Begin typing your search above and press return to search.

LKG నుంచి క‌ళ‌ల్ని ఔపోష‌ణ ప‌డుతున్న తెలుగ‌మ్మాయి!

టాలీవుడ్‌లో ట్రెండింగ్ కథానాయికగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటోంది తెలుగమ్మాయి అనంతిక సనిల్ కుమార్.

By:  Sivaji Kontham   |   1 Sept 2026 6:00 AM IST
LKG నుంచి క‌ళ‌ల్ని ఔపోష‌ణ ప‌డుతున్న తెలుగ‌మ్మాయి!
X

టాలీవుడ్‌లో ట్రెండింగ్ కథానాయికగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటోంది తెలుగమ్మాయి అనంతిక సనిల్ కుమార్. చిన్నతనం నుంచే కళలను శ్వాసించిన ఈ భామ.. ప్రస్తుతం పొరుగు భాషల్లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ పరిశ్రమలో నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తోంది. ఎల్‌.కే.జీ చదువుతున్న రోజుల నుంచే నృత్యం, యుద్ధ విద్యలు (ఫైట్స్) వంటి విభిన్న కళా రూపాలను సాధన చేయడం తన అభిరుచిగా మార్చుకున్నానని తెలిపింది. శారీరక శ్రమతో కూడిన ఈ సాధనే నటిగా తన హావభావాలను, ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో దోహదపడిందని వివరించిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అవకాశం వచ్చిన ప్రతి భాషనూ గౌరవిస్తూ తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో సమాంతరంగా ప్రాజెక్ట్‌లు అంగీకరిస్తున్నట్లు అనంతిక వెల్లడించింది. ఊరికే ఇంట్లో సమయాన్ని వృథా చేయడం తనకు అస్సలు నచ్చదని.. దేవుడు రోజులో అందించే సమయాన్ని కళా సాధనకే కేటాయిస్తుంటానని పేర్కొంది. డ్యాన్స్, ర‌క‌ర‌కాల‌ పాత్రల సాధన ద్వారా నటనలోని లోతులను సులభంగా అర్థం చేసుకోగలిగానని తెలిపింది. ఏ ఒక్క భాషకే పరిమితం కాకుండా.. ఎక్కడ మంచి కథలు లభిస్తే అక్కడ తన నటనతో ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఈ యంగ్ బ్యూటీ వెల్లడించింది.

అనంతిక కథానాయికగా నటించిన తాజా చిత్రం `రోమాంచకం` విడుదలకు సిద్ధమవుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. `8 వసంతాలు` చిత్రం తర్వాత వచ్చిన అనేక కథలు తనను సంతృప్తి పరచలేదని, కానీ `రోమాంచకం` లైన్ వినగానే వెంటనే అంగీకరించానని అనంతిక‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది.

ఈ సినిమాలో తానొక చలాకీ (బబ్లీ) తమిళ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నానని.. ఇది తన డ్రీమ్ రోల్ అని అనంతిక సంతోషం వ్యక్తం చేసింది. నేటి తరం యువత జీవితాల్లో జరిగే వాస్తవిక అంశాలను, సమకాలీన సంఘటనలను ఎంతో ఆకట్టుకునేలా ఈ చిత్రంలో పొందుపరిచారు. హీరో సుమంత్ ప్రభాస్ ఎనర్జిటిక్ పాత్రకు ఏమాత్రం తగ్గకుండా తన క్యారెక్టర్ కూడా పోటాపోటీగా ఉంటుందని.. వీరిద్దరి మధ్య వచ్చే సంభాషణలు ఎంతో సహజంగా.. వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో అలరిస్తాయని తెలిపింది. ప్రేమతో పాటు హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఈ చిత్రం యూత్‌కే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని తెలిపింది.

షూటింగ్ సమయాన్ని ఎంతో హ్యాపీగా గడిపామని.. థియేటర్లలో ప్రేక్షకులకు కూడా అదే స్థాయి అనుభూతి లభిస్తుందని నటి అనంతిక ధీమా వ్యక్తం చేసింది. మ్యూజికల్ డ్రామా చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమని.. ఈ సినిమాలో సంగీతానికి చాలా పెద్ద పీట వేశారని పేర్కొంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని `రాధారమణ` పాట తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని అనంతిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. భిన్నమైన జానర్‌తో తెరకెక్కిన ఈ `రోమాంచకం` చిత్రం తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. టాలీవుడ్ లో వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్న తెలుగ‌మ్మాయి అనంతిక మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.