ఆస్కార్ రేసులో నాగాలాండ్ చిత్రం!
టోరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో నాగాలాండ్‌కు చెందిన `ఆంగ్` చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది.
By: Srikanth Kontham | 21 Sept 2026 3:16 PM ISTటోరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో నాగాలాండ్‌కు చెందిన `ఆంగ్` చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. నాగా దర్శకుడు తేజా రియో తెరకెక్కించిన ఈ చిత్రం టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన `ప్లాట్‌ఫామ్ ప్రైజ్` అవార్డును గెలుచుకుంది. ఈ ఘనవిజయంతో చిత్రం నేరుగా అకాడమీ అవార్డుల (ఆస్కార్) `బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్` కేటగిరీకి అర్హత సాధించి భారతీయ చలనచిత్ర రంగానికి గొప్ప గర్వకారణంగా నిలిచింది. నాగా దర్శకుడు తేజా రియో 2021లో రూపొందించిన ఓ అవార్డు గ్రహీత లఘు చిత్రం ఆధారంగా `ఆంగ్` ఫీచర్ ఫిల్మ్‌ను నిర్మించారు.
1960ల కాలంనాటి నాగాలాండ్ నేపథ్యంతో సాగే సినిమాను దాదాపు పూర్తిగా అక్కడ స్థానిక `కొన్యాక్` భాషలోనే చిత్రీకరించడం విశేషం. వెండితెరపై అరుదుగా కనిపించే నాగాలాండ్ సంస్కృతి, వారి జీవితాల్లో వచ్చిన మార్పులను ఈ చిత్రం ఎంతో సహజంగా , లోతుగా ఆవిష్కరించింది. తండ్రి, కొడుకుల మధ్య సాగే భావోద్వేగాల చుట్టూ చిత్ర కథ తిరుగుతుంది. మత ప్రచారకులు అందించే సౌకర్యాల వైపు కొడుకు ఆకర్షితుడవుతుండగా మరోవైపు స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రాచీనమైనవిగా ముద్ర వేసి మార్చే ప్రక్రియను సినిమాలో ఆకట్టుకునేలా చూపించారు.
ఈ చిత్రంలో దర్శకుడి ధైర్యం, సరికొత్త దృక్పథం , పకడ్బందీ మేకింగ్‌ను కొనియాడుతూ ఫెస్టివల్ జ్యూరీ ప్లాట్‌ఫామ్ ప్రైజ్‌ను ప్రకటించింది. ఈ ఏడాది నుంచే టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ప్లాట్‌ఫామ్ ప్రైజ్ సాధించిన చిత్రాలకు ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి నేరుగా అర్హత పొందే అవకాశం లభిస్తుంది. దీంతో 2027 ఆస్కార్ బరిలో ఇతర అంతర్జాతీయ చిత్రాలతో పాటు భారత్ నుంచి `ఆంగ్` చిత్రం కూడా అధికారికంగా పోటీపడనుంది. ప్రాంతీయ నేపధ్యం ఉన్న భారతీయ చిత్రం నేరుగా ఈ తరహా ఆస్కార్ అర్హత సాధించడం విశేషం.
ఇదిలా ఉండగా టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యున్నత పురస్కారమైన పీపుల్స్ ఛాయిస్ అవార్డు ను స్పానిష్ చిత్రం `లా బోలా నెగ్రా` దక్కించుకుంది. `లాస్ జేవిస్` (జావియర్ అంబ్రోసీ, జావియర్ కాల్వో) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముగ్గురు వ్యక్తుల జీవితాల ఆధారంగా రూపుదిద్దుకుంది. అలాగే పీపుల్స్ ఛాయిస్ కేటగిరీలో `ఐ ప్లే రాకీ` ప్రథమ రన్నరప్‌గా `బీయింగ్ హ్యూమన్` ద్వితీయ రన్నరప్‌గా నిలిచాయి. అంతర్జాతీయ విభాగంలో పీపుల్స్ ఛాయిస్ అవార్డును ఆండ్రూ స్కాట్ నటించిన `ఎల్సినోర్` సొంతం చేసుకోగా.. డాక్యుమెంటరీ విభాగంలో `డార్లీన్ లవ్: ఐ నో వేర్ ఐవ్ బీన్` అవార్డును గెలుచుకుంది.
