బెదిరింపులతో ఆందోళనలో బాలీవుడ్ స్టార్లు.. బుల్లెట్ ప్రూఫ్‌తో హై అలెర్ట్
బాలీవుడ్ సహా ముంబైలో సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు ఆందోళనకరంగా మారాయి.
By: Sivaji Kontham | 2 Nov 2026 12:35 PM ISTబాలీవుడ్ సహా ముంబైలో సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు ఆందోళనకరంగా మారాయి. ఓవైపు సల్మాన్ ఖాన్ తో పాటు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుల ఇళ్లను సాధారణ పర్యాటకుల మాదిరి విజిట్ చేసి వచ్చామని పట్టుబడిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చెబుతుంటే పోలీసులకే కాదు, మొత్తం హిందీ చలనచిత్ర పరిశ్రమకే ముచ్చెమటలు పట్టేసాయి.
ఆ తర్వాత ఒక్కొక్కరుగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సొంత ఇళ్లకు, ఆఫీసులకు బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, సింహద్వారాలు సహా తలుపులు, గేట్లను అప్ గ్రేడ్ చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది. సల్మాన్ ఖాన్ ఇప్పటికే తన వద్ద 3-4 బుల్లెట్ ప్రూఫ్ హై ఎండ్ కార్లను రెడీగా ఉంచారు. ఈ కార్లను మార్చి మార్చి బయట ప్రయాణాలకు భాయ్ ఉపయోగిస్తున్నారు. సినిమా సెట్లు, బిగ్ బాస్ షో సెట్లు సహా ఎక్కడికి వెళ్లినా చుట్టూ వై ప్లస్ కేటగిరీ భద్రత, సొంత సెక్యూరిటీ గార్డులతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్లను వాడుతున్నారు.
ఇప్పుడు బాంబు బెదిరింపుల నీడలో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. తాజాగా ఆయన ఇంటివద్ద బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచే అభిమానులకు అభివాదం చేయడం చర్చనీయాంశమైంది. అమితాబ్ బచ్చన్ ప్రతి ఆదివారం ముంబైలోని తన నివాసం `జల్సా` బయట వేచి ఉండే వందలాది మంది అభిమానులను కలవడం దశాబ్దాలుగా వస్తున్న ఒక ఆనవాయితీ. అయితే ఈసారి జరిగిన ఈ ఆత్మీయ భేటీ మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠ మధ్య సాగింది. 84 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ఈ ఆదివారం పారదర్శకమైన బుల్లెట్ ప్రూఫ్ గాజు ఎన్‌క్లోజర్ వెనుక నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఆయన నివాసానికి నేరుగా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఈ అరుదైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. ఇది గ్యాంగ్ స్టర్ బెదిరింపు కాకపోవచ్చు.. ఖలీస్తాన్ నేషనల్ ఆర్మీ కూడా అంతకుమించి ప్రమాదకరమని ముంబై పోలీసులు భావిస్తుండటంతో బాలీవుడ్ సెలబ్రిటీలు సహా ఇతర కార్యాలయాలను కూడా బందోబస్తుతో కాపలా కాయిస్తున్నారు. చాలా చోట్ల ముంబైలో భద్రతా దళాలు కనిపిస్తున్నాయి.
ముంబై పోలీసులకు వచ్చిన ఒక బెదిరింపు ఈమెయిల్ ఆధారంగా ఈ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. బ్రాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిధిలోని ఒక విద్యాసంస్థకు వచ్చిన ఈ ఈమెయిల్లో `జల్సా`పై దాడి చేస్తామంటూ కొన్ని తేదీలను పేర్కొన్నారు. `ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ` పేరుతో వచ్చిన ఈ సందేశంలో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ముఖ్యమైన వేడుకలపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అమితాబ్ నివాసం చుట్టూ అదనపు పోలీసు బలగాలను మోహరించి రక్షణను పెంచారు.
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ భద్రతా ఎన్‌క్లోజర్ లోపల నిలబడి అభిమానులకు నమస్కరిస్తూ... చిరునవ్వుతో పలకరించారు. ఆయన పక్కనే కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కూడా ఎంతో అప్రమత్తంగా నిలబడి కనిపించారు. ముంబై పోలీసులతో పాటు అమితాబ్ సొంత భద్రతా సిబ్బంది పరిసరాలను నిరంతరం పర్యవేక్షించారు. గాజు గోడ వెనుక నుంచి అమితాబ్ అభిమానులను పలకరించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు వరుసగా బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జూహూలో నటుడు టైగర్ ష్రాఫ్ వాహనం సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత సినీ ప్రముఖుల భద్రతపై ఏజెన్సీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వరసపెట్టి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో భద్రతా సంస్థలు, సెలబ్రిటీ మేనేజ్మెంట్ టీమ్‌లు ప్రముఖుల భద్రతా ప్రోటోకాల్‌ను చెక్ చేసుకుంటూ పటిష్టమైన చర్యలు చేపడుతున్నాయి.
ఇంతటి భద్రతాపరమైన ఆందోళనలు భయాలు ఉన్నా కానీ.. అమితాబ్ బచ్చన్ తన వృత్తిపరమైన బాధ్యతలను ఎక్కడా తగ్గించడం లేదు. ఆయన ప్రస్తుతం క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్‌పతి` 18వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన దక్షిణాది చిత్రాల్లో అతిథి పాత్రలు కూడా చేస్తున్నారు. అభిమానులకు అమితాబ్ ఇచ్చే దర్శనం కొనసాగడం ఊరటనిచ్చినా కానీ.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ రూపంలో కనిపించిన ఈ భద్రత వర్తమాన పరిస్థితుల్లో సెలబ్రిటీల భద్రతా సవాళ్లను, ముంబై నగరంలోని భయాందోళనలను స్పష్టం చేస్తోంది.
