అనసూయకు అవకాశాలు తగ్గిన వేళ!
యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని నటిగా ఎదిగిన అనసూయ భరద్వాజ్ కెరీర్‌లో ప్రస్తుతం అవకాశాల కొరత కనిపిస్తోంది. గతంలో ‘రంగస్థలం’, ‘క్షణం’, ‘పుష్ప’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆమె ఈ ఏడాది ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. కథల ఎంపిక, నచ్చని పాత్రలను తిరస్కరించడం, సోషల్ మీడియా వివాదాలు అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయనే ప్రచారం ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. అయితే మంచి పాత్రలు వస్తే ఆమె మళ్లీ బిజీ కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
By: Srikanth Kontham | 14 Nov 2026 4:00 PM ISTబుల్లితెరపై యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు అనంతరం వెండితెరపై విలక్షణ నటిగా దూసుకెళ్లిన అనసూయ భరద్వాజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి నటిగా స్ఠిరపడటం అంత సులభం కాదు. కానీ అనసూయ మాత్రం దాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఆ రకంగా నవతరం యాంకర్లకు ఆదర్శంగానూ నిలిచింది. అయితే అనసూయ కెరీర్ లో ఇప్పుడు గ్యాప్ కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం వరకూ వరుస సినిమాలతో.. కీలకమైన పాత్రలతో టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్న భామకు ఏడాదిన్నరకాలంగా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదనే చర్చ ఫిలింనగర్ లో గట్టిగా వినిపిస్తోంది.
గత ఏడాది ఒకటిరెండు చిత్రాల్లో పలకరించిన అనసూయ ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమాలో కూడా కనిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏడాది ముగింపు వచ్చిన తరుణంలో అనసూయ ఖాతాలో కొత్త ప్రాజెక్ట్‌లు లేకపోవడంతో అమ్మడి కెరీర్‌లో ఊహించని మలుపుగా హైలైట్ అవుతుంది. ఒక్కసారి అనసూయ కెరీర్ చూస్తే.. `రంగస్థలం` చిత్రంలో రంగమ్మత్త పాత్రతో నటిగా గోల్డెన్ పీరియడ్ ప్రారంభమైంది. అనంతరం `క్షణం`, `ఖిలాడి`, `పుష్ప` వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు.
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న బలమైన పాత్రలను ఎంచుకుని ముందుకెళ్లారు. ఒక దశలో అనసూయ తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ బిజీ అయినట్లు కనిపించింది. అయితే ఈ రెండేళ్ల కాలంగా అమ్మడు జోరు తగ్గడం గమనించదగ్గ పరిణామం. ఇలా ఆఫర్లు తగ్గడానికి ప్రధాన కారణం కథల ఎంపికలో రంగమ్మత్త అనుసరిస్తున్న విధానమేనని కొంతమంది భావిస్తున్నారు. కొన్ని ఆఫర్లు వచ్చినా? పాత్రలు నచ్చకపోవడంతో తానే వదులకుందనే మాట బలంగా వినిపిస్తోంది.
అలాగే వివాదాలకు కేంద్రంగా మారడం కూడా అనసూయ కెరీర్‌పై కొంత ప్రభావం చూపిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు ధీటుగా స్పందించడం.. కొన్ని విషయాలపై మాట్లాడటం వంటి వాటి వల్ల కొంత వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో ఇమేజ్‌తో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే మేకర్స్ కొన్నిసార్లు ఇలాంటి వివాదాల జోలికి వెళ్లడానికి ఇష్టపడరనే వాదన కూడా ఉంది. ఆ కారణంగా కొన్ని అవకాశాలు కోల్పోతుందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయినా ఇలాంటి వివాదాలన్నీ తాత్కాలికం మాత్రమే. అనసూయ మనసు పెడితే సినిమాలు చేయడం పెద్ద విషయం కాదు. ఆర్సీ 17 లో సుకుమార్ పిలిచి ఇప్పటికిప్పుడు ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
