Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ని క‌ల‌వ‌డం స‌ర్‌ప్రైజ్.. ఆయ‌న‌లోని ఆ రెండూ.. మ‌హీంద్రా విస్మ‌యం

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్-2025 వేదిక‌గా భార‌తీయ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పీచ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   11 Dec 2025 10:19 AM IST
మెగాస్టార్‌ని క‌ల‌వ‌డం స‌ర్‌ప్రైజ్.. ఆయ‌న‌లోని ఆ రెండూ.. మ‌హీంద్రా విస్మ‌యం
X

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్-2025 వేదిక‌గా భార‌తీయ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పీచ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆనంద్ జీ కలిశారు. మెగాస్టార్ చిరంజీవిని కలవడం `ఊహించని స‌ర్‌ఫ్రైజ్` అంటూ ఆనందం వ్యక్తం చేసారు. అంతేకాదు ఎక్స్ ఖాతాలో త‌న స‌ర్ ప్రైజ్ మీట్ గురించి మ‌హీంద్రా ప్ర‌స్థావించారు.





ఆనంద్ మ‌హీంద్రా ఎక్స్ ఖాతాలో ఇలా రాసారు. ``తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించడానికి నేను నిన్న హైదరాబాద్‌లో ఉన్నాను. రాష్ట్రానికి సంబంధించిన విజన్ 2047 ప్రణాళిక అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంభాషించే అవకాశం లభించడంతో పాటు.. చివరకు మెగాస్టార్ చిరంజీవి గారిని కలవగలగడం ఊహించని స‌ర్ ప్రైజ్.

ఆయ‌న ఒక లెజెండ్.. అతడిలో నిజంగా ఆకర్షించేవి వినయం, ఉత్సుకత. నేర్చుకోవాలనే ఉత్సాహంతో పాటు, వినాలనే వినయం ఈ రెండు మంచి ల‌క్ష‌ణాలు.. సినిమా-వ్యాపారం- రాజ‌కీయాలు లేదా ఏ రంగంలోనైనా శాశ్వత విజయానికి పునాది వేస్తాయి.. ఆయ‌న‌ను క‌ల‌వ‌డం ఒక జ్ఞాపిక`` అని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి బ్లూప్రింట్‌ను చూసాక‌.. ప్రపంచవ్యాప్తంగా తాను ఎదుర్కొన్న విష‌యాల‌ను గుర్తు చేసుకుని, ఇది నిజంగా ఆద‌ర్శంగా ఉంద‌ని అన్నారు. యువత సాధికారత, మహిళలు ఆర్థిక నాయకులుగా.. స్థిర‌త్వ‌మే సూత్రంగా కేంద్రీకరించి ఒక చట్రాన్ని రూపొందించినందుకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఆయ‌న టీమ్ ల‌ను అభినందించారు.

ఇదే వేదిక‌పై ఆయ‌న కృత్రిమ మేథ‌స్సు (AI) ప్ర‌భావం గురించి మాట్లాడారు. ఏఐ యుగంలో నైపుణ్యం కలిగిన కార్మికుల పాత్ర గురించి మ‌హీంద్రా కీల‌క స‌ల‌హాలిచ్చారు. భవిష్యత్తు కేవ‌లం నిర్వాహకులకే కాదు, తయారీదారుల(మ్యాన్యుఫ్యాక్చ‌రింగ్) కే చెందుతుందని అన్నారు. ఆయ‌న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్‌యు) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా తన పాత్ర గురించి మాట్లాడుతూ.. మనం డిజిటల్ సునామీలో జీవిస్తున్నాము. కృత్రిమ మేధస్సు ప్రపంచ వ్యాప్తంగా చ‌ర్చ‌ల‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఏఐతో ఏ ముప్పు ఉందో అనే భ‌యం ఉంది. భ‌విష్యత్తులో ఇది ఎలా ప‌రిణ‌మిస్తుందో అనే ఆందోళ‌న అలానే ఉంది. కానీ ప్రపంచం ఎంత డిజిటల్‌గా మారుతుందో, మానవ స్పర్శ అంత విలువైనదిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.. ఏఐ వ‌చ్చినా శ్రామిక శ‌క్తిని అధిగ‌మించ‌కుండా ఉండాల‌ని నేను కోరుకుంటున్నాను`` అన్నారు. ఏఐ యుగంలో కూడా మాన‌వ‌స్ప‌ర్శ త‌ప్ప‌నిస‌రి అని అన్నారు.

ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మ‌హీంద్రా మాట్లాడారు. ఈ రోజుల్లో మేనేజర్లు ఎక్కువ‌గా ఉన్నారు.. కానీ తయారీదారుల కొరత ఉందని అన్నారు. మ‌బ్బుల్లో కాదు నేల‌పై నిల‌బ‌డి ఆలోచించాల‌ని సూచించారు.