ఇంత టాలెంటెడ్ బ్యూటీ అనంతికకి కూడా ఆ కష్టం తప్పలేదా?
నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో మొదట అనంతిక సనీల్ కుమార్ కు అవకాశం లభించిందట.
By: Madhu Reddy | 29 Aug 2026 10:00 PM IST8 వసంతాలు సినిమాతో తనలోని టాలెంట్ నిరూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన అనంతిక సనిల్ కుమార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నటించిన చిత్రం రోమాంచికం. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగా.. నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి సమర్పించారు. తెలుగు రొమాంటిక్ , కామెడీ డ్రామా, సస్పెన్స్ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి టి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది అనంతిక. సుమంత్ ప్రభాస్ , అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొన్న అనంతిక ఎన్నో విషయాలను పంచుకుంది.
చిన్న వయసులోనే ఊహించని టాలెంట్..
ఐదు సంవత్సరాల వయసులోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించిన ఈమె.. భరతనాట్యం , కథకళి, కూచిపూడి, మోహినియాట్టంలో వృత్తిపరంగా శిక్షణ పొందింది. కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించిన ఈమె.. కేరళ సాంప్రదాయ యుద్ధ కళ అయిన కలరియ పట్టులో శిక్షణ పొందింది. 2022లో రాజమండ్రి రోజు మిల్క్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. 2023లో తెలుగు బ్లాక్ బాస్టర్ మూవీ మ్యాడ్ చిత్రంలో తన నటనతో విస్తృత ప్రజాదారణ పొందింది.
8 వసంతాలు చిత్రంతో ఊహించని పాపులారిటీ..
ఇక ఎనిమిది వసంతాలు సినిమాతో తన పరిణితి చెందిన ప్రధాన పాత్రకు విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. పైగా ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ఈమె టాలెంట్ బయటపడగా అందరూ ఆశ్చర్యపోయారు. అతి చిన్న వయసులోనే ఇంత టాలెంటా అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే వయసు పెరిగినా.. లుక్స్ మాత్రం ఇంకా చిన్నపిల్లలాగా కనిపించడం వల్లే ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుండి అవకాశాన్ని కోల్పోయినట్లు తెలిపింది.
ది ప్యారడైజ్ మూవీ నుండి ఛాన్స్ మిస్..
నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో మొదట అనంతిక సనీల్ కుమార్ కు అవకాశం లభించిందట. అయితే స్క్రీన్ టెస్ట్ చేయగా ఆమె లుక్స్ చాలా చిన్న పిల్లలాగా అనిపించడంతో పాత్రకు తగ్గ మెచ్యూరిటీ లేని కారణంగా సినిమా నుండి తప్పించినట్లు అనంతిక స్వయంగా తెలిపింది. అవకాశాలు చేజారినప్పుడు బాధ కలిగినా.. ఏది జరిగినా సానుకూలంగా ముందుకు సాగడమే తన నైజం అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఆర్థిక ఇబ్బందులు.. అప్పులు చేసి ఈవెంట్లకు వెళ్ళా..
ఇకపోతే ఇండస్ట్రీలోకి రావడానికి తాను పడ్డ కష్టం గురించి కూడా అనంతిక తెలిపింది.. "చిన్నప్పటి నుంచే నాకు కళలు అంటే చాలా ఇష్టం. ఆరవ తరగతి నుంచి నృత్య ప్రదర్శనలో పాల్గొనేదాన్ని. ఒక ప్రదర్శన ఇవ్వాలి అంటే చాలా ఖర్చు అయ్యేది. అయితే మా కుటుంబం ఆర్థికంగా వెనుకబడినా.. నన్ను ఎప్పుడూ మా అమ్మ నాన్నలు నిరాశపరచలేదు. అప్పులు చేసి మరీ నన్ను ఈవెంట్లకు పంపించేవాళ్లు". అంటూ తెలిపింది.
అందుకే ఇండస్ట్రీలోకి వచ్చాను..
ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.." మా అమ్మానాన్నల కష్టాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఇక వారిని గొప్పగా చూసుకోవాలనే లక్ష్యంతోనే నేను చిత్ర పరిశ్రమ లోకి వచ్చాను" అంటూ తెలిపింది అనంతిక. మొత్తానికైతే ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. టాలెంట్ ఉన్నప్పటికీ డబ్బు లేక ఆర్థికంగా ఇన్ని కష్టాలు పడ్డారా అంటూ అభిమానుల సైతం నిట్టూరుస్తున్నారు.
