దసరా ధమాకాగా అనకాపల్లి.. నా పేరు పెడితే ఎవరైనా వస్తారని..: త్రినాథరావు నక్కిన
చిన్న సినిమాగా వచ్చిన అనకాపల్లి ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. అక్టోబర్ 2న విడుదలైన ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని, పలు ప్రాంతాల్లో షోలు హౌస్ ఫుల్స్ అవుతున్నాయని మూవీ టీమ్ చెబుతోంది.
By: M Prashanth | 6 Oct 2026 6:19 PM ISTచిన్న సినిమాగా వచ్చిన అనకాపల్లి ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. అక్టోబర్ 2న విడుదలైన ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని, పలు ప్రాంతాల్లో షోలు హౌస్ ఫుల్స్ అవుతున్నాయని మూవీ టీమ్ చెబుతోంది. ఈ సందర్భంగా మంగళవారం మూవీ టీమ్ థాంక్యూ మీట్ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో నటుడు, నిర్మాత, దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. అనకాపల్లి సినిమాకు తాను డబ్బులు పెట్టలేదని చెప్పారు.
తన పేరు పెడితే ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తారనే ఉద్దేశంతో తన పేరును పెట్టారని తెలిపారు. సోమవారం వరకు సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూశానని, అయితే సోమవారం మాత్రమే కాకుండా మంగళవారం కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. పలు ప్రాంతాల్లో థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయని చెప్పారు. సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుందని, సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీడియా, ప్రేక్షకులు సహకరించాలని కోరారు.
నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. తన కుమారుడు విక్రమ్ పై సినిమా చేయడానికి త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు ముందుకు రావడం గొప్ప విషయమని చెప్పారు. చిన్న సినిమాలకు మీడియా ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. గతంలో ఎవడిగోలవాడిదే సినిమాను మొదటి వారంలోనే తీసేస్తారని చెప్పినా, అదే థియేటర్ లో సిల్వర్ జూబ్లీ జరుపుకుందని గుర్తుచేశారు. అలాగే అనకాపల్లి కూడా మంచి విజయం సాధిస్తుందని, ఈ సినిమా దసరా ధమాకాగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి షోలు కూడా హౌస్ ఫుల్స్ అయ్యాయని తెలిపారు.
హీరో విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ.. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు, రివ్యూవర్స్ చెప్పిన మంచి, చెడు విషయాలు గమనించామని తెలిపారు. తనను నమ్మి అవకాశం ఇచ్చిన త్రినాథరావుకు థ్యాంక్స్ చెప్పారు. ఇంద్రజ వల్ల సినిమాలోని కుటుంబ కథ మరింత బాగా వచ్చిందని అన్నారు. సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని తెలిపారు. నటి ఇంద్రజ మాట్లాడుతూ.. అనకాపల్లి మంచి విజయాన్ని సాధించిందని అన్నారు.
ఇలాంటి సినిమాకు సరైన సంఖ్యలో థియేటర్లు దక్కకపోవడం బాధగా ఉందని చెప్పారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెబుతున్నారని తెలిపారు. సినిమాలో ఎవరు నటించారు, ఎవరు తీశారు అనే విషయాల కంటే సినిమా నచ్చిందా లేదా అన్నది ప్రేక్షకులు చూస్తున్నారని అన్నారు. తమ సినిమాకు మరిన్ని థియేటర్లు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటీటీలో సినిమా చూసినా, థియేటర్‌లో చూడలేకపోయామనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పారు.
సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్, శివ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. అనకాపల్లి ఊహకు భిన్నంగా ఉందని, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని అబ్దుల్ అన్నారు. విక్రమ్ సూపర్ గా యాక్ట్ చేశారని ప్రశంసించారు. శివ మాట్లాడుతూ.. సినిమాకు మంచి స్పందన వస్తోందని, విక్రమ్ నటన ఆకట్టుకుందని అన్నారు. మంచి సినిమాలు, కొత్త నిర్మాతలు మరింతగా రావాలని అన్నారు.
