ఫ్యాన్స్ గొడవలకు 'ఆంధ్ర కింగ్' సమాధానం చెబుతాడా?
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగే యుద్ధాలే ఎక్కువగా కనిపిస్తాయి.
By: M Prashanth | 20 Nov 2025 5:19 PM ISTఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగే యుద్ధాలే ఎక్కువగా కనిపిస్తాయి. రికార్డుల కోసం, కలెక్షన్ల కోసం బూతులు తిట్టుకోవడం ఒక కామన్ ట్రెండ్ అయిపోయింది. "అసలు ఆ హీరోకి నువ్వు ఉన్నావని కూడా తెలియదు, అయినా ఎందుకురా ఇంతలా కొట్టుకుంటారు? మీ జీవితాలు వాళ్ళేమైనా బాగుచేస్తారా?" అని చాలామంది బయటివాళ్ళు ఈతరం ఫ్యాన్స్ ను చూసి జాలిపడుతుంటారు, విమర్శిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే ఒక సెన్సిటివ్ పాయింట్ తో వస్తోంది 'ఆంధ్ర కింగ్ తాలూకా'.
అసలు ఒక అభిమాని ప్రేమకు అర్థం ఏంటి? హీరో అంటే కేవలం కటౌట్ మాత్రమేనా? కాదు, అంతకుమించి ఏదో బలమైన ఎమోషన్ ఉంది. ఈ సున్నితమైన పాయింట్ ను టచ్ చేస్తూ దర్శకుడు మహేష్ బాబు పి ఈ కథను రాసుకున్నట్లు లేటెస్ట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నేటి సోషల్ మీడియా వార్స్ లో కోల్పోతున్న ఆ "స్వచ్ఛమైన అభిమానాన్ని" గుర్తుచేసే ప్రయత్నంలా ఇది కనిపిస్తోంది.
అందుకే దర్శకుడు తెలివిగా కథను ఇప్పటి కాలంలో కాకుండా, 2000 నాటి కాలంలోకి తీసుకెళ్ళాడు. అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఫేక్ కలెక్షన్ల గొడవలు లేవు. కేవలం పేపర్ కటింగ్స్, థియేటర్ దగ్గర పండగ వాతావరణమే ఉండేది. ఆ నాస్టాల్జిక్ ఎమోషన్ ను బ్యాక్ డ్రాప్ గా తీసుకోవడం వల్ల, కథలో ఒక నిజాయితీ కనిపిస్తోంది. ఆనాటి ఫ్యానిజం ఎంత ప్యూర్ గా ఉండేదో చూపించడానికి ఈ సెటప్ పర్ఫెక్ట్ గా సరిపోయింది.
రామ్ పోతినేని ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లున్నాడు. ముఖ్యంగా ట్రైలర్ లోని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. హీరోని విమర్శించే వాళ్లకు గట్టి కౌంటర్ లా ఉన్నాయి. "వాడు ఉన్నాడని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకడిని ఉన్నానంటే అది వాడి వల్లే" అనే తరహా హీరో ఎమోషన్ కూడా బాగా కనెక్టవుతోంది. ఇలాంటి ఈ ఎమోషన్ పండటంలో రామ్ ఎనర్జీ కీ రోల్ ప్లే చేస్తోంది.
కేవలం అభిమాని ప్రేమే కాదు, ఒక హీరోకి ఉండాల్సిన బాధ్యతను కూడా ఈ సినిమా ప్రశ్నించేలా ఉంది. ఉపేంద్ర పాత్ర ద్వారా.. తనను నమ్ముకున్న అభిమాని కోసం హీరో ఏం చేశాడు? అనే కోణాన్ని కూడా చూపించబోతున్నారు. ఫ్యాన్స్ అంటే కేవలం టికెట్ కొనే కస్టమర్లు కాదు.. వాళ్ళు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనే మెసేజ్ ఇస్తే, అది ఇండస్ట్రీకి కూడా ఒక పాఠం అవుతుంది.
మొత్తానికి సోషల్ మీడియా గొడవలతో విసిగిపోయిన ఆడియన్స్ కు, ఈ సినిమా ఒక మంచి రిలీఫ్ అయ్యేలా ఉంది. ఇప్పటివరకు రాని ఒక యునిక్ పాయింట్ ఇది. గ్లోబల్ గా ట్రెండ్ అవుతున్న ఈ 'ఫ్యాన్ ఎమోషన్' గనుక థియేటర్లో కరెక్ట్ గా కనెక్ట్ అయితే, రామ్ కెరీర్ లో 'ఆంధ్ర కింగ్' ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం. నవంబర్ 28న ఈ ఎమోషనల్ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి.
