క్యాడర్ పదవులు దక్కితే పార్టీలు బలపడినట్లేనా ?
ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు అంత ఖరీదు అంటే పదవులు వెల్లువగా వస్తాయి. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో పదవులు ఉంటాయి.
By: Satya P | 22 Oct 2026 12:12 PM ISTఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు అంత ఖరీదు అంటే పదవులు వెల్లువగా వస్తాయి. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో పదవులు ఉంటాయి. వందలాదిగా సర్పంచులు, అలాగే ఎంపీటీసీలు, ఇక కీలక ఎంపీపీ జెడ్పీటీసీ పదవులు ఉంటాయి. మున్సిపాలిటీలు ఉంటే చైర్మన్ పదవులు అదనం. ఇవన్నీ కార్యకర్తలకే దక్కుతాయి. తమ వెంట ఉండే క్యాడర్ కి పదవులు అధికారం అప్పగిస్తే వారు మరింతగా బలోపేతం అయితే ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేలు ఆయా పార్టీలు బలం పుంజుకుంటాయి అన్నది ఉంది. అందుకే స్థానిక ఎన్నికలు అనేసరికి మిత్ర పక్షాలు ప్రతిపక్షాలు అన్నీ కలసి ఒక్క లెక్కన పోటీ పడుతున్నాయి.
జనంతో మమేకం :
ఎంత బలవంతుడైన సమర్ధుడైన ఎమ్మెల్యే అయినా తన నియోజకవర్గంలో ఉండే రెండు లక్షలకు పైగా ఓటర్లను నేరుగా కలవలేడు. అలాగే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ వారికి వివరించలేడు. అందుకే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉంటే ఆయన పని సులువు అవుతుంది. అది కూడా తమ పార్టీకి చెందిన వారు ఉంటేనే తమకు జనంలో మంచి పేరు వస్తుంది అన్నది ఉంది. ఈ కారణాలతోనే స్థానిక ఎన్నికలను ప్రతీ ఎమ్మెల్యే కూడా ప్రతిష్టగా తీసుకుంటున్నారు. ఇక ప్రజలతో నిరంతరం టచ్ లో ఉండేది క్యాడర్, వారికి పదవులు వస్తే ప్రజలకు ఎంతో కొంత చేసేందుకు వీలు ఉంటుంది. ప్రజలు కూడా వారి వద్దకే వెళ్ళేందుకు వీలు అవుతుంది. అలా మంచి పనులు చేస్తే అది ప్రజలలో అనుకూలతను తెచ్చి ఆ ఎమ్మెల్యేలకు రాజకీయ పార్టీలకు కూడా వచ్చే ఎన్నికల్లో సానుకూలతను తెస్తుంది అని అంటారు.
రాజ్యాంగబద్ధ హోదా :
ఇక చూస్తే స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలు రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 1992లో 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాలు 1993 ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చాయి. దాంతో నేరుగా కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు నిధులు వచ్చి చేరుతాయి. వాటితో గ్రామాల్లో కానీ పట్టణాలలో కానీ అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు అవుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటు ఇవన్నీ అదనంగా ఉంటాయి. దాంతో కూడా ఈ పదవులకు దర్జా గౌరవం ప్రాధాన్యత పెరిగాయి. ఇక రాజకీయ పార్టీల కోణంలో నుంచి చూసుకున్నపుడు నాయకుడు అన్న వాడు స్థానికంగానే రావాలి. అలా కింది పదవులు చేపట్టి తరువాత కాలంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వారు ఎదిగేందుకు దోహదపడేవి కూడా స్థానిక ఎన్నికలు. అందుకే ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అందరూ స్థానిక ఎన్నికల మీదనే ఫోకస్ పెడుతున్నారు.
అభివృద్ధి జరగాలి :
అయితే స్థానిక ఎన్నికల చుట్టూ ఎంత రాజకీయం అల్లుకున్నా ప్రజలు అవన్నీ చూడరు. వారు కోరుకునేది తమ ప్రాంతాలు అభివృద్ధి చెందాయా లేదా అన్నది. తమ ప్రాంతాలకు రోడ్లు వచ్చాయా, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా తాగునీటి సదుపాయం ఉందా, డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది, ప్రాధమిక అవసరాలు తీరుతున్నాయ ఇవన్నీ మాత్రమే జనాలు చూస్తారు, వాటినే పట్టించుకుంటారు. ఏ రాజకీయ పార్టీ ప్రతినిధి అన్నది జనాలకు అవసరం. ఇంకా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ లో రాజకీయ పార్టీల గురించి జనంలో ఎక్కువగా ఆలోచన ఉండదు, ఎవరు ఎన్ని సీట్లు గెలిచారు అన్నది జనం కోణంలో ప్రమాణం కాదు, సార్వత్రిక ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు మధ్య ఈ తేడా జనాలకు బాగా తెలుసు. అందుకే వారు తమ మేలు చూసే వారికి తమకు సన్నిహితంగా ఉండే వారికే ఓటు వేస్తారు. ఇక గ్రామాలలో అయితే పార్టీ రహితంగానే ఎన్నికలు ఉంటాయి. సర్పంచులు అంటే గ్రామానికే నాయకుడు. అయితే వీటి వెనక కూడా రాజకీయ పార్టీల పరోక్ష మద్దతు ఉండడం, గెలిచిన వారిని తమ ఖాతాలో వేసుకోవడం వల్ల ప్రధానంగా గ్రామీణ అభివృద్ధి మీద అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గ్రామాలు ప్రగతి విషయంలో ఒక్క మాట మీద ఉంటేనే సాధ్యపడుతుంది అని అంటున్నారు.
