Begin typing your search above and press return to search.

ట్రోలింగ్ తట్టుకోలేనంటూ న‌ట‌వార‌సురాలు తీవ్ర ఆవేదన

`లైగ‌ర్` బ్యూటీ అనన్య పాండే సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగెటివిటీ .. విపరీతమైన ట్రోలింగ్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Sivaji Kontham   |   30 May 2026 5:09 PM IST
ట్రోలింగ్ తట్టుకోలేనంటూ న‌ట‌వార‌సురాలు తీవ్ర ఆవేదన
X

`లైగ‌ర్` బ్యూటీ అనన్య పాండే సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగెటివిటీ .. విపరీతమైన ట్రోలింగ్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తాను న‌టిస్తున్న‌ `చాంద్ మేరా దిల్` ప్ర‌చారంలో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. నెటిజన్ల సాధింపులు త‌న‌ను ఎక్కువగా వేధిస్తున్నట్లు ఆవేద‌న చెంద‌డం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.




``నేను ఇకపై ఈ ట్రోలింగ్‌ను ఏమాత్రం భరించలేకపోతున్నాను.. దీనితో నేను పూర్తిగా విసిగిపోయాను`` అంటూ అనన్య పాండే సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం అనన్య మాత్రమే కాకుండా... చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర నటీమణులు కూడా గతంలో ఈ సైబర్ వేధింపులు, ట్రోలింగ్‌ను తట్టుకోలేక తీవ్రమైన మానసిక వేదనను అనుభవించినట్లు బహిరంగంగా ప్రకటించారు.

ఈ వేధింపుల కారణంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా జరిగిన వారిలో బాలీవుడ్ అగ్ర నటి ఆలియా భట్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఆలియా జనరల్ నాలెడ్జ్ విషయాలపై వచ్చిన మీమ్స్ నుండి.. ఆ తర్వాత వచ్చిన నెపోటిజం (వారసత్వ) వివాదాల వరకు ఆలియా తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొన్నారు. ఒక దశలో నెటిజన్ల అసభ్యకరమైన కామెంట్లు, బెదిరింపులను తట్టుకోలేక తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాల కామెంట్ సెక్షన్‌ను క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. ట్రోలింగ్ అనేది ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తుందో ఆ నరకాన్ని తాను స్వయంగా అనుభవించానని ఆలియా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

సౌత్ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మంద‌న్న, అన‌సూయ వంటి న‌టీమ‌ణులు కూడా ట్రోలర్ల బారిన పడి తీవ్రంగా నలిగిపోయారు. తన కెరీర్ ఎంపికలు, వ్యక్తిగత జీవితం, బాడీ లాంగ్వేజ్ .. చివరికి వారు మాట్లాడే విధానాన్ని కూడా నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. దీనిపై రష్మిక ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెడుతూ``ఇంటర్నెట్‌లో నాపై జరుగుతున్న ప్రచారం, అసత్యాలు నన్ను ఎంతో మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. నేను చేసే ప్రతి పనినీ విమర్శిస్తూ నన్ను ఒక పంచ్ బ్యాగ్‌లా వాడుకోవడం సిగ్గుచేటు. ఈ నరకాన్ని భరించడం నా వల్ల కావడం లేదు`` అంటూ తన బాధను వెళ్లగక్కారు. అయినా తన పనిపై దృష్టి పెట్టి కెరీర్‌లో దూసుకుపోతున్నారు. యాంక‌ర్ కం న‌టి అన‌సూయ ప‌లు సంద‌ర్భాల‌లో సోష‌ల్ మీడియా అతి గురించి ఎంతో ఆవేద‌న‌గా మాట్లాడారు. త‌న సామాజిక మాధ్య‌మాల‌లో కామెంట్ల సెక్ష‌న్ ని బ్లాక్ చేసారు.

మరో అగ్ర ద‌క్షిణాది నటి సమంత రూత్ ప్రభు కూడా సోషల్ మీడియా నెగెటివిటీ వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు. ముఖ్యంగా త‌న‌ వ్యక్తిగత జీవితంలోని పరిణామాలు.. విడాకుల సమయంలో నెటిజన్లు చేసిన వ్యక్తిగత దాడులు, లూజ్ కామెంట్లు త‌న‌ను తీవ్రంగా గాయపరిచాయి. ఆ సమయంలో సమంత మాట్లాడుతూ.. సోషల్ మీడియా అనేది ఒక అంధకార ప్రపంచంలా మారిపోయిందని.. ఎదుటివారి బాధను చూసి ఆనందించే వికృత మానసిక స్థితి ఎక్కువైపోయిందని ఆవేదన చెందారు. మానసికంగా బలంగా ఉండటానికి తాను సోషల్ మీడియాకు చాలా రోజుల పాటు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

అలాగే నటి సోనాక్షి సిన్హా అయితే నెటిజన్ల బాడీ షేమింగ్ (శారీరక రూపాన్ని హేళన చేయడం).. సైబర్ వేధింపులను తట్టుకోలేక తన అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను శాశ్వతంగా డిలీట్ చేసేశారు. నా మనశ్శాంతిని పాడుచేసే ఈ నెగెటివిటీ నాకు వద్దు! అంటూ సోనాక్షి డైరెక్ట్ గా త‌న క‌ల‌త గురించి దాచుకోకుండా చెప్పుకొచ్చారు. అనన్య పాండే నుండి సోనాక్షి వరకు ఈ తారలందరూ ఎదుర్కొంటున్న సమస్య ఒక్కటే.. అది ఇంటర్నెట్ వెనుక దాక్కుని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై విషం చిమ్మే `సైబర్ బుల్లీయింగ్`. స్టార్‌డ‌మ్ వెనుక ఉండే ఈ చీకటి కోణం నటీమణుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.