డైరెక్టర్ గా రంగంలోకి మరో వారసుడు!
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 3 Jan 2026 3:24 PM ISTతెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించు కున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు సుబ్బయ్య దర్శకుడిగా కొనసాగారు. 'మూడు ముళ్ల బంధం'తో మొదలైన ఆయన దర్శక ప్రస్తానం `ఆలయం` వరకూ దిగ్విజయంగా కొనసాగింది. 'వందేమాతరం', 'అరుణ కిరణం', 'నవభారంతం', 'ధర్మయుద్దం', 'అన్నయ్య' ఇలా ఎన్నో హిట్ చిత్రాలను అందించిన ఘన చరిత్ర ఆయన సొంతం.
చివరిగా 2008లో 'ఆలయం' చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా రిటైర్మెంట్ ప్రకటించారు. నిర్మాతగా కూడా ఓ సినిమాకు పని చేసారు. అలాంటి లెజెండరీ డైరెక్టర్ వారసుడు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలొస్తున్నాయి. ముత్యాల సుబ్బయ్య తనయుడి పేరు అనంత కిషోర్. కన్నడలో విజయం సాధించిన `ది టాస్క్` అనే చిత్రాన్ని తెలుగులోకి అతడే అనువదిస్తున్నాడు. అనువాద చిత్రంగా అనంత కిషోర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.
ఇదొక యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్. త్వరలోనే సినిమా రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. ఈనేపథ్యంలోనే అనంత కిషోర్ క్రియేటివ్ విభాగంలోనూ రాణించాలనే ఆసక్తితో ఉన్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ఇప్పటికే అతడు సొంతంగా కొన్ని స్టోరీలు సిద్దం చేసి పెట్టుకున్నాడని.. వాటిలో తండ్రి సహకారం కూడా ఉందని ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. తండ్రి సూచనలు సలహాలతో ఇండస్ట్రీలో తనకున్న అనుభవాన్ని కూడా జోడించి కెప్టెన్ కుర్చీ ఎక్కడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి దర్శకుడిగా ప్రయత్నం ఆలస్యమైనా? మంచి సినిమాలు చేయాలని సుబ్బయ్య అభిమానులు కోరుకుంటున్నారు. దర్శకుడిగా తండ్రి పేరును నిలబెట్టాలని ఆశీస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో వారసులు అంటే? హీరోలగానే ఎక్కువగా లాంచ్ అవుతున్నారు. క్రియేటివ్ విభాగంలో రాణించడానికి టాలీవుడ్ వారసులు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈనేపథ్యంలో సుబ్బయ్య వారసుడు ఆలస్యమైనా ఓ ప్రయత్నం మాత్రం ప్రశంసనీయమే. మరి ఈ ప్రచారంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది. అనంత్ కిషోర్ ఇప్పటికే కొన్ని సినిమాలకు సమర్పికుడిగానూ పని చేసారు. `తల్లి మనసు` అనే చిత్రాన్ని స్వయంగా నిర్మించారు.
