Begin typing your search above and press return to search.

గరివిడి లక్ష్మి కోసం ఆనంది అడ్వాన్సులు రిటర్న్.. ఆమె అందరిలా కాదు!: డైరెక్టర్

కానీ ఆనంది మాత్రం అలా చేయలేదని వివరించారు. మంచి సినిమా చేస్తున్నాననే నమ్మకంతో ఆమె తీసుకున్న నిర్ణయం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.

By:  M Prashanth   |   15 Oct 2026 10:34 AM IST
గరివిడి లక్ష్మి కోసం ఆనంది అడ్వాన్సులు రిటర్న్.. ఆమె అందరిలా కాదు!: డైరెక్టర్
X

సినిమా కోసం కొందరు నటీనటులు తమ డేట్స్‌ ను సర్దుబాటు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ నటి ఆనంది మాత్రం 'గరివిడి లక్ష్మి' సినిమా కోసం తనకు వచ్చిన ఛాన్సులను వదులుకున్నారు. ఇప్పటికే రెండు మూడు సినిమాలకు అడ్వాన్సులు తీసుకున్నప్పటికీ.. ఆ బయోపిక్ స్టోరీ నచ్చడంతో వాటిని తిరిగి ఇచ్చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా దర్శకుడు గౌరి నాయుడు జమ్ము రివీల్ చేశారు.

ఆనంది గరివిడి లక్ష్మి సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని గౌరి నాయుడు చెప్పారు. కథ విన్న తర్వాత తన డేట్స్ విషయంలో సమస్య వస్తుందని గుర్తించిన ఆమె.. తమకు చెప్పకుండానే ఇతర మూవీ టీమ్స్ తో మాట్లాడి అడ్వాన్సులు తిరిగి ఇచ్చేశారని తెలిపారు. సాధారణంగా కొంతమంది నటీనటులు తమ డేట్స్ విషయంలో ఇబ్బందులు వస్తే సినిమా బృందాలనే సర్దుబాటు చేయమని అడుగుతారని గౌరి నాయుడు చెప్పారు.

కానీ ఆనంది మాత్రం అలా చేయలేదని వివరించారు. మంచి సినిమా చేస్తున్నాననే నమ్మకంతో ఆమె తీసుకున్న నిర్ణయం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఆనందిలో తనకు బాగా నచ్చిన మరో విషయం ఆమె నేర్చుకునే వేగమని దర్శకుడు చెప్పారు. తాను చెప్పిన విషయాలను ఆమె వెంటనే అర్థం చేసుకుని నటించేవారని వెల్లడించారు. రోల్ కు తగినట్టుగా బాడీ లాంగ్వేజ్ వివరించిన వెంటనే వాటిని ఫాలో అయ్యేవారని తెలిపారు.

సినిమాలో బుర్రకథ కళాకారిణిగా కనిపించేందుకు ఆనంది పాటలు, పద్యాలు నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తాను వాటిని నేర్చుకోవడానికి చాలా రోజులు తీసుకున్నానని, కానీ ఆనంది మాత్రం కేవలం 15 నిమిషాల్లోనే నేర్చుకున్నారని ప్రశంసించారు. ఇప్పటికీ ఆమె ఆ పాటలు, పద్యాలను గుర్తుపెట్టుకుని చెబుతారని వివరించారు. పాత్రపై ఆమెకు ఉన్న డెడికేషన్ సినిమాలో యాక్టింగ్ బాగా రావడానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.

సాధారణంగా గ్లామర్ రోల్స్ లో కనిపించే ఆనంది.. గరివిడి లక్ష్మి మూవీలో పూర్తిగా భిన్నమైన రోల్ ఎంచుకున్నారు. ఉత్తరాంధ్ర పల్లెటూరి మహిళగా, జానపద కళాకారిణిగా కనిపించేందుకు రెడీ అయ్యారు. హార్మోనియం పట్టుకుని, బుర్రకథ కళాకారిణి పాత్రలో ఒదిగిపోయారని దర్శకుడు తెలిపారు. ఆమె ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆనంది యాక్టింగ్ ను చూసి కొందరు మహానటి సావిత్రితో పోలుస్తున్నారని గౌరి నాయుడు చెప్పారు. గరివిడి లక్ష్మి పాత్రకు ఆనంది వంద శాతం న్యాయం చేశారని కొనియాడారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సినిమాను నిర్మించారు. రాగ్ మయూర్, సీనియర్ నటుడు నరేష్, శరణ్య ప్రదీప్, రాశి, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించారు. అక్టోబర్ 17న విడుదల కానున్న ఆ మూవీ ఆనందికి నటిగా ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి.