Begin typing your search above and press return to search.

బిగ్ బి KBC ని.. నాగార్జున 'బిగ్ బాస్‌'ని వదిలేస్తే నెక్ట్స్ ఏమ‌వుతుంది?

ప్రస్తుతం కేబీసీ 18వ సీజన్ నడుస్తుండగా.. ఇటీవల రాసిన బ్లాగ్‌లో అమితాబ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

By:  Sivaji Kontham   |   10 Sept 2026 7:13 AM IST
బిగ్ బి KBC ని.. నాగార్జున బిగ్ బాస్‌ని వదిలేస్తే నెక్ట్స్ ఏమ‌వుతుంది?
X

బుల్లితెరపై కొన్ని రియాలిటీ షోలు ఎంతగా హిట్ అయ్యాయో.. ఆ షోలకు హోస్టింగ్‌ చేసిన స్టార్స్ అంతే స్థాయిలో బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టారు. హిందీలో `కౌన్ బనేగా కరోడ్‌పతి`(KBC) అంటే అమితాబ్ బచ్చన్... తెలుగులో 'బిగ్ బాస్ అంటే కింగ్ నాగార్జున అనేంతగా వారి పేర్లు ఆయా షోలతో పెనవేసుకుపోయాయి. అయితే తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కేబీసీ నుంచి తప్పుకోబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా వ్యాఖ్యానించడం టీవీ రంగాన్ని ఊపేస్తోంది. ఒకవేళ బిగ్ బి కేబీసీని.. తెలుగులో నాగార్జున బిగ్ బాస్‌ని వదిలేస్తే ఆయా ఛానెళ్లకు.. షోల రేటింగ్‌లకు జరిగే డ్యామేజ్ ఊహించని స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం కేబీసీ 18వ సీజన్ నడుస్తుండగా.. ఇటీవల రాసిన బ్లాగ్‌లో అమితాబ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. షోలోకి వచ్చే పోటీదారుల కష్టాలు.. వారి హృదయవిదారక కథనాలు చూసి తట్టుకోవడం మానసికంగా తనకు కష్టంగా మారుతోందని.. అందుకే ఈ ప్రయాణానికి స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకోవాలని ఉందంటూ ఆయన అభిప్రాయపడ్డారు. 2000వ సంవత్సరం నుంచి ఒక్క మూడో సీజన్ (షారూఖ్ ఖాన్ హోస్ట్ చేశారు) మినహా కేబీసీ అంతా అమితాబ్ నడిపించారు. గతంలో సల్మాన్ ఖాన్ భర్తీ చేస్తారనే వార్తలు వచ్చినా అమితాబ్ స్థానాన్ని మరొకరు భర్తీ చేయడం అసాధ్యమని ప్రూవ్ అయింది. ఆయన చెప్పే `దేవీ ఔర్ సజ్జనో` అనే పిలుపు వినకపోతే కేబీసీ తన ఆత్మను కోల్పోయినట్లే.

ఇక తెలుగు బుల్లితెర విషయానికి వస్తే `బిగ్ బాస్` షోని నిలబెట్టిన ఘనత పూర్తిగా అక్కినేని నాగార్జునదే. తొలి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని నడిపించినా మూడో సీజన్ నుంచి వరుసగా హోస్టింగ్‌ బాధ్యతలు చేపట్టిన నాగార్జున ఈ షోకి తిరుగులేని పాపులారిటీ తెచ్చారు. మెగాస్టార్ చిరంజీవిని షోలోకి తెచ్చినా... ఎన్టీఆర్ వంటి యంగ్ స్టార్స్ చేసినా.. ఆ ఇద్ద‌రూ ఆగిపోగా.. సీజన్ల తరబడి ఆడియన్స్‌ను కట్టిపడేసే రేటింగ్స్ తేవడంలో కింగ్ ఒక్కడే అని నిరూపితమైంది. 60 దాటినా యువ హీరోలా కనిపిస్తూ నాగ్ ప్రదర్శించే ఎనర్జీ- హుందాతనం ఈ షోకి ప్రధాన బలంగా మారాయి.

హిందీ బిగ్ బాస్‌కు సల్మాన్ ఖాన్ ఎలాగో, తెలుగు బిగ్ బాస్‌కు నాగార్జున అలా ఒక ఐకాన్‌లా మారిపోయారు. కొన్నేళ్లుగా నాగార్జునకు మైండ్ బ్లాకింగ్ పారితోషికం చెల్లిస్తూ మేకర్స్ ఆయననే కొనసాగించడానికి ప్రధాన కారణం కూడా అదే. ఒకవేళ సినిమాలతో బిజీగా ఉన్న నాగార్జున స్వతహాగా హోస్టింగ్‌కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంటే మాత్రం బిగ్ బాస్ ప్రేక్షకులు తీవ్రంగా హర్ట్ అవుతారు. సీనియర్ స్టార్లు ఒక షోను హోస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ కంటెస్టెంట్లను హెచ్చరించడం నుంచి వినోదం పంచడం వరకు ఒక పరిణతి- బ్యాలెన్స్ కనిపిస్తాయి. ప్రత్యామ్నాయంగా ఎంత పెద్ద స్టార్ వచ్చినా ఆ సీనియారిటీ తెచ్చే మెచ్యూరిటీని రీప్లేస్ చేయడం చాలా కష్టం.

అమితాబ్ బచ్చన్ లేని `కౌన్ బనేగా కరోడ్‌పతి`ని, నాగార్జున లేని `బిగ్ బాస్ తెలుగు`ని అభిమానులు అసలు ఊహించుకోలేరు. వీరు కేవలం హోస్ట్‌లు మాత్రమే కాదు.. ల‌క్ష‌లాది మంది ప్రేక్షకులకు ఆయా టీవీ కార్యక్రమాలపై ఉన్న నమ్మకానికి ప్రతీకలు. ఒకవేళ వీరు ఈ ప్రాజెక్ట్‌ల నుంచి నిజంగానే వైదొలిగితే టీవీ ఛానెళ్లకు భారీ ఆర్థిక న‌ష్టం.. టీఆర్పీ నష్టం వాటిల్లడం ఖాయం. ప్రేక్షకులు షో కాన్సెప్ట్ కంటే కూడా ఈ దిగ్గజాల వ్యక్తిత్వాన్ని.. ప్రెజెన్స్‌ను చూడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి... బిగ్ బి, నాగ్ తీసుకొనే నిర్ణయాలపైనే బుల్లితెర భవిష్యత్ షోల‌ ఈక్వేషన్లు ఆధారపడి ఉన్నాయి.