పనిని తపస్సులా భావిస్తేనే సక్సెస్!
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ 80 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు దీటుగా పని చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
By: Srikanth Kontham | 10 May 2026 4:00 AM ISTబాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ 80 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు దీటుగా పని చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా అమితాబ్ పని సంస్కృతి గురించి సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన నోట్ రాశారు. మనం ఏదైనా లక్ష్యం కోసం లేదా పనిలో నిమగ్నమైనప్పుడు పూర్తి ఏకాగ్రత ఎంత అవసరమో? ఆయన వివరించారు. ముఖ్యంగా ఆధునిక కాలంలో మన చుట్టూ ఉండే ఆకర్షణలు పని తీరును ఎలా దెబ్బతీస్తాయో తన అనుభవాల ద్వారా పంచుకున్నారు. అమితాబ్ తన విశ్లేషణలో ఓ కీలకమైన పాయింట్ లేవనెత్తారు.
పని వేళల్లో సోషల్ మీడియాలో సమయం గడపడం, అనవసరమైన ఫోన్ కాల్స్ మాట్లాడటం, చివరికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కేటాయించడం కూడా ఒక్కోసారి డిస్ట్రాక్షన్ కిందకే వస్తాయని అభిప్రాయపడ్డారు. పని మీద పూర్తి దృష్టి పెట్టినప్పుడే చేసే వృత్తికి న్యాయం చేయగలమని అప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని బిగ్ బి స్పష్టం చేశారు. షూటింగ్ సెట్స్‌లో ఉన్నప్పుడు అమితాబ్ చాలా క్రమశిక్షణతో ఉంటారని పేరుంది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ తాను కెమెరా ముందు ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకుంటానని పేర్కొన్నారు.
పాత్రలో ఒదిగిపోవాలంటే చుట్టూ ఉండే వ్యక్తుల కంటే చేయబోయే పనిపైనే మనసు ఉండాలని నమ్ముతానన్నారు. వృత్తి పరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య ఉండాల్సిన స్పష్టమైన విభజన గురించి ఈ నోట్ లో సున్నితంగా పేర్కొన్నారు. నేటి యువత , ఉద్యోగులకు అమితాబ్ మాటలు ఓ హెచ్చరికలా కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల యుగంలో ప్రతి నిమిషం నోటిఫికేషన్లతో ఏకాగ్రత చెదిరిపోతోందని ఇది సృజనాత్మకతను తగ్గిస్తుందని అమితాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే కొన్ని వినోదాలను, సామాజిక అనుబంధాలను పని వేళల్లో పక్కన పెట్టక తప్ప దన్నారు.
అమితాబ్ పాటిస్తున్న వర్క్ ఫిలాసఫీ ఆయన్ని ఇండస్ట్రీలో ఇన్ని దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉంచింది.బిగ్ బి రాసిన లేఖ నటులకే కాక అన్ని రంగాల వారికి వర్తిస్తుంది. కుటుంబం , స్నేహాలు జీవితంలో ముఖ్యమే అయినా? ఆ బాధ్యతలు పనికి ఆటంకం కాకూడదని కచ్చితంగా చెప్పారు. క్రమశిక్షణ అనేది సమయపాలన మాత్రమే కాదు. అది మనిషి మెదడును ఒకే లక్ష్యం వైపు మళ్లించే కళగా వివరించారు. 80 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ పని తపన చూసి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. తన జీవితాన్నే ఉదాహరణగా చూపించి అమితాబ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
