అనంత్ ఒపీనియన్ మారినట్లు లేదుగా..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది టాలెంటెడ్ లిరిసిస్ట్స్ లో అనంత శ్రీరామ్ ఒకరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: M Prashanth | 13 March 2026 12:12 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది టాలెంటెడ్ లిరిసిస్ట్స్ లో అనంత శ్రీరామ్ ఒకరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆయన పద ప్రయోగాలు, లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. క్లాస్, మాస్, యూత్, రొమాంటిక్, టీజ్ సాంగ్.. ఇలా ఏ టైప్ పాట అయినా ప్రత్యేక శైలిలో రాయగలగడం ఆయన స్పెషాలిటీ.
పాటలు మాత్రమే కాకుండా సమాజానికి సంబంధించిన విషయాలపై కూడా ఆయన అప్పుడప్పుడు తన అభిప్రాయాన్ని ఓపెన్ గా వెల్లడిస్తుంటారు. అయితే కొంతకాలం క్రితం విడుదలైన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ఏడీలో మహాభారతంలోని కర్ణుడి పాత్రను అర్జునుడి కంటే గొప్పగా చూపించారని అప్పట్లో అనేక చర్చలు జరిగాయి. అదే విషయంపై అనంత శ్రీరామ్ కూడా ఘాటుగా స్పందించారు.
సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఇతిహాసాలను వక్రీకరించడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయవాడలో నిర్వహించిన హైందవ శంఖారావం సభలో కూడా అనంత శ్రీరామ్ అదే విషయాన్ని ప్రస్తావించారు. మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలు కేవలం కథలు కాదని, అవి మన చరిత్రలో భాగమని ఆయన పేర్కొన్నారు.
ఆ ఇతిహాసాల్లోని పాత్రలు తెలిసిన విధంగా అర్థం చేసుకుని రాసుకున్నామని, వాటిని ఇష్టం వచ్చినట్లు మార్చే హక్కు ఎవరికీ లేదని అన్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ అంశంపై మరోసారి స్పందించిన అనంత శ్రీరామ్, తన పాత వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు కేవలం వినోదం కోసం చెప్పిన కథలు కావని తెలిపారు.
అవి మన సంస్కృతి, చరిత్రకు సంబంధించినవని, కమర్షియల్ హంగుల కోసం ఒక పాత్రను పూర్తిగా మార్చి చూపించడం సరైంది కాదని చెప్పారు. ముఖ్యంగా కొన్ని పాత్రలను గొప్పగా ఎలివేట్ చేస్తే అది అంగీకరించలేని విషయమని అన్నారు. ఇంకా మాట్లాడుతూ, గతంలో ఇలాంటి విషయాలు ప్రశ్నించే అవకాశం చాలా తక్కువగా ఉండేదని చెప్పారు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియా వంటి ప్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి రావడంతో ప్రజలు కూడా తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అందుకే భవిష్యత్తులో కూడా ఎవరు పురాణాలను వక్రీకరించినా తాను అదే విధంగా స్పందిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కల్కిపై ఆయన ఒపీనియన్ మారలేదని చెప్పాలి. మొత్తానికి, తన అభిప్రాయాలను ఎలాంటి సందేహం లేకుండా ఓపెన్ గా చెప్పే అనంత శ్రీరామ్.. ఈసారి కూడా తన పాత వ్యాఖ్యలపైనే నిలబడుతూ మరోసారి చర్చకు కారణమయ్యారు.
