Begin typing your search above and press return to search.

నటులు లేని ఊరి నుంచి ఆస్కార్ రేసు వ‌ర‌కూ!

టోరంటో వేదికగా `ఆంగ్` సాధించిన విజయం.. ఆస్కార్ బరిలో నిలవడం ఇప్ప‌టికే అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి.

By:  Srikanth Kontham   |   22 Sept 2026 10:27 AM IST
నటులు లేని ఊరి నుంచి ఆస్కార్ రేసు వ‌ర‌కూ!
X

టోరంటో వేదికగా `ఆంగ్` సాధించిన విజయం.. ఆస్కార్ బరిలో నిలవడం ఇప్ప‌టికే అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి. అయితే ఈ చారిత్రాత్మక విజయం వెనుక 31 ఏళ్ల యువ దర్శకుడు తేజా రియో చూపించిన అపారమైన పట్టుదల, వృత్తిపట్ల అతనికున్న అమితమైన ప్రేమ దాగి ఉన్నాయి. ఎలాంటి సినీ పరిశ్రమా లేని ప్రాంతం నుంచి వచ్చి కేవలం కథపై నమ్మకంతో అంతర్జాతీయ స్థాయి చిత్రాన్ని ఆవిష్కరించడంలో తేజా రియో పడిన శ్రమ ప్రతి సినీ ప్రేమికుడిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కోహిమాలో జన్మించిన తేజా రియో ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని యూకేలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్కూల్ లో సినిమా నిర్మాణంలో శిక్షణ పొందారు. విదేశాల్లో ప్రపంచస్థాయి సాంకేతికతను, సినిమా మెళకువలను నేర్చుకున్నప్పటికీ ఆయన మనసంతా ఎప్పుడూ మట్టిపైనా, నాగా సంస్కృతిపైనే ఉండేది. 2021లో తాను తీసిన లఘు చిత్రాన్ని పూర్తి నిడివి ఫీచర్ ఫిల్మ్‌గా మార్చాలనుకున్నప్పుడు నాగాలాండ్‌లో కనీస సినీ మౌలిక వసతులు కూడా లేవని తెలిసినా ఆయన అడుగు వెనక్కి వేయలేదు.

ప్రొఫెషనల్ నటులు, సాంకేతిక నిపుణులు అందుబాటులో లేకపోవడమే ఈ ప్రయాణంలో తేజా ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. దీనికోసం ఆయన ఎంచుకున్న మార్గం స్ట్రీట్ కాస్టింగ్. నాగాలాండ్‌లోని గ్రామాలు తిరుగుతూ, వీధుల్లో కనిపించిన సామాన్య ప్రజలను నేరుగా కలిసి పాత్రలకు ఎంపిక చేశారు. జీవితంలో ఎప్పుడూ ఫిల్మ్ సెట్‌ను కూడా చూడని ఊరి జనాన్ని నటులుగా మార్చడం చిన్న విషయం కాదు. వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి, కెమెరా ముందు సహజసిద్ధంగా నటించేలా శిక్షణ ఇవ్వడంలో తేజా రియో పడిన శ్రమ అసాధారణమైనది.

భారత్-మయాన్మార్ సరిహద్దులోని అత్యంత దుర్గమమైన కొన్యాక్ గ్రామంలో, పరిమిత వనరులతో చిత్రీకరణ జరపడం తేజా విజన్‌కు నిదర్శనం. ప్రపంచంలో కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే మాట్లాడే అత్యంత అరుదైన కొన్యాక్ భాషలోనే ఈ సినిమాను తీయాలని రియో తీర్మానించుకున్నారు. డిజిటల్ యుగంలోనూ సినిమాకు ఆర్గానిక్ లుక్ తీసుకురావడం కోసం డిజిటల్ కెమెరాలను కాదని క్లిష్టమైన 16 ఎమ్ ఎమ్ ఫిల్మ్‌పై చిత్రీకరించడం ఆయన మేకింగ్ శైలికి, సినిమా పట్ల ఉన్న అంకితభావానికి సాక్ష్యంగా నిలుస్తుంది.

కథ పరంగా కూడా తేజా రియో ఎక్కడా రాజీపడలేదు. మారుతున్న కాలంలో కనుమరుగవుతున్న గిరిజన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవాలనుకునే చివరి తెగ నాయకుడి అంతర్మథనాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. గ్రామీణ ప్రజల నుంచి నటనాపరమైన ఎమోషన్లను రాబట్టడమే కాకుండా స్కాటిష్ నటుడు డౌగ్లాస్ హెన్షాల్ వంటి ప్రొఫెషనల్‌ను ఈ సెటప్‌లోకి తీసుకొచ్చి నాన్-యాక్టర్లతో సరిసమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకునేలా సీన్లు డిజైన్ చేయడంలో తేజ‌ రియో దర్శకత్వ పటిమ స్పష్టంగా కనిపిస్తుంది.

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కష్టపడే తత్వంతో మారుమూల గ్రామం నుంచి ఆస్కార్ రేసు వ‌ర‌కూ తన సినిమాను తీసుకెళ్లడం తేజా రియో సాధించిన అసాధారణ విజయం. `మా మట్టి వాసనను, సంస్కృతిని ప్రపంచానికి చూపించడమే నా లక్ష్యం` అని చెప్పే తేజా సినిమాపై ఉన్న అపరిమితమైన ప్రేమతో ఎదురొచ్చిన ప్రతీ సవాలునూ అధిగమించారు. తేజా రియో పడిన శ్రమ, సాధించిన విజయం రాబోయే తరం స్వతంత్ర చిత్రనిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.