Begin typing your search above and press return to search.

అన్నా వదిన ప్రమోషన్‌తో తమ్ముడు హిట్‌ కొట్టేనా?

బేబీతో హిట్‌ కొట్టిన ఆనంద్ దేవరకొండ ఆ వెంటనే 'గంగం గణేశా' సినిమాతో వచ్చి నిరాశ పరిచిన విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   7 Sept 2026 11:26 AM IST
అన్నా వదిన ప్రమోషన్‌తో తమ్ముడు హిట్‌ కొట్టేనా?
X

బేబీతో హిట్‌ కొట్టిన ఆనంద్ దేవరకొండ ఆ వెంటనే 'గంగం గణేశా' సినిమాతో వచ్చి నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఇలా వచ్చి అలా పోయిన గంగం గణేశా సినిమా గురించి కాకుండా ఇప్పటికీ ఆనంద్‌ దేవరకొండ అనగానే 'బేబీ' సినిమాను చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. బేబీ హీరో సినిమా ఎప్పుడు అంటూ గత రెండు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఫైనల్‌గా 'ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌' తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. 90's బయోపిక్‌ తో యూత్‌తో పాటు అన్ని వర్గాలను అలరించిన యువ దర్శకుడు ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించిన ఎపిక్‌ మూవీపై అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇటీవల నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయడం ద్వారా తన మరిదికి మద్దతుగా నిలిచింది. రష్మిక గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆనంద్‌ పిలుపు మేరకు ట్రైలర్‌ లాంచ్‌కు హాజరు అయ్యింది.

ఎపిక్‌ ట్రైలర్‌ లాంచ్‌ చేసిన రష్మిక మందన్న...

రష్మిక లాంచ్ చేసిన 'ఎపిక్‌' ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా ఒక మంచి లవ్‌ స్టోరీగానూ ఎపిక్‌ ఉండబోతుంది అనే నమ్మకం ట్రైలర్‌ చూసిన ప్రేక్షకులకు కలుగుతుంది. అందుకే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సినిమాపై ఉన్న అంచనాలను పెంచేందుకు గాను ఈసారి అన్న విజయ్ దేవరకొండను రంగంలోకి దించబోతున్నారు. సెప్టెంబర్‌ 8న విజయవాడలో జరగబోతున్న ఎపిక్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి విజయ్ దేవరకొండ హాజరు కాబోతున్నట్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే విజయవాడలో ఎపిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. విజయ్‌ దేవరకొండ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌, ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రీరిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా విజయ్ దేవరకొండ...

ఆనంద్‌ దేవరకొండ కెరీర్‌ ఆరంభించి చాలా ఏళ్లు అయినప్పటికీ సరైన కమర్షియల్‌, బ్లాక్‌ బస్టర్‌ దక్కలేదని చెప్పాలి. బేబీ హిట్‌ అయినప్పటికీ ఆయన స్టార్‌డం, హీరోయిజం ఎలివేట్‌ కాలేదనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి పూర్తి హీరో డామినేషన్‌ పాత్రతో, స్క్రిప్ట్‌తో ఆనంద్‌ దేవరకొండ ఎపిక్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి ఎపిక్‌ హిట్‌ అయితే పూర్తి క్రెడిట్‌ ఆనంద్‌ దేవరకొండకి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే అన్న విజయ్‌ దేవరకొండ, వదిన రష్మిక మందన్న తమ వంతు సహకారంను ఎపిక్‌ కోసం అందిస్తున్నారు. అన్నా వదినల సహకారంతో ఆనంద్‌ దేవరకొండ భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టేనా అనేది చూడాలి. ఈ మధ్య కాలంలో యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టోరీస్‌కి మంచి స్పందన దక్కుతున్న నేపథ్యంలో ఎపిక్ విషయంలో బయ్యర్లు కూడా చాలా నమ్మకంగా ఉన్నారని టాక్‌.

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఎపిక్‌..

బేబీ సినిమాతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనంద్‌ దేవరకొండ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే హీరోయిన్‌ వైష్ణవి చైతన్య మొత్తం క్రెడిట్‌ ను కొట్టేసింది అనేది కొందరి అభిప్రాయం. ఇప్పుడు ఈ మూవీలోనూ ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటిస్తున్నప్పటికీ కచ్చితంగా ఆనంద్‌ దేవరకొండకు క్రెడిట్‌ దక్కే విధంగా పాత్ర, కథ, కథనం ఉన్నట్లుగా ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతుంది. అందుకే ఈ సినిమా విజయం ఆనంద్‌ దేవరకొండకు అత్యంత కీలకం. అందుకే అన్నా వదినలు ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా ఎపిక్‌ కోసం కొంత సమయంను కేటాయించారని తెలుస్తోంది. బేబీ తర్వాత హిట్‌ పెయిర్‌గా గుర్తింపు దక్కించుకున్న ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యలు మరోసారి 'ఎపిక్‌' తో హిట్‌ కొట్టి తమ హిట్‌ పెయిర్‌ ట్యాగ్‌ ను కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. సెప్టెంబర్‌ 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న 'ఎపిక్‌' ఫలితం ఎలా ఉంటుంది అనేది రౌడీ స్టార్‌ అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.