ఆంధ్ర కింగ్ తాలూకా బాక్సాఫీస్.. మౌత్ టాక్ మహిమ
బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఏ అద్భుతం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు భారీ హైప్ తో వచ్చిన సినిమాలు ఉదయం షోకే తేలిపోతాయి.
By: M Prashanth | 28 Nov 2025 10:51 AM ISTబాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఏ అద్భుతం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు భారీ హైప్ తో వచ్చిన సినిమాలు ఉదయం షోకే తేలిపోతాయి. మరికొన్నిసార్లు సైలెంట్ గా వచ్చి, మెల్లగా పుంజుకుని సంచలనాలు సృష్టిస్తాయి. నిన్న విడుదలైన 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఉదయం టికెట్ బుకింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలు కాస్త కంగారు పడ్డా, సాయంత్రానికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. కంటెంట్ ఉంటే జనం ఎలా బ్రహ్మరథం పడతారో ఈ సినిమా మరోసారి నిరూపించింది.
నిజానికి గురువారం సినిమా రిలీజ్ అంటేనే పెద్ద రిస్క్. వీకెండ్ వరకు ఆగకుండా ముందే రావాలంటే సినిమా మీద గట్టి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే ఇప్పుడు నిజమైంది. ఉదయం షోలకు రెస్పాన్స్ స్లోగా ఉన్నా, మ్యాట్నీ నుంచి "సినిమా బాగుంది" అనే ఒక్క మాట బయటకు రాగానే థియేటర్ల దగ్గర వాతావరణం మారిపోయింది. ఆ ఒక్క 'మౌత్ టాక్' సినిమా రాతను మార్చేసింది.
రామ్ పోతినేని నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' బాక్సాఫీస్ జర్నీ చాలా ఆసక్తికరంగా మొదలైంది. ఉదయం డల్ గా కనిపించినా, సాయంత్రం అయ్యేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా సెంటర్లలో ఏకంగా 80 నుంచి 90 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. కొన్ని చోట్లయితే 100 శాతం ఆక్యుపెన్సీతో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఇది కేవలం రామ్ కు ఫ్యామిలీస్, యూత్ లో ఉన్న ఫాలోయింగ్ వల్లే సాధ్యమైంది.
ఈ అనూహ్యమైన జంప్ కు ప్రధాన కారణం సినిమాలో ఉన్న కంటెంట్. ముఖ్యంగా రామ్ పోతినేని 'సాగర్' పాత్రలో జీవించిన తీరు, లుక్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన సహజమైన అందం, నటనతో ఆడియన్స్ మనసు గెలుచుకుంది. సీనియర్ నటుడు ఉపేంద్ర పాత్ర, వివేక్ మెర్విన్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎసెట్ గా మారాయి. పాజిటివ్ రివ్యూలు కూడా తోడవ్వడంతో జనం థియేటర్లకు క్యూ కట్టారు.
ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా సృష్టిస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. అమెరికాలో మొదటి రోజే ఏకంగా 250K డాలర్ల గ్రాండ్ ఓపెనింగ్ దక్కించుకుంది. అక్కడ థాంక్స్ గివింగ్ వీకెండ్ నడుస్తుండటంతో, రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మాస్ హీరో సినిమాకు అక్కడ ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం మంచి విషయం. మొత్తానికి మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు మహేష్ బాబు పి కాంబినేషన్ సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. గురువారమే ఇలా ఉంటే, ఇక శుక్ర, శని, ఆదివారాల్లో వసూళ్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. స్లోగా మొదలైనా, ఇప్పుడు బాక్సాఫీస్ రేసులో 'ఆంధ్ర కింగ్' టాప్ గేర్ లో దూసుకెళ్తున్నాడు.
