రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో మెగాస్టార్ కళ్లుచెదిరే సంపాదన.. కేవలం అద్దెలతోనే 21 కోట్లు!
భారతీయ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా తెలివైన పెట్టుబడులతో కూడా మైండ్ బ్లాకింగ్ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
By: M Prashanth | 18 Aug 2026 10:37 PM ISTభారతీయ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా తెలివైన పెట్టుబడులతో కూడా మైండ్ బ్లాకింగ్ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బచ్చన్ కుటుంబం క్రమబద్ధమైన పెట్టుబడులతో కళ్లుచెదిరే లాభాలు ఆర్జించడం వ్యాపార వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సరైన సమయం.. సరైన ప్రాపర్టీని ఎంచుకుని భారీగా సంపాదిస్తూ `తెలివైన పెట్టుబడులు అంటే ఇవే` అని నిరూపిస్తున్నారు.
గతంలో అమితాబ్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి కొన్ని అపార్ట్‌మెంట్లలో పెట్టుబడులు పెట్టి... కేవలం నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 400 రెట్ల లాభాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ద్వారా రూ. 50 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు లాభాలను ఆర్జించారు. ఇప్పుడు తాజాగా కేవలం ఒక ప్రాపర్టీ అద్దె (లీజు) ద్వారానే 20 కోట్లు పైగా ఆదాయాన్ని రాబడుతూ మరోసారి వార్తల్లో నిలిచారు.
తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సారాంశం ప్రకారం.. ముంబైలోని అందేరీ వెస్ట్‌లో ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్‌లో అమితాబ్‌కు చెందిన మూడు ఫ్లోర్‌లను ట్రూ నేటివ్ ఎఫ్ & బి ప్రయివేట్ లిమిటెడ్ అనే న్యూట్రిషన్ కంపెనీకి లీజుకు ఇచ్చారు. ఈ డీల్ ప్రకారం ప్రతినెల అద్దె కింద రూ. 33 లక్షలు బచ్చన్ ఖాతాలో జమ కానున్నాయి. ఐదేళ్ల కాలపరిమితితో కుదుర్చుకున్న ఈ లీజు మొత్తం విలువ దాదాపు రూ. 21.88 కోట్లు కావడం విశేషం.
ఈ భారీ లీజు ఒప్పందంలో భాగంగా సదరు కంపెనీ ఇప్పటికే రూ. 1.98 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది. అంతేకాకుండా.. ప్రతి సంవత్సరం అద్దెపై 5 శాతం చొప్పున పెంపు ఉండేలా నిబంధనలు రూపొందించారు. దీనితో పాటు ఆ ప్రాపర్టీలో 9 వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించే వెసులుబాటును కూడా కల్పించారు.
సోషల్ మీడియాలో ఈ లీజు వివరాలు బయటకు రావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వ్యాపార రంగంలో అమితాబ్ తీసుకుంటున్న ముందస్తు నిర్ణయాలు... ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీల సంపాదన స్థాయిపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో బచ్చన్ ఫ్యామిలీ సాధిస్తున్న ఈ ఆదాయం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. మరోవైపు సినిమాలు, టీవీ రియాలిటీ షోలతోను అమితాబ్ అసాధారణమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 80 పైబడిన వయసులో ఆయన సంపాదన చూస్తుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
