Begin typing your search above and press return to search.

సినిమా అవార్డుల్లో బంధుప్రీతి కి ప్రధాని మోదీ స్వస్తి పలికారు!

భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన 2024వ సంవత్సరపు `దాదాసాహెబ్ ఫాల్కే` అవార్డుకు ప్రముఖ కన్నడ నటుడు అనంత నాగ్ ఎంపికయ్యారు.

By:  Srikanth Kontham   |   17 Sept 2026 5:00 PM IST
సినిమా అవార్డుల్లో బంధుప్రీతి కి ప్రధాని మోదీ స్వస్తి పలికారు!
X

భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన 2024వ సంవత్సరపు `దాదాసాహెబ్ ఫాల్కే` అవార్డుకు ప్రముఖ కన్నడ నటుడు అనంత నాగ్ ఎంపికయ్యారు. ఈ శుభవార్త వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో చలనచిత్ర పురస్కారాల ఎంపిక ప్రక్రియలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చార‌ని... గ‌తంలో ఉండే పక్షపాతం, బంధుప్రీతి సంస్కృతికి ప్రధాని స్వస్తి పలికారని ప్రశంసించారు.

గతంలో ప్రతిష్టాత్మక పురస్కారాల ఎంపిక అనేది కేవలం ఒక ప్రత్యేక వర్గానికి లేదా రాజకీయ, వ్యక్తిగత సిఫార్సులకు మాత్రమే పరిమితమయ్యేదని అనంత నాగ్ వ్యాఖ్యానించారు. అయితే ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక అవార్డుల ఎంపిక ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా మార్చారని, సామాన్య ప్రజలను కూడా తమకు నచ్చిన ప్రతిభావంతుల పేర్లను సిఫార్సు చేయమని కోరడం ద్వారా వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చారన్నారు. ప్రజలు చూపిన అభిమానం, పారదర్శకమైన ఎంపిక విధానం వల్లనే తనకు ఈ గుర్తింపు దక్కిందని అభిప్రాయపడ్డారు.

ఈ అత్యున్నత గౌరవం లభించడంపై 79 ఏళ్ల అనంత నాగ్ ఆనందం సంతోషం వ్య‌క్తం చేసారు. ఈ అవార్డును అస్సలు ఊహించలేదన్నారు. అరుదైన పురస్కారాన్ని తనను ఐదు దశాబ్దాలుగా ఆదరించిన కర్ణాటక ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు, సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా అభినందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారతదేశానికి ధన్యవాదాలు తెలియజేశారు.

అనంత నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో అనంత నాగ్ కనబరిచిన అద్భుతమైన నటన, వైవిధ్యమైన పాత్రలు భారతీయ సినిమాపై, ముఖ్యంగా కన్నడ చిత్రసీమపై చెరగని ముద్ర వేశాయని ప్రధాని ప్రశంసించారు. ఆయన నటనలో ఉన్న లోతు, సహజత్వం కోట్లాది మంది ప్రేక్షకులను అలరించాయని కొనియాడారు.

ఐదు దశాబ్దాలకు పైగా విస్తరించిన అనంత నాగ్ సినీ జీవితంలో దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించారు. కన్నడతో పాటు హిందీ, మరాఠీ, కొంకణి భాషల్లో అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. 1970, 80ల నాటి సమాంతర సినిమా ఉద్యమంలో `అంకుర్`, `నిశాంత్`, `భూమిక` వంటి క్లాసిక్ చిత్రాల ద్వారా నటుడిగా ప్రత్యేక ముద్ర వేశారు. బుల్లితెరపై సంచలనం సృష్టించిన `మాల్గుడి డేస్` సీరియల్‌తో పాటు, ఆధునిక శకంలో `కేజీఎఫ్: ఛాప్టర్ 1` చిత్రంలో ఆనంద్ ఇంగలగిగా ఆయన పోషించిన పాత్ర విశేష ఆదరణ పొందింది.

ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పౌర పురస్కారాలు అందుకున్న అనంత నాగ్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని సెప్టెంబరు 22న గుజరాత్‌లోని కెవాడియాలో జరగనున్న జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో అందుకోనున్నారు. భారతీయ చిత్రసీమకు, ముఖ్యంగా దక్షిణ భారత రంగానికి ఆయన అందించిన సేవలకు గానూ దక్కిన ఈ గౌరవంపై సినీ ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.