పాట పాడిన విలన్.. 'అనకాపల్లి' అదిరిపోయే ఫోక్ సౌండ్
పాట మొదలయ్యే ముందే టేప్ రికార్డర్ ఆన్ కాకపోతే తన డప్పు తానే కొట్టుకుంటానంటూ మందు సీసా పట్టుకుని రంగంలోకి దిగే సీన్ తోనే ఈ ట్రాక్ మీటర్ ఏంటో అర్థమైపోతుంది.
By: M Prashanth | 28 Sept 2026 1:37 PM ISTవిక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'అనకాపల్లి' ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. అక్టోబర్ 2న థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ లేటెస్ట్ గా 'నవరంగరాల బుర్ర' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను వదిలారు. ఉత్తరాంధ్ర నేటివిటీకి దగ్గరగా సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
ఈ పాటలో ఉన్న అసలైన సర్ ప్రైజ్ ఏంటంటే, నటుడు తారక్ పొన్నప్పనే స్వయంగా పాడటం. పుష్ప సినిమాలో ఊరమాస్ విలనిజంతో అందరినీ భయపెట్టిన ఈ కన్నడ నటుడు, ఇందులో పూర్తి డిఫరెంట్ లుక్ తో కనిపిస్తూ ఫోక్ బీట్ కు అనుగుణంగా తనలోని సింగింగ్ టాలెంట్ ను బయటపెట్టాడు. ఆయన స్వరం పాటలోని పల్లెటూరి మాస్ మూడ్ కు సరిగ్గా సెట్ అయింది.
పాట మొదలయ్యే ముందే టేప్ రికార్డర్ ఆన్ కాకపోతే తన డప్పు తానే కొట్టుకుంటానంటూ మందు సీసా పట్టుకుని రంగంలోకి దిగే సీన్ తోనే ఈ ట్రాక్ మీటర్ ఏంటో అర్థమైపోతుంది. పక్కింటి చిన్నదాన్ని చూసి ఎగిరిపోయావంటూ సాగే లిరిక్స్ లో ఒక పక్కా లోకల్ పంచ్ ఉంది. తన తమ్ముడిని ఎవరో మోసం చేశారని, వాడి సంగతి తేలుస్తానంటూ సాగే లైన్స్ కథలోని పగ, ప్రతీకారాలను కూడా టచ్ చేస్తున్నాయి.
వి. కిరణ్ కుమార కంపోజ్ చేసిన ఈ పాటకు తేజ గొర్లె లిరిక్స్ అందించారు. మట్టి వాసన వచ్చే పదాలతో పాటు, వినగానే వెంటనే ఎక్కేసేలా ఉన్న డప్పుల సౌండ్ ఈ సాంగ్ కు మెయిన్ హైలైట్ గా నిలిచింది. విజువల్స్ లో త్రినాథరావు నక్కిన, ఇంద్రజ షాక్ అవుతూ చూస్తున్న ఎక్స్ ప్రెషన్స్ సీన్ లోని డ్రామాను ఎలివేట్ చేశాయి.
రెగ్యులర్ రొటీన్ డ్యూయెట్స్ లేదా క్లబ్ సాంగ్స్ కాకుండా, కథలో భాగంగా వచ్చే ఇలాంటి పక్కా నేటివిటీ పాటలు సినిమాకు చాలా ప్లస్ అవుతాయి. ఒక విలన్ పాత్రధారితో ఇలాంటి ఫోక్ నెంబర్ పాడించి ప్రమోషన్స్ కోసం వాడటం దర్శకుడు ఖగేష్ తమ్మినేని ఆలోచనకు నిదర్శనం. ఇది పాట మాత్రమే కాకుండా, సినిమాలో ఆ పాత్ర తాలూకు రూత్ లెస్ స్వభావాన్ని ముందే ఎస్టాబ్లిష్ చేస్తోంది.
గాంధీ జయంతి కానుకగా వస్తున్న ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ తో రిలీజ్ అవుతుండటంతో మంచి హైప్ నెలకొంది. దసరా సీజన్ లో మాస్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేందుకు ఈ 'నవరంగరాల బుర్ర' పాట ఒక పర్ఫెక్ట్ ప్రమోషనల్ స్టఫ్ లా మారింది. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో వస్తున్న 'అనకాపల్లి' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ లేపుతుందో చూడాలి.
