తొలి టాలీవుడ్ డైరెక్టర్‌గా అనిల్ సరికొత్త రికార్డ్!
టాలీవుడ్‌లో ఎంత మంది క్రేజీ డైరెక్టర్లు, టాప్ డైరెక్టర్లు ఉన్నా హిట్ మెషీన్ అనిల్ రావిపూడి స్టైలే వేరు.
By: Tupaki Entertainment Desk | 19 Jan 2026 12:48 PM ISTటాలీవుడ్‌లో ఎంత మంది క్రేజీ డైరెక్టర్లు, టాప్ డైరెక్టర్లు ఉన్నా హిట్ మెషీన్ అనిల్ రావిపూడి స్టైలే వేరు. ఆయన ట్రాకే సెపరేటు. మిగతా డైరెక్టర్లలో అత్యధిక శాతం మంది పాన్ ఇండియా సినిమాల వెంట పరుగెడుతూ రూ.200 కోట్ల మార్కుని దాటేందుకు ఆపసోపాలు పడుతుంటే అనిల్ మాత్రం చాలా సింపుల్‌గా.. పాన్ ఇండియాని టచ్ చేయకుండానే అద్భుతాలు సాధిస్తున్నాడు. మేకర్స్‌ని, స్టార్స్‌ని, సగటు సినీ ప్రేక్షకుడినీ తనదైన మార్కు కామిక్ మ్యాజిక్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్లలో తన స్టైలే వేరని నిరూపించుకుంటున్నాడు.
కెరీర్ ప్రారంభం నుంచి జంధ్యాల మార్కు కామెడీ అంశాలకే పెద్ద పీటవేస్తూ..దానికి భార్యా భర్తలకు సంబంధించిన సున్నితమైన ఫ్యామిలీ రిలేషన్‌ని జోడిస్తూ దాని చుట్టూనే కథలని రన్ చేస్తూ బ్లాక్ బస్టర్లని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. మిగతా డైరెక్టర్లంతా యాక్షన్, మాస్ మసాలా అంశాల చుట్టూ పరుగెడుతుంటే అనిల్ మాత్రం చాలా కూల్‌గా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కామెడీ, యాక్షన్ అంశాలని జోడించేస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూ అంతా అవాక్కయ్యేలా చేస్తున్నాడు.
తను సాధిస్తున్న సక్సెస్‌లని చూసి మిగతా డైరెక్టర్లు ఇది ఎలా సాధ్యం అవుతోందని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారంటే అనిల్ రావిపూడి తన సినిమా కథలని ఏ స్థాయిలో డీల్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. తన మార్కు ఓ ఫార్ములాని క్రియేట్ చేసుకుని కెరీర్ ప్రారంభం నుంచి అనిల్ వరుసగా తొమ్మిది సూపర్ హిట్‌లని సొంతం చేసుకున్నాడు. ఇది దర్శకుడిగా అనిల్ సాధించిన రేర్ రికార్డ్. టాలీవుడ్‌లో ఈ ఫీట్‌ని సాధించిన రెండవ డైరెక్టర్‌గా అనిల్ ఇప్పటికే సరికొత్త రికార్డ్‌ని సొంతం చేసుకున్నాడు.
తాజాగా అనిల్ రావిపూడి ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఏడాదికో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తూ బ్లాక్ బస్టర్ హిట్‌లని సొంతం చేసుకుంటున్న అనిల్ గత ఏడాది 2025 సంక్రాంతికి వెంకీ మామతో `సంక్రాంతికి వస్తున్నాం` మూవీని అందించిన విషయం తెలిసిందే. సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల దుమ్ముదులిపింది. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైనే రాబట్టి ట్రేడ్ వర్గాలని షాక్‌కు గురి చేసింది. దర్శకుడిగా అనిల్ రావిపూడిని మరో మెట్టు ఎక్కించింది.
ఇక ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `మన శంకరవరప్రసాద్ గారు` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రారంభం నుంచే అందరిలోనూ అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతోంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ.292 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ రూ.200 కోట్ల మార్కు వసూళ్లని రాబట్టిన సినిమాలని అందించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి సరికొత్త రికార్డుని సొంతం చేసుకోవడం విశేషం. రానున్న రోజుల్లో ఈ మూవీ మరింతగా వసూళ్లని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
