భగీరథ సినిమా నా లైఫ్ నే మార్చేసింది: ప్రొడ్యూసర్ నాయుడు
"అనకాపల్లి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత కాండ్రేగుల నాయుడు తన స్పీచ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేశారు.
By: M Prashanth | 27 Sept 2026 10:00 PM IST"అనకాపల్లి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత కాండ్రేగుల నాయుడు తన స్పీచ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీకి రావడం ఒక ఎత్తు అయితే, తన లైఫ్ కు ఈ ఇండస్ట్రీ తో ఉన్న సంబంధం గురించి ఎమోషనల్ గా చెప్పారు. మొదట సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టమైన విషయం అని, కానీ తమ మొదటి సినిమానే మైత్రీ మూవీ మేకర్స్, పూర్వి పిక్చర్స్ లాంటి పెద్ద బ్యానర్స్ ద్వారా రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
రోడ్డు మీద పడుకునే స్థాయి నుంచి వందల కోట్ల వ్యాపారం చేసే దాకా నా లైఫ్ ను మార్చేసింది ఒక సినిమానే అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రవితేజ హీరోగా వచ్చిన భగీరథ సినిమా తన జీవితాన్ని మలుపు తిప్పిందని నాయుడు పంచుకున్నారు. ఆ సినిమాను థియేటర్లలో రెండు వందల సార్లు చూశానని చెప్పారు. అందులో హీరోకి ఒక ఐదు లక్షల చెక్ ఇస్తారు, అలాగే దాడి వీరభద్రరావు గారి అబ్బాయి జగన్ ప్రభాకర్ కూడా తనకు ఐదు లక్షల చెక్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
ఆ క్షణమే తనలో ఒక వ్యాపారవేత్తను నిద్రలేపిందని, ఆ స్ఫూర్తితోనే రియల్ ఎస్టేట్ లోకి వచ్చానని ఆయన వివరించారు. చేతిలో రూపాయి అడ్వాన్స్ లేకపోయినా కేవలం తన మీద ఉన్న నమ్మకంతో అనకాపల్లి స్థానికులు భూములు ఇచ్చారని నాయుడు కృతజ్ఞతతో చెప్పారు. అలా మొదలైన తన ప్రయాణం నేషనల్ హైవే పక్కన ఐదొందల ఎకరాల లేఅవుట్ వేసే స్థాయికి చేరుకుందని ప్రకటించారు. తన ఎదుగుదలకు కారణమైన ఆ గడ్డ మీద ఉన్న ప్రేమతోనే తన వెంచర్ కు అనకాపల్లి అని పేరు పెట్టానని, ఇప్పుడు అదే పేరుతో సినిమా తీసి అందరి ముందు నిలబడటం ఆనందంగా ఉందని అన్నారు.
సినిమా తీయడం ఒక ఎత్తైతే దాన్ని సరిగ్గా రిలీజ్ చేయడం చాలా కష్టం అని నాయుడు అభిప్రాయపడ్డారు. త్రినాథరావు నక్కిన ఇచ్చిన అండతోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని, కేవలం వ్యాపారంలో సక్సెస్ అయ్యాక ఒక ఐడెంటిటీ కోసమే ఈ సినిమాను నిర్మించానని ఆయన కుండబద్దలు కొట్టారు.
తన దగ్గర ఏమీ లేనప్పుడు నమ్మి ఆదరించిన అనకాపల్లి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని నాయుడు మాటిచ్చారు.
ఒక చిన్న సినిమా కథతో ప్రపంచానికి ఏదైనా చూపించగలమనే నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టామన్నారు. పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న అనకాపల్లి సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయితే, భవిష్యత్తులో ప్రేక్షకులను అలరించేలా మరో ఐదు సినిమాలు కచ్చితంగా తీస్తానని ఆయన వేదిక మీద ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. ఇక అనకాపల్లి సినిమా అక్టోబర్ 2న రానుంది. ఆ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
