హీరో కాకముందే.. వంగా కంట్లో పడ్డ ఆనంద్!
ఆనంద్ దేవరకొండ హీరోగా మారకముందే సందీప్ రెడ్డి వంగా అతనిలో ఒక విషయం గమనించాడట.
By: M Prashanth | 9 Sept 2026 9:33 AM ISTఆనంద్ దేవరకొండ హీరోగా మారకముందే సందీప్ రెడ్డి వంగా అతనిలో ఒక విషయం గమనించాడట. అర్జున్ రెడ్డి ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండతో కలిసి అమెరికా వెళ్లిన రోజుల్లో ఆనంద్ కూడా వాళ్లతో ఉండేవాడు. అప్పటికి అతను ఐటీ ఉద్యోగి. సినిమాల్లోకి వస్తాడనే మాట కూడా లేదు. కానీ సినిమా గురించి మాట్లాడటం మొదలైతే మాత్రం ఆనంద్ చాలా సీరియస్‌గా ఉండేవాడని వంగా ఎపిక్ ఈవెంట్‌లో గుర్తు చేసుకున్నాడు.
కాలిఫోర్నియా నుంచి డల్లాస్ వరకు జరిగిన ఆ ట్రిప్‌లో ఆనంద్ బ్లేజర్ వేసుకుని, క్లీన్ షేవ్‌తో పూర్తిగా ఐటీ ఎంప్లాయ్ లాగే కనిపించాడట. కానీ రాత్రిళ్లు టీమ్‌తో కూర్చొని అర్జున్ రెడ్డి గురించి మాట్లాడేవాడని వంగా చెప్పాడు. పాటలు ఎలా ఉన్నాయి, టీజర్ ఎలా ఉంది, సినిమా ఎలా వెళ్తోంది అనే విషయాలపై తన అభిప్రాయం చెప్పేవాడట. పక్కనే ఉండే విజయ్ తమ్ముడిగా కాకుండా, సినిమా మీద తనకంటూ ఒక అబ్జర్వేషన్ ఉన్న కుర్రాడిలా అప్పుడే కనిపించాడన్నమాట.
అసలు ఇక్కడే ఆనంద్ జర్నీలో చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చాలామంది నటులు సినిమాల్లోకి వచ్చిన తర్వాతే స్క్రిప్టులు, ఎడిటింగ్, ప్రమోషన్ లాంటి విషయాలను దగ్గరగా చూస్తారు. ఆనంద్ మాత్రం హీరో అవ్వకముందే ఒక సినిమా టీమ్ మధ్యలో ఆ ప్రాసెస్‌ను చూస్తున్నాడు. పైగా అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఎలా తయారవుతోంది, రిలీజ్ ముందు టీమ్ ఎలా ఆలోచిస్తోంది అన్నది చాలా దగ్గర నుంచి చూసే అవకాశం అతనికి వచ్చింది.
కొంతకాలానికే ఆనంద్ దొరసానితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, బేబీ లాంటి సినిమాలు చేశాడు. ఈ సినిమాల్లో ఆనంద్‌ను చూసినప్పుడు నటనలో నమ్మకం కలిగించాడని వంగా చెప్పాడు. ఆరేళ్లలో నాలుగు ఐదు మంచి సినిమాలు చేశాడని కూడా ప్రత్యేకంగా మాట్లాడాడు. అంటే అమెరికాలో సినిమా గురించి మాట్లాడిన ఆ ఐటీ ఉద్యోగిని, తర్వాత తెరపై హీరోగా కూడా వంగా గమనిస్తూనే ఉన్నాడు.
ఆనంద్ కెరీర్ కూడా విజయ్ చేసిన సినిమాల దారిలో నడవలేదు. పెద్ద హీరో తమ్ముడు కాబట్టి మొదటి నుంచే భారీ కమర్షియల్ కథలు పట్టుకోలేదు. తనకు సెట్ అయ్యే కథలు చేసుకుంటూ వచ్చాడు. బేబీతో పెద్ద హిట్ వచ్చిన తర్వాత కూడా వెంటనే అదే తరహా పాత్రను పట్టుకోకుండా ఎపిక్ వరకు మరో రూట్ తీసుకున్నాడు. అందుకే వంగా చెప్పిన అమెరికా రోజుల కథ హైలెట్ అయ్యింది.
