Begin typing your search above and press return to search.

రామ్‌కే కాదు.. స్టార్లందరికీ ఇది పాఠం

ప్రోమోలు బాగున్నాయి. సినిమాకు విడుదల ముంగిట పాజిటివ్ బజ్‌యే కనిపించింది. రివ్యూలు పాజిటివ్‌గా వచ్చాయి.

By:  Garuda Media   |   3 Dec 2025 2:00 AM IST
రామ్‌కే కాదు.. స్టార్లందరికీ ఇది పాఠం
X

ప్రోమోలు బాగున్నాయి. సినిమాకు విడుదల ముంగిట పాజిటివ్ బజ్‌యే కనిపించింది. రివ్యూలు పాజిటివ్‌గా వచ్చాయి. పబ్లిక్ టాక్ బాగుంది. సోషల్ మీడియాలో కూడా ఎటు చూసినా సినిమా గురించి పాజిటివిటీనే కనిపించింది. అయినా సరే.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రానికి ఆశించిన వసూళ్లు రాకపోవడం ఇండస్ట్రీకి పెద్ద షాక్. మంచి సినిమా తీసినా ఆదరించరా అనే డిస్కషన్ నడుస్తోందిప్పుడు. రామ్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. అసలీ సినిమా విషయంలో ఏం తప్పు జరిగింది.. ఎందుకు ఆడలేదు అన్నది ఇండస్ట్రీలో కూడా పెద్ద డిస్కషన్ పాయింట్‌గా మారింది.

ఐతే సినిమా ఎలా ఉందన్న దాని కంటే.. అనేక ఇతర విషయాలు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మీద ప్రతికూల ప్రభావం చూపాయన్నది విశ్లేషకుల మాట. రిలీజ్ టైమింగ్ పెద్ద మైనస్ అంటున్నారు. నవంబరులో మామూలుగా పేరున్న సినిమాలు రిలీజ్ కావు. ఆ నెలను చిన్న సినిమాలకు వదిలేస్తుంటారు. ఈ నెలలో ఇప్పటికే ‘గర్ల్ ఫ్రెండ్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ బాగా ఆడాయి. ఇక వచ్చే వారం ‘అఖండ-2’ లాంటి భారీ చిత్రం రాబోతుండగా.. జనాలు దాని కోసం డబ్బులు దాచిపెట్టుకుని ఉండొచ్చు. అందుకే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మీద ఆసక్తి చూపించలేదని భావించవచ్చు.

ఐతే వీటన్నింటికంటే ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు ప్రతికూలంగా మారింది. అదే.. రామ్ కెరీర్లో స్లంప్. అతను ఎప్పుడో 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్టు కొట్టాడు. అది కూడా ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయం ఉంది. దానికి ముందు, వెనుక అన్నీ ఫ్లాపులే. చివరి మూడు చిత్రాలు డబుల్ ఇస్మార్ట్, స్కంద, ది వారియర్ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. దీంతో ప్రేక్షకులకు అతడిపై నమ్మకం తగ్గిపోయింది. తన జడ్జిమెంట్ పూర్తిగా దెబ్బ తిందనే అభిప్రాయం బలపడింది. పైగా ‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్నాడు. వరుస ఫ్లాపులకు తోడు, గ్యాప్ వల్ల జనం రామ్‌ను లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అతడికి మాస్‌లోనే ఫాలోయింగ్ ఎక్కువ. వాళ్ల దృష్టిని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఆకర్షించలేకపోయింది. క్లాస్ ఫ్యాన్స్ ఆల్రెడీ అతడితో డిస్కనెక్ట్ అయిపోయారు. అన్నింటికీ మించి కెరీర్లో వచ్చిన గ్యాప్ అతణ్ని ప్రేక్షకులకు దూరం చేసింది. మంచి సినిమాలు ఎంచుకోకపోవడం, కెరీర్లో గ్యాప్ రావడం రెండూ రామ్‌కు ప్రతికూలంగా మారి తన సినిమాకు మంచి టాక్ వచ్చినా జనం థియేటర్లకు రాని పరిస్థితి వచ్చింది. వరుసగా ఫ్లాపులిస్తే.. కెరీర్లో గ్యాప్ వస్తే మంచి సినిమా చేసినా ఫలితం ఉండదు అనడానికి ఇది ఉదాహరణ.