Begin typing your search above and press return to search.

83 వ‌య‌సులోనూ తగ్గని ఎనర్జీ: బుల్లితెరపై నం.1 మెగా హోస్ట్ ఆయ‌నే

కానీ ఎనిమిది పదులు దాటిన వయసులోనూ అదే ఉత్సాహంతో.. ఎనర్జీతో కోట్లాది మంది హృదయాలను ఏలడం ఒక్క బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కే సాధ్యమైంది.

By:  Sivaji Kontham   |   30 July 2026 7:48 PM IST
83 వ‌య‌సులోనూ తగ్గని ఎనర్జీ: బుల్లితెరపై నం.1 మెగా హోస్ట్ ఆయ‌నే
X

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని కొందరు నిరూపిస్తుంటారు. కానీ ఎనిమిది పదులు దాటిన వయసులోనూ అదే ఉత్సాహంతో.. ఎనర్జీతో కోట్లాది మంది హృదయాలను ఏలడం ఒక్క బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కే సాధ్యమైంది. హిందీ సినిమా షెహన్‌షా అమితాబ్ బచ్చన్ 83 ఏళ్ల వయసులోనూ (జననం: 11అక్టోబర్ 1942) తన నటనా ప్రతిభతో, హోస్టింగ్ శైలితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకవైపు పెద్ద తెరపై విభిన్నమైన పాత్రలతో అలరిస్తూనే... మరోవైపు బుల్లితెరపై `కౌన్ బనేగా కరోడ్‌పతి` (KBC) షోను విజయవంతంగా నడిపిస్తూ నేటికీ భారతదేశపు అత్యుత్తమ హోస్ట్‌గా నంబర్-1 స్థానంలో కొనసాగుతున్నారు.

యుక్తవయసులో తీవ్రమైన అనారోగ్య సమస్యలను, శస్త్రచికిత్సలను ఎదుర్కొన్నా అమితాబ్ తన క్రమశిక్షణ, సరైన ఆహార నియమాలు - ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఇప్పటికీ ఎంతో దృఢంగా ఉన్నారు. ప్రస్తుతం వివిధ భాషల్లో రియాలిటీ షోలను హోస్ట్ చేస్తున్న స్టార్ హీరోల వయసులను గమనిస్తే అమితాబ్ ఎనర్జీ ఎంత అసాధారణమైనదో అర్థమవుతుంది. తెలుగు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వయసు 60 పైమాటే కాగా.. హిందీ బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ (60), మలయాళంలో మోహన్ లాల్ (66), కన్నడలో కిచ్చా సుదీప్ (66) హోస్టులుగా రాణిస్తున్నారు. వీళ్లందరి కంటే వయసులో చాలా పెద్దవారైనా.. బుల్లితెరపై అమితాబ్ చూపిస్తున్న వాక్చాతుర్యం, ఉత్సాహం ముందు ఎవరైనా సలామ్ అనాల్సిందే!

ఇక కేబీసీ విషయానికి వస్తే.. త్వరలోనే ప్రారంభం కానున్న `కౌన్ బనేగా కరోడ్‌పతి` 18వ సీజన్ (KBC 18) కోసం అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. ప్రీ-ప్రొడక్షన్ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుని షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సందర్భంగా గురు పౌర్ణమి నాటి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు తన బ్లాగ్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. ``ఫైనల్ మాక్ షూట్స్ పూర్తయ్యాయి.. ఇప్పుడు ప్రొడక్షన్ - ఆడియన్స్ ముందర అసలు పరీక్ష మొదలవుతుంది`` అని పేర్కొంటూ సెట్స్ నుంచి కొన్ని బిహైండ్ ది సీన్స్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసారు.

అంతేకాకుండా ఈ సీజన్ పై వీక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ, ``ఈసారి మా ప్రోమోలో చెప్పినట్లుగా... కాస్త ఎక్కువగానే ఆలోచించాల్సి ఉంటుంది!!``అంటూ అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ పాపులర్ గేమింగ్ షో ``హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్?`` ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ షోకి మూడో సీజన్ మినహా (షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు) మొదటి సీజన్ నుంచి అమితాబే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆగస్టు 10వ తేదీ నుంచి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ఈ KBC 18వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది.

వయసుతో సంబంధం లేకుండా నిరంతరం సరికొత్త ఉత్సాహంతో కెమెరా ముందుకు వస్తూ.. భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన హోస్ట్‌గా నిలవడం అమితాబ్ బచ్చన్ సాధించిన అరుదైన మైలురాయి. ఎంతోమంది యువ నటులకు .. సమాజానికి ఆయన చూపుతున్న నిబద్ధత, ఆరోగ్యకరమైన జీవనశైలి ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. 83 ఏళ్ల వయసులోనూ అదే గంభీరమైన గొంతుతో.. చెరగని చిరునవ్వుతో బుల్లితెరను ఏలుతున్న అమితాబ్ బచ్చన్ నిజంగానే ఇండియన్ సినిమా అజరామర లెజెండ్ అంటే అతిశ‌యోక్తి కాదు!