ఆయన సినిమా పిచ్చికి హ్యాట్సాఫ్: వినాయక్ స్పీచ్ వైరల్!
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడిన మాటలు అందరినీ ఎట్రాక్ట్ చేశాయి. రొటీన్‌గా సినిమా గురించి కాకుండా, ఒక తండ్రి తపన గురించి ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
By: M Prashanth | 27 Sept 2026 9:34 PM ISTవిక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ఠ జంటగా ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ డ్రామా అనకాపల్లి. అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడిన మాటలు అందరినీ ఎట్రాక్ట్ చేశాయి. రొటీన్‌గా సినిమా గురించి కాకుండా, ఒక తండ్రి తపన గురించి ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
వినాయక్ స్పీచ్ అంతా ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ చుట్టూనే సాగింది. ఇండస్ట్రీలో అందరికీ సినిమా పిచ్చి ఉంటుందని, కానీ తమందరికంటే శ్రీధర్‌కు ఆ ప్యాషన్ వంద రెట్లు ఎక్కువని వినాయక్ చెప్పుకొచ్చారు. కేవలం వ్యాపార కోణంలో కాకుండా సినిమాను ఒక ఎమోషన్‌గా ఫీల్ అయ్యే వ్యక్తుల్లో ఆయన ముందుంటారని, ఆ డెడికేషనే ఈరోజు అనకాపల్లి లాంటి సినిమాగా మన ముందుకు వచ్చిందని ప్రశంసించారు.
కొడుకు విక్రమ్‌ను ఒక పెద్ద కమర్షియల్ హీరోగా చూడాలనేది శ్రీధర్ చిరకాల కోరిక అని వినాయక్ గుర్తుచేశారు. అందుకే విక్రమ్ చిన్నప్పటి నుంచి తాము తీసిన ప్రతి సినిమాలో ఏదో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ వేషం వేయించి కెమెరాకు అలవాటు చేశారని చెప్పారు. కొడుకును వెండితెరపై సాలిడ్ హీరోగా నిలబెట్టాలనే ఆయన పదేళ్ల నాటి కల ఇప్పుడు అనకాపల్లితో నెరవేరుతోందన్న ఫీల్ వినాయక్ మాటల్లో స్పష్టంగా కనిపించింది.
ఇక్కడ వినాయక్ చెప్పిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ శ్రీధర్ హోదా గురించి. ఆయనకున్న డబ్బుకి, పలుకుబడికి ఒక సినిమా తీయడం అనేది చాలా చిన్న విషయం అని వినాయక్ అన్నారు. అయినా సరే ఏ సినిమా వచ్చినా ఉదయం ఏడు గంటలకే మార్నింగ్ షోకు వెళ్లి థియేటర్లలో కూర్చుంటారని, ఆ ప్యాషన్ చూసి తాను ఆశ్చర్యపోతుంటానని వినాయక్ తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
ఇక అనకాపల్లి టీమ్ గురించి మాట్లాడుతూ, త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఒక నిర్మాతగా మారడం మంచి పరిణామం అన్నారు. ఈ చిత్ర దర్శకుడు ఖగేష్ తమ్మినేనితో జనాలను మరీ అంత భయపెట్టకండి అంటూ సరదాగా కామెంట్ చేశారు. సినిమాలో కీలక పాత్ర చేసిన తారక్ పొన్నప్ప కోపంగా ఉన్న లుక్‌ను మెచ్చుకుంటూ, టెక్నికల్ టీమ్ అందరికీ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, శ్రీధర్ కళ్లలో ఆనందం చూడాలని వినాయక్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. విక్రమ్ కచ్చితంగా పెద్ద హీరో అవుతాడని, తన తండ్రి కలలను నిజం చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ, పూర్వి సంస్థలు అక్టోబర్ 2న రిలీజ్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై బాక్సాఫీస్ దగ్గర మంచి బజ్ క్రియేట్ అయింది.
