సినీ గీత రచయిత కావాలంటే...అనంత శ్రీరామ్ చెప్పిందిదే !
సినీ గీత రచయిత అన్నది చాలా మందికి ఆశగా ఉంటుంది. కవితలు రాసే వారు, కధలు రాసే వారు అంతా తమ ప్రతిభను చూసుకుని ఎప్పటికైనా వెండి తెర మీద తమ పేరు చూసుకోవాలని ఆశ పడతారు.
By: Satya P | 11 March 2026 1:00 AM ISTసినీ గీత రచయిత అన్నది చాలా మందికి ఆశగా ఉంటుంది. కవితలు రాసే వారు, కధలు రాసే వారు అంతా తమ ప్రతిభను చూసుకుని ఎప్పటికైనా వెండి తెర మీద తమ పేరు చూసుకోవాలని ఆశ పడతారు. అయితే సినీ గీత రచన అన్నది అంత సులువు కాదని ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు. ఒక వెబ్ చానల్ ఇంటర్వూలో అయన మాట్లాడుతూ సినీ గీతం రాయాలి అంటే నిరంతర పరిశ్రమ అవసరం అన్నారు. ఈ రంగంలోకి అడుగు పెట్టేవారు సాధన బాగా చేయాల్సి ఉంటుందని అంతే కాదు సహనం చాలా అవసరం అన్నారు.
పదకొండవ ఏటనే :
తాను సినీ గీతాలను రాయాలని నిర్ణయించుకుని పదకొండవ ఏటనే సాధన మొదలెట్టాను అని అన్నారు. ఫలితంగా ఇరవై ఏళ్ళు దాటేసరికి తాను నెమ్మదిగా పాటలను రాయడం మొదలెట్టాను అన్నారు. ఈ రోజున ఎవరైనా సినీ గీతాన్ని రాయాలని నిర్ణయించుకుంటే కచ్చితంగా అది ఒక పదిహేనేళ్ళ పాటు సాధన చేస్తే తప్ప తొలి పాట రాయలేరని ఆయన స్పష్టం చేశారు. సినీ పాట అంటే చాలా శ్రమ ఉంటుందని అన్నారు. ఎన్నో విషయాలను గ్రహిస్తూ ఎప్పటికపుడు అప్టూ డేట్ గా ఉండాలని అన్నారు.
తక్కువ మంది మాత్రమే :
ఇక టాలీవుడ్ లో స్ట్రైట్ సినిమాలు డబ్బింగ్ మూవీస్ అన్నీ కలుపుకుని ఏడాదికి మూడు వందలకు పైగా సినిమాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. సగటున సినిమాకు అయిదు పాటలు వేసుకున్నా 1500 సినీ గీతాలు రాయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే టాప్ సినీ లిరిసిస్టులు పది మంది మాత్రమే ఉన్నారని వీరంతా నెలకు ఒక్కొక్కరు ఆరు పాటలు రాస్తే ఫుల్ బిజీగా ఉన్నట్లు అని అంతకు మించి ఎవరూ రాయలేరని అన్నారు. అలా అంతా కలిసి ఏడాదికి 720 దాకా పాటలు మాత్రమే రాయగలుతారని ఆయన లెక్క చెప్పారు. ఆ మిగిలిన సగం పాటలు రాసేందుకు ఇంకా కొత్త వారికి అవకాశం ఉంటుందని అన్నారు. ఏ రంగంలో లేని సౌలభ్యం ఏమిటి అంటే సినీ గీత రచనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఈ రంగంలోకి వచ్చే వారు మాత్రం చాలా తక్కువ మంది అని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు. సాధన సాహిత్యం పట్ల అవగాహన అభిరుచి అన్నీ ఉంటే కనుక అనంత శ్రీరామ్ చెప్పినట్లుగా సినీ రంగంలో గీత రచయితగా సెటిల్ అయ్యేందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఆయన ఇచ్చిన సలహా సూచనలను మాత్రం అంతా ఫాలో అవాల్సి ఉంటుంది.
తనకు ప్రత్యేకం :
ఇక తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో 2026 ఒక ప్రత్యేకమైనది అని ఆయన అన్నారు. ఈ ఏడాది బ్రేకప్ సాంగ్స్, ఫ్రెష్ లవ్ సాంగ్స్, మాస్ సాంగ్స్, ఇంట్రడక్షన్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ ఇలా అన్ని జానర్లలోనూ కలిపి రాయడం ఈ ఏడాది సాధ్యపడుతోందని అన్నారు. తాను రాసిన పాటలతో రాబోతున్న సినిమాలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది తో పాటు, ప్రభాస్ స్పిరిట్ అలాగే మోస్ట్ అవైటింగ్ మూవీస్ ఎన్నో ఉన్నాయని చెప్పారు. పెద్దిలో ఒక పాట రాయడానికి తనకు రెండున్నర నెలల సమయం పట్టిందని ఆయన చెప్పారు. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పనిచేయాలని ఉప్పెన టైమ్ నుంచే అనుకున్నాను అని ఆయన చెప్పారు. అది పెద్ది మూవీతో తీరిందని అన్నారు. సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే దర్శకుడు బుచ్చిబాబు అని ఆయన అన్నారు.
