దర్శక నిర్మాతల గొడవ.. మంచి సినిమా ఆగింది!
ఇప్పటికే తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్ సినిమాలతో వచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ తను వెడ్స్ మను 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కథను రెడీ చేసుకున్నాడు.
By: Ramesh Palla | 10 Sept 2025 10:47 AM ISTప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ప్రస్తుతం ధనుష్‌తో 'తేరే ఇష్క్ మే' సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన రాంఝనా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 2013లో వచ్చిన ఆ సినిమాలో ధనుష్ కి జోడీగా సోనమ్ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా వచ్చి పదేళ్లు దాటిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబోలో ఒక మంచి సినిమా రాబోతుంది అంటూ ప్రేక్షకులు తేరే ఇష్క్ మే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ తన హిట్ మూవీ తను వెడ్స్ మను ప్రాంచైజీలో మూడో సినిమాను తీయాలి అనుకున్నాడు. కానీ రాంఝనా రీ రిలీజ్ సమయంలో ఏర్పడిన వివాదం కారణంగా ప్రాంచైజీ మూవీ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
రాంఝనా సినిమా రీ రిలీజ్ వివాదం
రాంఝనా సినిమాను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను ఈరోస్ సంస్థ రీ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. సినిమా ఒరిజినల్ వర్షన్‌కు రీ రిలీజ్ వర్షన్‌కి కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా హీరో పాత్ర చివర్లో చనిపోయినట్లు ఒరిజినల్ వర్షన్‌లో ఉంటుంది. కానీ రీ రిలీజ్ వర్షన్‌లో ఏఐ ను ఉపయోగించి హీరో బతికినట్లు చూపించారు. అది ప్రేక్షకులతో పాటు అందరూ వ్యతిరేకించారు. హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా సినిమాను ఎలా మార్చుతారు అంటూ అప్పటి నుంచి ఈరోస్ సంస్థతో ఆనంద్ ఎల్ రాయ్ ఆగ్రహంతో ఉన్నాడు. సంస్థ ప్రతినిధులపై దర్శకుడు ఆనంద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో గొడవ కాస్త సీరియస్‌గానే జరిగింది.
తను వెడ్స్ మను ప్రాంచైజీ ప్లాన్స్
ఇప్పుడు ఆ గొడవ ప్రభావం తను వెడ్స్ మను ప్రాంచైజీలో రావాల్సిన మూడో సినిమాపై పడింది. ఇప్పటికే తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్ సినిమాలతో వచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ తను వెడ్స్ మను 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కథను రెడీ చేసుకున్నాడు. ఈరోస్ ఇంటర్నేషనల్ మూవీస్ బ్యానర్‌లో కాకుండా బయటి బ్యానర్‌లో ఈ ప్రాంచైజీ మూవీని చేయాలని దర్శకుడు నిర్ణయించుకున్నాడు. అందుకోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు. ధనుష్ తో తీస్తున్న తేరే ఇష్క్ మే సినిమా విడుదలైన వెంటనే ఈ ప్రాంచైజీ మూవీని మొదలు పెట్టాలని భావించాడు. ఈ సమయంలో నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషల్ సంస్థ వారు తను వెడ్స్ మను హక్కులు తమ వద్దు ఉన్నాయి, ప్రాంచైజీ మూవీ చేయడానికి వీలు లేదు అంటూ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌కి లీగల్ నోటీసులు పంపించారు.
ఆనంద్ ఎల్ రాయ్, ఈరోస్ ఇంటర్నేషనల్ గొడవ
బాలీవుడ్‌లో సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్ సినిమాలను ఇష్టపడే వారు ఈ ప్రాంచైజీలో మూడో సినిమా వస్తుంది అనే ప్రకటన వచ్చిన వెంటనే ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఇప్పడు నిర్మాణ సంస్థ ఈరోస్ వారితో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌కి ఉన్న విభేదాల కారణంగా ప్రాజెక్ట్ మొత్తం పక్కన పడేయాల్సి వచ్చిందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దర్శకుడికి ఈరోస్ వారికి సయోద్య కుదిరితే తప్ప సినిమా పట్టాలు ఎక్కే అవకాశం లేదు. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి. ఇప్పటి వరకు ఆనంద్ ఎల్ రాయ్ లీగల్ నోటీసుల గురించి పెద్దగా స్పందించలేదు. కనుక ముందు ముందు ఆయన నుంచి వచ్చే స్పందన ఏంటి, తాను రెడీ చేసుకున్న తను వెడ్స్ మను 3 సినిమా కథను ప్రాంచైజీలో భాగంగా కాకుండా బయట తీస్తాడా లేదా కొత్త సినిమా మొదలు పెడుతాడా అనేది చూడాలి.
