Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి.. నెక్స్ట్ ఇది ఫిక్స్ అయినట్లేనా?

ఈ ప్రాజెక్ట్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోను ఎంపిక చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ​నిజానికి అనిల్ రావిపూడికి వెంకటేష్ టైమింగ్ అంటే చాలా ఇష్టం.

By:  M Prashanth   |   24 Jan 2026 3:03 PM IST
అనిల్ రావిపూడి.. నెక్స్ట్ ఇది ఫిక్స్ అయినట్లేనా?
X

​టాలీవుడ్‌లో ప్లాప్ లేని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, తన 10వ సినిమాతో ఏ రకమైన మ్యాజిక్ చేయబోతున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా తొమ్మిది బ్లాక్‌బస్టర్లు కొట్టిన అనిల్, తన తదుపరి ప్రాజెక్టును ఎవరితో పట్టాలెక్కిస్తారనే దానిపై రోజుకో వార్త వినిపిస్తోంది. ముఖ్యంగా అగ్ర హీరోలందరూ ఆయనతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో, అనిల్ ఎంచుకోబోయే ఆ 'పదో' కథ ఎవరి కోసం అనేది ఆసక్తికరంగా మారింది.

​గత కొద్ది రోజులుగా అనిల్ రావిపూడి, అక్కినేని అఖిల్ కోసం ఒక మాస్ ఎంటర్టైనర్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అఖిల్ ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసేలా ఒక డిఫరెంట్ కథను అనిల్ రెడీ చేశారని, వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోందని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. అఖిల్ ప్రస్తుతానికి వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, అనిల్ తన ఫోకస్‌ను మళ్ళీ తనకు అచ్చొచ్చిన విక్టరీ వైపు తిప్పినట్లు తెలుస్తోంది.

​ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం, అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్‌తోనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఇది మామూలు సినిమా కాదు, ఒక భారీ మల్టీస్టారర్ అని టాక్. వెంకటేష్‌తో పాటు దగ్గుబాటి రానా కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఒకే స్క్రీన్ మీద బాబాయ్ అబ్బాయ్ గొడవ పడుతుంటే లేదా కలిసి కామెడీ చేస్తుంటే చూడాలనుకునే ఫ్యాన్స్ ఆశను అనిల్ నెరవేర్చబోతున్నారని ఇన్ సైడ్ టాక్.

​ఈ క్రేజీ కాంబోను 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన 'F2', 'F3', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన మెగాస్టార్ 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో కూడా వెంకీ కనిపించి మరో సక్సెస్ లో బాగమయ్యాడు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలుస్తుండడంతో, దానికి రానా తోడవ్వడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.

ఈ ప్రాజెక్ట్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోను ఎంపిక చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ​నిజానికి అనిల్ రావిపూడికి వెంకటేష్ టైమింగ్ అంటే చాలా ఇష్టం. వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు రానా కూడా ఈ టీమ్‌లోకి వస్తే, ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. 'మన శంకరవరప్రసాద్ గారు' వంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత, అనిల్ మళ్ళీ తన ఫేవరెట్ జోనర్ అయిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.

​ఇక ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. అఖిల్ సినిమా ఉంటుందా లేక ఈ దగ్గుబాటి మల్టీస్టారర్ పట్టాలెక్కుతుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అనిల్ రావిపూడి తన సక్సెస్ స్ట్రీక్‌ను 10వ సినిమాతో కూడా కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ దగ్గుబాటి హీరోల కాంబో నిజమైతే మాత్రం బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డులు తిరగరాయడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.