ఆర్టిస్టుల సంఘంలో కలకలం: సహచరుడు కక్ష కట్టి హింసిస్తున్నాడంటూ!
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన `అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్` (ఏ.ఎం.ఎం.ఎ) లో అంతర్గత విభేదాలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
By: Sivaji Kontham | 24 May 2026 5:43 PM ISTమలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన `అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్` (ఏ.ఎం.ఎం.ఎ) లో అంతర్గత విభేదాలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అసోసియేషన్ మాజీ జాయింట్ సెక్రటరీ, నటి అన్సిబా హసన్ తోటి నటుడు టిని టామ్‌పై బహిరంగంగా సంచలన ఆరోపణలు చేయడం మాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతోంది. టిని టామ్ తనపై వ్యక్తిగతంగా కక్ష గట్టి .. అక్రమ సంబంధాలు అంటగడుతూ అసత్య ప్రచారాలు చేశారని.. అలాగే మతపరమైన ఆరోపణలతో తనను టార్గెట్ చేస్తూ ఆర్గనైజేషన్‌లో అత్యంత అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించారని అన్సిబా తాజా మీడియా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
తాను `అమ్మ` జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాతే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయని అన్సిబా పేర్కొన్నారు. కమిటీ సమావేశాలలో వ్యక్తమయ్యే సాధారణ భిన్నాభిప్రాయాలను టిని టామ్ వ్యక్తిగత కక్షలుగా మార్చుకున్నారని అన్సిబా ఆరోపించారు. మొదట్లో తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన రూమర్లను వదిలేసినా ఆ తర్వాత అవి మతపరమైన రంగు పులుముకోవడంతో పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. తాను ఇతరులను మతమార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్నానంటూ టిని టామ్ దుష్ప్రచారం చేశారని... ఈ విషయాలను నటి నీనా కురుప్ స్వయంగా తనకు చెప్పిందని అన్సిబా వెల్లడించారు. `అమ్మ` ఫ్యామిలీ గెట్-టుగెదర్ వేడుకలలో నీనా కురుప్‌పై కూడా టిని టామ్ బౌతిక దాడికి ప్రయత్నించారని.. అక్కడ ఉన్నవారు అతడి ఆగడాలను అడ్డుకున్నారని సంచలన ఆరోపణలు చేసారు.
ఈ వివాదంలో మరో ముఖ్యమైన అంశం ఒక మతపరమైన సంస్థ `అమ్మ` ఈవెంట్‌కు స్పాన్సర్‌షిప్ ఇవ్వడం. అసోసియేషన్ ఎప్పుడూ తటస్థంగా ఉండాలని.. ఏ మతపరమైన గ్రూపులతో అనుబంధం కలిగి ఉండకూడదనే ఉద్దేశంతో తాను ఆ స్పాన్సర్‌షిప్‌ను వ్యతిరేకించానని అన్సిబా స్పష్టం చేశారు. అయితే తన అభిప్రాయాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ తనపై `జిహాదీ` అని ముద్ర వేశారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా సంఘంలోని మరొక మహిళా ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు తనపై త్రిపునితుర పోలీస్ స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదు చేయగా... పోలీసులు తనను స్టేషన్‌లో మూడు గంటల పాటు వేధించి.. బలవంతంగా సంతకం చేయించుకున్నారని అన్సిబా పేర్కొన్నారు.
ఈ వేధింపుల విషయమై తాను `అమ్మ` ఎగ్జిక్యూటివ్ కమిటీ వాట్సాప్ గ్రూప్‌లో మద్దతు కోరగా అప్పటి ప్రెసిడెంట్ ఇది అసోసియేషన్‌కు సంబంధం లేని విషయమని దాటవేశారని... టిని టామ్ దీనిని ఒక చిన్న కేసుగా కొట్టిపారేశారని అన్సిబా తెలిపారు. ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడి, రూమర్లు- తోటి సభ్యుల నుండి మద్దతు కరువవ్వడం వల్లే గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఫ్యామిలీ గెట్-టుగెదర్ తర్వాత తాను పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. రాజీనామా లేఖలో అధికారికంగా `పని ఒత్తిడి` అని పేర్కొన్నా కానీ.. సంస్థలోని విషపూరిత వాతావరణమే అసలు కారణమని ఇప్పుడు బహిరంగంగా వెల్లడించారు.
మొదట్లో కెరీర్ పాడవుతుందనే భయంతో మౌనంగా ఉన్నా కానీ.. చిత్ర పరిశ్రమలో తనపై రూమర్లు ఇంకా కొనసాగుతుండటంతోనే ఇప్పుడు నిజాలు మాట్లాడాల్సి వచ్చిందని అన్సిబా చెప్పుకొచ్చారు. ఈ వివాదం ప్రస్తుతం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా కాకుండా... `అమ్మ` అసోసియేషన్‌లో జరుగుతున్న పవర్ పాలిటిక్స్ .. మహిళా సభ్యులకు జరుగుతున్న అన్యాయాలు... మతపరమైన వేధింపులు.. అంతర్గత ఫిర్యాదులను పరిష్కరించే సరైన వ్యవస్థ లేకపోవడాన్ని ఎత్తిచూపుతోంది. ఈ వ్యవహారంపై మలయాళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. నీనా అన్సిబా దృశ్యం సిరీస్ లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
