దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!
మొదటి సినిమా హిట్ అయితే చాలు రెండో సినిమాకే ప్రస్తుతం చాలామంది దర్శకులు ఫ్లాప్ తెచ్చుకుంటున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 3 Nov 2026 3:03 PM ISTమొదటి సినిమా హిట్ అయితే చాలు రెండో సినిమాకే ప్రస్తుతం చాలామంది దర్శకులు ఫ్లాప్ తెచ్చుకుంటున్నారు. అలాంటిది వరసగా అన్ని సినిమాలు హిట్ అవడమంటే తప్పకుండా దర్శకుడు గొప్పతనం చాలానే ఉంటుంది.
ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత వరుసగా విజయాలు అందుకుంటున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ దర్శకుడు నటుడిగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
అనిల్ రావిపూడి సినిమాలు అంటే కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు చాలా ప్రత్యేకత ఉంటుంది. ప్రేక్షకులను నవ్విస్తూ, భావోద్వేగాలకు గురిచేస్తూ సినిమాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనతో సినిమా చేయడానికి హీరోలు కూడా ఆసక్తి చూపిస్తుంటారు.
దర్శకుడిగా మాత్రమే కాకుండా టెలివిజన్ షోలకు హోస్ట్‌గా కూడా అనిల్ రావిపూడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో పలుమార్లు తనకు నటనపై ఆసక్తి ఉందని కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన కోరిక నెరవేరబోతోంది.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న 'ENE Repeat' సినిమాలో అనిల్ రావిపూడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక ఫిల్మ్ మేకర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలోనే అనిల్ రావిపూడి కూడా దర్శకుడి పాత్రలోనే కనిపించబోతున్నారంట. సినిమాలో రెండు సన్నివేశాల్లో ఆయన కనిపిస్తారని తెలుస్తోంది. దీంతో అనిల్ రావిపూడిని నటుడిగా తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో అభినవ్ గోమటం, అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. రూట్ నోడ్ సినిమా, ఎస్ ఒరిజినల్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మరోవైపు అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో తన తదుపరి సినిమా జనవరి 12 విడుదల పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. మరి దర్శకుడుగానే కాకుండా ఈ డైరెక్టర్ నటుడుగా మారి.. ఎలాంటి విషయాలు అందుకుంటారో వేచి చూడాలి.
