Begin typing your search above and press return to search.

కల్కి కథపై అనంత శ్రీరామ్ వక్రీకరణ.. అసలు ఎలా సాధ్యమైంది అంటూ?

ముఖ్యంగా కల్కి సినిమాలో అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడు అని చూపించడం పై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు.

By:  Madhu Reddy   |   27 Jun 2026 12:37 PM IST
కల్కి కథపై అనంత శ్రీరామ్ వక్రీకరణ.. అసలు ఎలా సాధ్యమైంది అంటూ?
X

ప్రముఖ గీతా రచయిత అనంత శ్రీరామ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన గేయ రచనలతో.. గాత్రంతో శ్రోతలను ఆకట్టుకుంటున్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు లిరిక్స్ అందించి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. ఈ మధ్యకాలంలో అటు సినిమా పాటలకు లిరిక్స్ అందిస్తూనే.. ఇటు పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయారు. అలాంటి ఈయన తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని ఇతిహాసాలను వక్రీకరించే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటూ ప్రశ్నించారు . ముఖ్యంగా కల్కి సినిమాలో అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడు అని చూపించడం పై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు.

ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మాణంలో ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం కల్కి 2898 ఏడి. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో కర్ణుడి పాత్రను చిత్రీకరించడం పై అనంత శ్రీరామ్ అభ్యంతరాలు గతంలోనే వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడు అన్నట్టు చూపించడాన్ని ఆయన తప్పుపట్టారు. అలాగే తెలుగు సినిమాలలో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోందంటూ విజయవాడలో జరిగిన విశ్వహిందూ పరిషత్ హైందవ సభలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు యావత్తు సినిమా రంగం తరఫున హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నానని ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఇప్పుడు మరోసారి ఆయన స్పందించడంతో ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఈ విషయంపై అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. "రామాయణం, మహాభారతం ఇతిహాసాలలో మాట్లాడిన ప్రతి పదానికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. ప్రతి వాఖ్యానికి బాధ్యత తీసుకుంటున్నాను. వ్యాస భారతం, వాల్మీకి రామాయణం ఇవి మనకు పరమ ప్రమాణాలు. ముఖ్యంగా వాల్మీకి, వ్యాసుడు రాసిన ఈ ఇతిహాసాలను కదిలించడానికి మనకు ఎవరికి ఎలాంటి హక్కు లేదు. అర్హత లేదు. సినిమా రచయిత అయినా ఇంకో రచయిత అయిన సరే అందులోని పాత్రలను, పాత్ర ఔచిత్యాన్ని , తీరుతెన్నులను మార్చడానికి మనం ఎవరం.. అందుకే నేను క్షమాపణలు చెప్పాను అంటూ ఆయన తెలిపారు.

ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు మనం మంచి చేయాలే తప్ప అక్కడ లేని కల్పిత కథలను చూపించి యువతను తప్పుదోవ పట్టించలేము. వినోదాన్ని సాధనంగా తీసుకున్నప్పుడు క్రియేటివ్ పవర్ ఎంతైనా ఉండవచ్చు. వారి సృజనాత్మకతను, దర్శకత్వ ప్రతిభను నేను ప్రశ్నించను.. కానీ ఇతిహాసాలను ఇతిహాసాలుగా తీస్తేనే అద్భుతంగా ఉంటుంది . వాటిని అలాగే ఉంచి జానపదాల్లో, సాంఘికాలో కావలసినంత కల్పితం కూడా పెట్టుకోవచ్చు. ఇతి హా సం అంటే ఇది ఇలానే జరిగిందని అర్థం..జరిగినదాన్ని అలా జరగలేదని చెప్పడం తప్పు అనేదే నా పాయింట్. ముఖ్యంగా నేను ఏ ఒక్క సినిమాను ఉద్దేశించి ఈ మాట చెప్పడం లేదు. దర్శకుల ఆలోచన విధానాన్ని మాత్రమే తప్పుపడుతున్నాను. ముఖ్యంగా ఎక్కడ కూడా అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడు అని లిఖించబడలేదు. పైగా యుద్ధ రంగంలో అర్జునుడు పది అడుగులు వెనక్కి వేసినట్టు చూపించారు. అది ఎక్కడ జరిగింది? అంటూ ప్రశ్నించారు. మొత్తానికి అయితే ఇతిహాసాలను తప్పుదోవ పట్టిస్తూ తీస్తున్న కథలపై ఆయన విమర్శలు గుప్పించారు.

ఇకపోతే ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ మాట్లాడుతూ.. అంటే మీరు కల్కి 2 సినిమా కోసం పాటలు రాయరా అని ప్రశ్నించగా.. డబ్బులు ఇస్తే రాస్తాను. కాకపోతే అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడని రాయమంటే మాత్రం రాయలేను. పైగా నాతో వారు గొడవకు దిగి , ఆ గొడవలో వాళ్ళు నెగ్గితే ఓకే ...ఒకవేళ నేను ఓడిపోతే నేను రాయను అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.