అప్పుడు ఎవడిగోలవాడిది.. ఇప్పుడు అనకాపల్లి..
చిన్న సినిమా అంటే చాలు.. థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడదనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేస్తుంటాయి.
By: M Prashanth | 6 Oct 2026 9:51 PM ISTచిన్న సినిమా అంటే చాలు.. థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడదనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేస్తుంటాయి. తాజాగా అనకాపల్లి విషయంలోనూ అదే జరుగుతోందని నిర్మాత లగడపాటి శ్రీధర్ చెప్పుకొచ్చారు. గతంలో తాను నిర్మించిన ఎవడి గోల వాడిది సినిమాకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు అనకాపల్లి కూడా అలాంటి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నారు.
అనకాపల్లి సినిమాకు అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించిన ఆ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. అనకాపల్లి రూరల్ నేపథ్యంలో సాగే ఆ క్రైమ్ డ్రామాలో, ఒక సాధారణ యువకుడు (సూరి) బుల్లెట్టు అనే స్థానిక గ్యాంగ్ స్టర్ అరాచకాలకు ఆకర్షితుడై నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత అతని జీవితంలోకి ప్రేమ రావడం, అధికారం, నమ్మకద్రోహం చుట్టూ జరిగే సంఘర్షణలను చాలా ఇంటెన్స్ గా చూపించారు.
విక్రమ్ సహిదేవ్ మాస్ నటన, తారక్ పొన్నప్ప పెర్ఫార్మెన్స్, ఇంద్రజ ఎమోషనల్ యాక్టింగ్, డేవ్జాండ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ స్త్రెంగ్త్స్ గా నిలిచాయి. మాస్ యాక్షన్ సీన్లు, విలేజ్ నేటివిటీతో కూడిన ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులను అలరిస్తూ, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన థాంక్యూ మీట్ లో లగడపాటి శ్రీధర్ మాట్లాడారు.
చిన్న సినిమాలకు మీడియా అందించే ప్రోత్సాహం ముఖ్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తన గత చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. తాను నిర్మాతగా చేసిన ఎవడి గోల వాడిది సినిమాను మొదట్లో థియేటర్ నుంచి తీసేయాలని అనుకున్నామని చెప్పారు. "ఎవడి గోల వాడిది సినిమాను మూడు రోజులకే తీసేస్తామని అన్నారు. డబ్బులు పెట్టండి.. ఉంచుతామని అడిగారు. నేనైతే తీసేయమని చెప్పాను. కానీ అదే థియేటర్లలో ఆ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది" అని లగడపాటి శ్రీధర్ గుర్తు చేసుకున్నారు.
2005లో వచ్చిన ఎవడి గోల వాడిదిలో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించడంతో పాటు ఎక్కువ రోజులు ప్రదర్శితమైంది. తొలి సినిమాతోనే నిర్మాతగా లగడపాటి శ్రీధర్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో అనకాపల్లి కూడా అలాంటి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇప్పటికే కొన్ని షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయని, మండే నైట్ షోలు కూడా నిండిపోయాయని చెప్పారు. దసరా సీజన్ లో అనకాపల్లి మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా సినిమా చిన్నదా, పెద్దదా అన్నదానికంటే ప్రేక్షకులకు నచ్చిందా లేదా అనేదే చివరికి రిజల్ట్ నిర్ణయిస్తుంది. ఒకప్పుడు ఎవడి గోల వాడిది విషయంలో ఎదురైన పరిస్థితి.. ఇప్పుడు అనకాపల్లి విషయంలోనూ గుర్తుకు వస్తోంది. మొదట్లో అంచనాలు తక్కువగా ఉన్నా.. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ పెరిగితే సినిమా రన్ పూర్తిగా మారిపోతుంది. మరి అనకాపల్లి కూడా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
