Begin typing your search above and press return to search.

నేపోటిజం కామెంట్ల‌పై న‌ట‌ వార‌సురాళ్లు ర‌చ్చ ర‌చ్చ‌

బాలీవుడ్ నెపోటిజం చర్చపై నటి అనన్య పాండే స్పందించారు. నటుడు చుంకీ పాండే కుమార్తె కావడం తనకు గర్వకారణమని, ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జెన్-జీ యువత బద్ధకస్తులనే అభిప్రాయం తప్పని పేర్కొన్నారు. గతంలో జాన్వీ కపూర్, సోనమ్ కపూర్, ఖుషీ కపూర్, సుహానా ఖాన్ కూడా నెపోటిజంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

By:  Sivaji Kontham   |   18 Nov 2026 11:12 AM IST
నేపోటిజం కామెంట్ల‌పై న‌ట‌ వార‌సురాళ్లు ర‌చ్చ ర‌చ్చ‌
X

బాలీవుడ్‌లో ఎప్పుడూ నానుతూనే ఉండే నెపోటిజం లేదా బంధుప్రీతి చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక మీడియా ఇంట‌రాక్ష‌న్‌లో యువ నటి అనన్య పాండే ఈ అంశంపై స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. 2019లో `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2` చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనపై నెపోటిజం విమర్శలు వస్తున్నా.. తన నేపథ్యాన్ని దాచుకోవడానికి తాను ఎప్పుడూ ప్రయత్నించనని అన‌న్య తెలిపారు. నటుడు చుంకీ పాండే కుమార్తె కావడం తనకు ఎంతో గర్వకారణమని..తన తండ్రితో ఉన్న అనుబంధానికి ఎలాంటి ప్రతికూల అర్థం రావడం తనకు ఇష్టం లేదని అన్నారు.

నాకు ద‌క్కిన అవ‌కాశాలు ఒక వ‌రం.. నేను అదృష్ట‌వంతురాలిన‌ని కూడా అన‌న్య వ్యాఖ్యానించారు. ప్ర‌తిరోజూ నిద్ర లేవ‌గానే దేవుడికి థాంక్స్ చెబుతాన‌ని.. నాకు గొప్ప విశేషాధికారం ద‌క్కింద‌ని చెబుతాన‌ని కూడా అన‌న్య పాండే అన్నారు. ఇదే వేదికపై జెన్-జీ పై వస్తున్న అపోహలను కూడా ఖండించారు. ఈ తరం బద్ధకస్తులని.. ఎక్కువ గంటలు పనిచేయడానికి ఇష్టపడరనే అభిప్రాయాలు తప్పు అని..నేటి తరానికి విజయం అంటే డెఫినిష‌న్ వేరే అని సమర్థించారు. తాను వ్యక్తిగతంగా ఎక్కువ గంటలు కష్టపడి పనిచేయడానికి ఇష్టపడినా ఈ తరానికి చెందిన కొందరు భిన్నంగా స్మార్ట్ గా ప‌ని చేస్తూ కూడా విజయం సాధిస్తున్నారని అన్నారు.

బాలీవుడ్‌లో నెపోటిజంపై కేవలం అనన్య పాండే మాత్రమే కాకుండా..ఇతర న‌ట‌ వారసులు కూడా గతంలో పలుమార్లు స్పందించారు. దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ వ్యాఖ్యానిస్తూ.. తాను ఇండస్ట్రీలో ప్రత్యేకంగా ప్రయత్నించకుండానే సులభంగా అవకాశాలు దక్కించుకున్నానని...ఇది బయటి వ్యక్తులకు అన్యాయం చేయడమేనని తనకు తెలుసని అంగీకరించారు. ``నేను నెపోటిజాన్ని పూర్తిగా సమర్థించలేను..ఎందుకంటే నేను దాని ఫలితమే`` అని స్పష్టం చేస్తూనే తనను కేవలం `నెపో కిడ్` అని ముద్ర వేసి ట్రోల్ చేయడం పై జాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభను బట్టి విమర్శిస్తే స్వీకరిస్తానని.. కానీ తన నేపథ్యాన్ని మాత్రమే చూసి మాట్లాడటం బాధాకరమని అన్నారు.

స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఈ విషయంలో మరింత బోల్డ్‌గా తన వాదనను వినిపించారు. ``తండ్రి పడిన కష్టాన్ని.. ఆయన సంపాదించుకున్న పేరును ఉపయోగించుకోకపోతే అది నాన్న గారి కష్టానికి చేసే అవమానం అవుతుంది`` అని సోన‌మ్ అభిప్రాయపడ్డారు. ప్రతి తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతాడని, ఆ శ్రమ వల్ల వచ్చిన ప్రివిలేజ్‌ని వాడుకోవడంలో ఎలాంటి తప్పులేదని సోనమ్ వాదించారు. అలాగే శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ .. షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా నెపోటిజంపై తమ అభిప్రాయాలను షేర్ చేసారు. తమ కుటుంబ నేపథ్యం వల్ల ఇండస్ట్రీలో దారి సులువుగా ఏర్పడినా... ఆ పేరును నిలబెట్టుకోవడానికి.. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి తాము కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.