సబ్ స్క్రిప్షన్ ఫీచర్.. హీరోయిన్లపై గట్టి ఎఫెక్ట్ పడుతుందా?
సోషల్ మీడియా ప్రభావం సినీ ఇండస్ట్రీపై ఎంతగా పడుతుందో మరోసారి క్లియర్ గా తెలుస్తోంది.
By: M Prashanth | 21 April 2026 4:00 AM ISTసోషల్ మీడియా ప్రభావం సినీ ఇండస్ట్రీపై ఎంతగా పడుతుందో మరోసారి క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో సబ్ స్క్రిప్షన్ ఫీచర్ కారణంగా కొంతమంది హీరోయిన్ల కెరీర్ పై అనుకోని ప్రభావం పడుతున్నట్లు సమాచారం. చిన్న బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న కొంతమంది హీరోయిన్లు ఆ సబ్ స్క్రిప్షన్ మోడల్ ను ప్రారంభించడంతో, నిర్మాతలు వారిపై పునరాలోచన చేస్తున్నారట.
కొన్ని ప్రాజెక్టుల్లో ఇప్పటికే వారిని రీప్లేస్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు బ్యూటీ అనన్యా నాగళ్ల తన ఇన్ స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ పై స్పష్టత ఇచ్చారు! తన అకౌంట్ లో అందుబాటులో ఉన్న సబ్ స్క్రిప్షన్ ఫీచర్ గురించి రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయని, అందులో ఎలాంటి అనుచితమైన కంటెంట్ లేదని ఆమె వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తన ఫాలోవర్స్ తో ప్రత్యేకంగా కనెక్ట్ అవ్వడానికే ఆ ఫీచర్ ఉపయోగిస్తున్నానని, దానిని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆమె కోరినట్లు సమాచారం. మరోవైపు యాంకర్, నటి విష్ణు ప్రియ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ వ్యవహారం వివాదానికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఆ అంశంపై కేసు కూడా నమోదైనట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆ వివాదం ఆమెకు నష్టమా లాభమా అన్న దానిపై చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే ఆ వార్తల నేపథ్యంలో ఆమె సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. ముందు దాదాపు 1500 మంది మాత్రమే ఉన్న సబ్ స్క్రైబర్లు, ఇప్పుడు 7500 దాటినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వచ్చిన హైప్ ఆమె కెరీర్ కు సహకరిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా లేదు.
ప్రస్తుతం ఆమెకు ఉన్న ప్రధాన ప్రాజెక్ట్ ఆహాతో కాంట్రాక్ట్ మాత్రమేనని, కొత్త సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది సోషల్ మీడియా ఇమేజ్ ఎలా కెరీర్ పై ప్రభావం చూపుతుందనే దానికి ఉదాహరణగా మారింది. ఇటీవల సినీ రంగంలో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. హీరోయిన్లు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉండటం, తమ ఫాలోవర్స్‌తో ప్రత్యేక కంటెంట్ షేర్ చేయడం పెరిగింది. ఆ సమయంలో కొన్ని సార్లు హద్దులు దాటుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సబ్ స్క్రిప్షన్ బేస్ట్ కంటెంట్ విషయంలో నిర్మాతలు, దర్శకులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
చిన్న సినిమాల్లో నటించే హీరోయిన్లకు ఇమేజ్ చాలా కీలకం. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన వివాదాలు లేదా అపోహలు వారి అవకాశాలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అందుకే కొంతమంది నిర్మాతలు ముందుగానే రిస్క్ తీసుకోవడం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఏదేమైనా సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారన్న దానిపైనే ఇప్పుడు హీరోయిన్ల భవిష్యత్తు ఆధారపడుతుందని చెప్పడంలో డౌట్ లేదు.
