Begin typing your search above and press return to search.

కాంబోకు నో కాదు.. ఆ వార్తకే అనిల్ బ్రేక్!

మహేష్ బాబు ‘వారణాసి’ తర్వాత చేయబోయే సినిమా గురించి అప్పుడే లెక్కలు మొదలయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి అనిల్ రావిపూడి పేరు గట్టిగా వినిపించింది.

By:  M Prashanth   |   25 Aug 2026 9:23 PM IST
కాంబోకు నో కాదు.. ఆ వార్తకే అనిల్ బ్రేక్!
X

మహేష్ బాబు ‘వారణాసి’ తర్వాత చేయబోయే సినిమా గురించి అప్పుడే లెక్కలు మొదలయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి అనిల్ రావిపూడి పేరు గట్టిగా వినిపించింది. ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయబోతున్నారని, ‘వారణాసి’ తర్వాత మహేష్ త్వరగా పూర్తి చేసే ప్రాజెక్ట్‌గా దీనిని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. 2028 సంక్రాంతి రిలీజ్ అనే మాట కూడా బయటకు వచ్చింది.

అయితే కొన్ని గంటల్లోనే అనిల్ రావిపూడి స్పందించాడు. మహేష్ తనకు ఎప్పుడూ ఎంతో దగ్గరైన వ్యక్తి అని, ఆయనపై తనకు చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయని చెప్పాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాజెక్ట్ వార్తల్లో మాత్రం నిజం లేదని క్లియర్ చేశాడు. ఇలాంటి రూమర్స్‌ను నమ్మొద్దని, షేర్ చేయొద్దని కూడా కోరాడు. అంటే ఇప్పటికైతే మహేష్ అనిల్ సినిమా ఫిక్స్ అయిందనే వార్తకు బ్రేక్ పడినట్టే.

ఈ వార్త అంత త్వరగా నమ్మేలా మారడానికి కూడా కారణం ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’తో ఇద్దరూ ఇప్పటికే కలిసి పనిచేశారు. ఆ సినిమా తర్వాత అనిల్‌తో మళ్లీ సినిమా చేస్తానని మహేష్ కూడా అప్పట్లో చెప్పాడు. అనిల్ ఎనర్జీ తనకు బాగా నచ్చిందని, మరోసారి కలిసి పనిచేయాలని ఉందని ఓపెన్‌గా మాట్లాడాడు. అందుకే ఇప్పుడు ఈ కాంబినేషన్ పేరు బయటకు రాగానే పూర్తిగా కొత్త రూమర్‌లా అనిపించలేదు.

ప్రస్తుతం ఇద్దరి లైనప్ కూడా బిజీగానే ఉంది. మహేష్ రాజమౌళి దర్శకత్వంలోని ‘వారణాసి’తో ఉన్నాడు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. మరోవైపు అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో ‘జనవరి 12 విడుదల’ చేస్తున్నాడు. ఈ సినిమాను 2027 జనవరి 12న థియేటర్లలోకి తీసుకురానున్నారు.

అనిల్ సినిమాలు స్పీడ్ గా పూర్తి చేస్తాడనే పేరు ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ను కూడా మహేష్‌తో ఐదు నెలల్లో పూర్తి చేశారు. ఇప్పుడు ‘వారణాసి’లాంటి భారీ సినిమా తర్వాత మహేష్ ఒక ఫాస్ట్ కమర్షియల్ సినిమా చేస్తే అనిల్ మంచి ఆప్షన్ అవుతాడనే లెక్కతోనే ఈ రూమర్ మరింత బలపడింది. కానీ ఇప్పటివరకు అలాంటి ప్రాజెక్ట్‌పై చర్చలు ఫిక్స్ కాలేదని అనిల్ పోస్టుతో క్లారిటీ వచ్చింది.

అయితే తన పోస్టులో అనిల్ భవిష్యత్‌లో మహేష్‌తో సినిమా ఉండదని ఎక్కడా చెప్పలేదు. ప్రస్తుతం తిరుగుతున్న వార్తనే తప్పు అని చెప్పాడు. గతంలో ఇద్దరూ మరోసారి కలిసి పనిచేయాలని చెప్పుకున్న హిస్టరీ కూడా ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ పూర్తిగా క్యాన్సల్ అనే లెక్క కాదు. ఇప్పటికైతే మాత్రం ‘వారణాసి’ తర్వాత మహేష్ ఎవరితో వెళ్తాడన్నది ఇంకా సస్పెన్స్ లోనే ఉంటుంది.