Begin typing your search above and press return to search.

అనసూయపై అసభ్యకర పోస్టులు.. యువకుడి అరెస్ట్!

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని కొంతమంది ఆకతాయిలు వారిపై అసభ్యకర, అభ్యంతరకర కామెంట్లు చేస్తూ వారిని మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు.

By:  Madhu Reddy   |   20 April 2026 7:18 PM IST
అనసూయపై అసభ్యకర పోస్టులు.. యువకుడి అరెస్ట్!
X

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని కొంతమంది ఆకతాయిలు వారిపై అసభ్యకర, అభ్యంతరకర కామెంట్లు చేస్తూ వారిని మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ సీనియర్ నటి రేణు దేశాయ్ పై కొంతమంది ఆకతాయిలు అసభ్యకరంగా పోస్ట్లు పెట్టడమే కాకుండా వారి పిల్లల్ని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వినరాని మాటలతో ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె ఏకంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి.. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకవైపు ప్రముఖ యాంకర్ అనసూయ పై కూడా అసభ్యకర కామెంట్లు చేస్తూ ఆమెను ఇబ్బందులకు గురి చేశారు.

అనసూయపై అసభ్యకర కామెంట్లు..

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేయడమే కాకుండా సమాజంలో జరిగే పలు అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది అనసూయ. అలాంటి ఈమెపై గత కొంతకాలంగా వ్యక్తిగతంగా సోషల్ మీడియా లో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ విమర్శలు ఇప్పుడు కాస్త హద్దుమీరాయి. ఈమెపై అభ్యంతరకర కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది అనసూయ.

యువకుడు అరెస్టు..

రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అనసూయ భరద్వాజ్ పై అసభ్యకరమైన పోస్ట్లు పెడుతున్న యువకుడిని అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన దోరేపల్లి చంటి అనే 30 సంవత్సరాల యువకుడిని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కనిపెట్టి అరెస్టు చేశారు. ఇతను ఇన్స్టాగ్రామ్ వేదికగా అనసూయ పై నిత్యం వ్యక్తిగత దూషణలకు పాల్పడడమే కాకుండా అత్యంత అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కంటెంట్ ను పోస్ట్ చేస్తున్నాడని పోలీసులు నిర్ధారించారు. 2025 డిసెంబర్ నుండే నిందితుడు అనసూయను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసుకొని వేధిస్తున్నట్లు అనసూయ తరఫు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీంతో పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పలు సెక్షన్ల కింద కేసు ఫైల్..

ఇకపోతే తాజాగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడమే కాకుండా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ లైన 75, 79, 336 (4), 351, 356, ఐటీ చట్టం సెక్షన్ 66 E(ప్రైవసీ ఉల్లంఘన), 67 (అశ్లీల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ప్రసారం చేయడం) తో పాటు పలు సెక్షన్లు ఈయనపై నమోదు చేశారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సరే సెలబ్రిటీలను కానీ ఇతర మహిళలను కానీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పోస్ట్లు పెడితే మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

ఇకనైనా మార్పు వస్తుందా?

సోషల్ మీడియా అనేది మంచికి ఉపయోగపడాలే కానీ మహిళలను వ్యక్తిగతంగా దూషించడానికి కాదు. ఇకపై ఎవరైనా సరే ఫేక్ అకౌంట్ల ద్వారా పోస్ట్లు పెడితే కచ్చితంగా కటకటాల వెనుక ఊసలు లెక్క పెట్టాల్సిందే అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో మార్పు రావాలి అని అధికారులు సైతం స్పష్టం చేశారు.