చదువుకున్న కాలేజ్ లోనే మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని మెగా విక్టరీ మాస్ సాంగ్ ను లాంచ్ చేశారు.
By: M Prashanth | 30 Dec 2025 6:03 PM ISTఅనిల్ రావిపూడి తను చదువుకున్న కాలేజ్ లోనే మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని మెగా విక్టరీ మాస్ సాంగ్ ను లాంచ్ చేశారు. ఇక అనిల్ స్టేజ్ ఎక్కగానే విజ్ఞాన్ యూనివర్సిటీ దద్దరిల్లిపోయింది.. "అనిల్ రావిపూడి లోకల్" అంటూ ఆయన మైక్ అందుకోగానే స్టూడెంట్స్ చేసిన గోల మాములుగా లేదు. ఒకప్పుడు ఇదే క్లాస్ రూమ్స్ లో వెనుక బెంచ్ లో కూర్చుని, క్లాసులు బంక్ కొట్టి సినిమాలు చూసిన రోజులను అనిల్ గుర్తు చేసుకున్నారు.
ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తన తండ్రి చేత తిట్లు తిన్న విషయాన్ని, ఇక్కడ నుంచే ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఇండస్ట్రీకి వెళ్లిన జర్నీని చాలా సరదాగా, ఎమోషనల్ గా స్టూడెంట్స్ తో పంచుకున్నారు. స్టేజ్ మీద అనిల్ కాస్త ఎమోషనల్ అయ్యారు. తన లైఫ్ టర్న్ అవ్వడానికి కారణం 'విజ్ఞాన్ మహోత్సవ్' అని చెప్పారు. ఆ ఈవెంట్ లో పాల్గొని షీల్డ్ గెలుచుకోవడం తనలో కాన్ఫిడెన్స్ నింపిందని, ఆరోజే తన టాలెంట్ ఏంటో తనకు అర్థమైందని అన్నారు. చదువుతో పాటు మనలో ఉన్న టాలెంట్ ని నమ్ముకుంటే, లైఫ్ లో ఏదైనా సాధించవచ్చని స్టూడెంట్స్ కి గట్టి మోటివేషన్ ఇచ్చారు.
"చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను.. వాళ్ళని డైరెక్ట్ చేయడం నా డ్రీమ్" అంటూ అనిల్ తన మనసులో మాట చెప్పారు. ఇప్పటికే వెంకీ, బాలయ్యలతో సినిమాలు చేశానని, ఇప్పుడు మెగాస్టార్ ని డైరెక్ట్ చేయడం తన కెరీర్ లోనే బెస్ట్ ఆపర్చునిటీ అని మురిసిపోయారు. ఇక మెగాస్టార్ గురించి చెబుతూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు. "ఈ సినిమా కోసం బాస్ చాలా బరువు తగ్గారు.. ఫుడ్ విషయంలో, హెల్త్ విషయంలో చాలా డిసిప్లిన్ గా ఉంటూ స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా తయారయ్యారు" అని కితాబిచ్చారు.
జనవరి 12న థియేటర్లలో కొత్త చిరంజీవిని చూసి పండగ చేసుకుంటారని, ఆయన పెర్ఫార్మెన్స్, ఎనర్జీ చూసి మీరు సర్ప్రైజ్ అవుతారని గట్టిగా చెప్పారు. అలాగే విక్టరీ వెంకటేష్ గారు స్పెషల్ క్యామియో చేశారని అంటూ.. "ఇద్దరు స్టార్స్ చేసిన అల్లరి, ఆ డ్యాన్స్.. థియేటర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. మీరందరూ ఈలలు వేయడం ఖాయం" అని అన్నారు.
చివరగా అనిల్ తనలోని స్పోర్ట్స్ మ్యాన్ షిప్ ని చాటుకున్నారు. తన సినిమాతో పాటు ప్రభాస్ 'రాజాసాబ్', రవితేజ సినిమాలు కూడా చూసి సంక్రాంతిని 'మూవీ ఫెస్టివల్' లా జరుపుకోవాలని కోరారు. ఇక "హీరోగా చేస్తారా?" అని యాంకర్ అడిగితే.. "మనం సక్సెస్ ట్రాక్ లో ఉన్నప్పుడు బావుంటుంది.. పొరపాటున అటు వెళ్లి తేడా కొడితే 'ఫట్' అంటారు.. మనకు డైరెక్షనే కరెక్ట్" అంటూ తనదైన స్టైల్ లో నవ్వించేశారు.
