Begin typing your search above and press return to search.

బిగ్‌బీగా మారకముందు అమితాబ్‌కు ఇన్ని అవమానాలా?

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో తనకంటూ ప్రత్యేక చాప్ట‌ర్‌ను రాసుకున్న నటుడు అమితాబ్ బచ్చన్. ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన సినీ జ‌ర్నీలో ఎన్నో స‌క్సెస్‌లు, అవార్డులు, రికార్డులు ఉన్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Aug 2026 3:10 PM IST
బిగ్‌బీగా మారకముందు అమితాబ్‌కు ఇన్ని అవమానాలా?
X

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో తనకంటూ ప్రత్యేక చాప్ట‌ర్‌ను రాసుకున్న నటుడు అమితాబ్ బచ్చన్. ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన సినీ జ‌ర్నీలో ఎన్నో స‌క్సెస్‌లు, అవార్డులు, రికార్డులు ఉన్నాయి. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు ఆయన కూడా ఎన్నో అవమానాలు, విమర్శలు, తిరస్కరణలను ఎదుర్కొన్నారు. తాజాగా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అమితాబ్ స్వయంగా గుర్తుచేసుకున్నారు.

కౌన్ బనేగా కరోడ్‌పతి 18 తాజా ఎపిసోడ్‌లో కామన్వెల్త్ గేమ్స్ 2026లో గోల్డ్ మెడ‌ల్స్ సాధించిన ప్లేయ‌ర్ల‌తో అమితాబ్ సంభాషించారు. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో తానూ ఇతరుల నుంచి తిట్లు లేదా విమర్శలు ఎదుర్కొన్నారా అని ఓ ప్లేయ‌ర్ అడగడంతో.. బిగ్‌బీ తన గత అనుభవాలను పంచుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన మొద‌ట్లో తన యాక్టింగ్‌పై కొందరు తీవ్రంగా విమర్శించేవారని అమితాబ్ తెలిపారు. తనకు యాక్టింగ్ చేయ‌డం రాదని, తిరిగి ఇంటికి వెళ్లిపొమ్మ‌ని కూడా కొందరు చెప్పిన సందర్భాలున్నాయని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, తన హైట్‌ను కూడా అప్పట్లో కొందరు ప్రతికూలంగా చూశారని చెప్పారు. అయితే ఆ మాటలతో వెనక్కి తగ్గకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగినట్లు వివరించారు.

సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైన తర్వాత కూడా ప‌రిస్థితులు వెంటనే సులభం కాలేదని అమితాబ్ పేర్కొన్నారు. డైరెక్ట‌ర్లు తన యాక్టింగ్‌లోని లోపాలను గుర్తించి సీన్స్‌ను ఎలా చేయాలి, డైలాగ్‌ను ఎలా పలకాలి, కెమెరా ముందు ఎలా నిలబడాలి అనే విషయాల్లో స‌ల‌హాలిచ్చేవారని చెప్పారు. ఆ సలహాలను స్వీకరించడం వల్లే క్రమంగా తన యాక్టింగ్ లో ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందని ఆయన వివరించారు.

ఇక కెరీర్ స్టార్టింగ్ లో ఎదురైన మరో సంఘటనను కూడా అమితాబ్ గుర్తుచేసుకున్నారు. సాధారణంగా సమయపాలన విషయంలో జాగ్రత్తగా ఉండే ఆయన ఓసారి షూటింగ్‌కు ఆలస్యంగా వెళ్లారట. అప్పట్లో సొంత కారు లేకపోవడంతో మరొకరి వాహనంలో సెట్‌కు చేరుకున్నట్లు తెలిపారు. అయితే అప్పటికే డైరెక్ట‌ర్ షూటింగ్ ముగించుకుని బయటకు వచ్చి ఉండటంతో.. షూటింగ్ ప్యాకప్ అయిందని చెప్పి తనను తిరిగి వెళ్లమన్నారని అమితాబ్ వెల్లడించారు.

ఇలాంటి చేదు అనుభవాలే తనలో మరింత పట్టుదలను పెంచాయని బిగ్‌బీ మాటల్లో స్పష్టమవుతోంది. నేడు ఇండియ‌న్‌ సినిమాకు ప్రతిష్ఠాత్మకమైన పేరుగా నిలిచిన అమితాబ్ జ‌ర్నీ.. కెరీర్ స్టార్టింగ్ దశలో ఎదురైన విమర్శలు ఫ్యూచ‌ర్ ను డిసైడ్ చేయ‌వ‌ని మరోసారి గుర్తుచేస్తోంది. కాగా కౌన్ బనేగా కరోడ్‌పతి 18 ఆగస్టు 10 నుంచి ప్రసారమవుతోంది.