Begin typing your search above and press return to search.

గణేష్ హడావుడిలో 'ఎపిక్' యూత్‌ను పట్టుకుంటుందా?

సంక్రాంతి, దసరా లాంటి సీజన్లలో పెద్ద సినిమాల మధ్య స్క్రీన్స్ కోసం పోటీ గట్టిగానే ఉంటుంది.

By:  M Prashanth   |   5 Sept 2026 10:23 AM IST
గణేష్ హడావుడిలో ఎపిక్ యూత్‌ను పట్టుకుంటుందా?
X

సంక్రాంతి, దసరా లాంటి సీజన్లలో పెద్ద సినిమాల మధ్య స్క్రీన్స్ కోసం పోటీ గట్టిగానే ఉంటుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మాత్రం యూత్ సినిమాలకు ప్రతిసారి ఆ రద్దీనే పట్టుకోవడం లేదు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ను సెప్టెంబర్ 11న తీసుకొస్తున్నారు. పెద్ద స్టార్ సినిమా కాదు. కానీ డేట్ కూడా మరీ డ్రైగా లేదు. మూడు రోజులకే వినాయక చవితి ఉంది.

సితారకు ఇలాంటి రిలీజ్‌లు కొత్త కాదు. ‘డీజే టిల్లు’ ఫిబ్రవరిలో వచ్చి పెద్ద హిట్ అయింది. అప్పటికి సిద్ధు జొన్నలగడ్డకు మార్కెట్ కూడా లేదు. తర్వాత ‘టిల్లు స్క్వేర్’ను మార్చి చివర్లో రిలీజ్ చేసి వంద కోట్లకు పైగా గ్రాస్ చూసింది. ‘మ్యాడ్’ను కూడా అక్టోబర్ మొదటి వారంలో కొత్త కుర్రాళ్లతో తీసుకొచ్చారు. అక్కడ కాలేజ్ కామెడీ పట్టుకోవడంతో సినిమా నిలబడింది.

‘ఎపిక్’ విషయంలో మాత్రం పండగ ఉందని పూర్తిగా హాలిడే అడ్వాంటేజ్ అనుకోలేం. వినాయక చవితి ముందు రోజులంటే ముఖ్యంగా యూత్ గణేష్ విగ్రహాలు తీసుకురావడం, మండపాలు సిద్ధం చేయడం, ఫ్రెండ్స్‌తో ఏర్పాట్లు చేయడంలో ఉంటారు. సినిమా టార్గెట్ కూడా ఎక్కువగా అదే యూత్ కాబట్టి వాళ్లను థియేటర్ వరకు తీసుకురావడం అసలైన టాక్స్. పండగ మూడ్ థియేటర్లకు ప్లస్ కావచ్చు కానీ ఈ గణేష్ ఫెస్టివల్ కాస్త వేరు.

పైగా సెప్టెంబర్ 11 వీకెండ్ ఖాళీగా లేదు. కార్తి ‘సర్దార్ 2’, ‘మండాడి’, ‘మారెమ్మ’, ‘మహేంద్రగిరి వారాహి’ కూడా రెండు రోజుల గ్యాప్‌లోనే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే షోలు పంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ‘సర్దార్ 2’కు కార్తి మార్కెట్ ఉండటంతో మల్టీప్లెక్స్‌లలో పోటీ తప్పదు. ‘ఎపిక్’కు తనవైపు కొన్ని బజ్ పాయింట్లు ఉన్నాయి.

బేబీ తర్వాత ఆనంద్, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి వస్తున్నారు. ఆదిత్య హాసన్‌కు ‘90స్’తో ఇప్పటికే గుర్తింపు ఉంది. పైగా అదే కథ ప్రపంచాన్ని ఇప్పుడు పెద్ద తెరకు తీసుకొస్తున్నాడు. అందుకే మొదటి రోజు ఓపెనింగ్ మొత్తం హీరో మార్కెట్ మీదే ఉండాల్సిన పరిస్థితి లేదు. ఇక సెప్టెంబర్ 24న నాని ‘ది ప్యారడైజ్’ వస్తోంది. అప్పటికి బాగా ఆడుతున్న సినిమాలకే షోలు నిలబడతాయి. ‘ఎపిక్’కు దాదాపు రెండు వారాల ముందస్తు రన్ దొరుకుతోంది. గణేష్ హడావుడి అలాగే మిగతా సినిమాల పోటీ మధ్య గట్టిగా నిలదొక్కుకోవాలి. మొదటి వీకెండ్‌లో యూత్‌ను పట్టుకుంటేనే ఆ రెండో వారానికి మంచి స్క్రీన్స్ చేతిలో ఉంటాయి.