సెలబ్రిటీల పిల్లలపై ట్రోలింగ్ సంస్కృతి!
సినిమా రంగంలో స్టార్ కిడ్స్ చిన్నప్పటి నుంచే లైమ్‌లైట్‌లో ఉంటారు. అయితే ఈ గుర్తింపు వారి వ్యక్తిగత జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
By: Srikanth Kontham | 18 Jun 2026 5:00 PM ISTసినిమా రంగంలో స్టార్ కిడ్స్ చిన్నప్పటి నుంచే లైమ్‌లైట్‌లో ఉంటారు. అయితే ఈ గుర్తింపు వారి వ్యక్తిగత జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో బాడీ షేమింగ్, సైబర్ బుల్లీయింగ్ వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ సీల కుమార్తె ఆనందిత సుందర్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో చిన్నప్పటి నుండి ఎదుర్కొన్న ట్రోలింగ్‌పై మనసు విప్పి మాట్లాడారు. తాను - తన సోదరి అవంతిక చిన్నప్పుడు బొద్దుగా ఉండేవారమని.. వయసు పెరుగుతున్న కొద్దీ ఊబకాయం సమస్యను ఎదుర్కొన్నామని ఆనందిత తెలిపారు.
దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో తాము ఫిట్‌గా మారాలని నిశ్చయించుకున్నామన్నారు. అయితే 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నెటిజన్లు తన రూపాన్ని ఉద్దేశించి చేసిన హేయమైన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయన్నారు. సెలబ్రిటీల పిల్లలైనంత మాత్రాన తమను అంతలా విమర్శించే హక్కు ఎవరిచ్చారంటూ? ఆవేదన వ్యక్తం చేశారు. ఆనందిత ఇటీవల కాలంలో ఎంతో స్లిమ్‌గా మారి సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఆమె బరువు తగ్గడం వెనుక ఏవైనా సర్జరీలు ఉన్నాయా ? బరువు తగ్గే మందులను ఉపయోగించారా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఈ పుకార్లపై ఆమె ఘాటుగా స్పందించారు.
ఎలాంటి సర్జరీలు కానీ, మందులు కానీ లేకుండానే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అవాస్తవాలను వ్యాప్తి చేసేవారి నోళ్లు నొక్కారు. తన శారీరక మార్పు రాత్రికి రాత్రే జరగలేదని ఇదొక సుదీర్ఘమైన ప్రయాణమని ఆనందిత తెలిపారు. 2019 లోనే బరువు తగ్గే ప్రక్రియను ప్రారంభించానని.. ప్రస్తుత రూపానికి రావడానికి దాదాపు ఏడేళ్ల సమయం పట్టిందని తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ లాక్‌డౌన్ సమయంలోనే ఎక్కువగా బరువు తగ్గానని, ఆ సమయంలో ఎవరూ చూడకపోవడం వల్లే ఇప్పుడు హఠాత్తుగా సర్జరీల వల్ల మారిపోయినట్లు భ్రమి పడుతున్నారన్నారు.
సినిమా కుటుంబం నుండి వచ్చినా? ఆనందిత తన 19వ ఏట నుంచే చిత్ర పరిశ్రమలో కష్టపడటం ప్రారంభించారు. దిగ్గజ దర్శకుడు మణిరత్నం వద్ద `పొన్నియిన్ సెల్వన్ 2`, `థగ్ లైఫ్` వంటి చిత్రాలకు పనిచేశారు. `థగ్ లైఫ్` షూటింగ్ సమయంలో యాంకల్ ఫ్రాక్చర్ కావడం వల్లే ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలనే బలమైన కోరిక కలిగిందని చెప్పారు. ఇటీవలే విడుదలైన `డబుల్ ఆక్యుపెన్సీ` అనే చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
గతంలో ఖుష్బూ కూడా బరువు తగ్గడంపై వచ్చిన మందుల వాడకం పుకార్లను ఖండించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కుమార్తె కూడా అదే బాటలో నిలిచారు. సోషల్ మీడియాలో వచ్చే ద్వేషం ఎప్పటికీ ఆగదని గ్రహిం చానని.. బరువు తగ్గింది ఇతరులను మెప్పించడానికి కాదని కేవలం ఆరోగ్యం కోసమేనని ఆనందిత స్పష్టం చేశారు. నెగెటివిటీని పట్టించుకోకుండా తన పనిపై దృష్టి పెట్టడమే ఉత్తమమని ఆమె ఈ సందర్భంగా నిరూపించారు.
