Begin typing your search above and press return to search.

లేట్ అయిందా? భార్య‌తో తిట్లు తప్పవు!

ఏదైనా పెళ్లికి లేదా కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మీ భార్య జయా బచ్చన్ రెడీ అవ్వడానికి మీరు ఎప్పుడైనా గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందా? అని కంటెస్టెంట్ అడిగారు.

By:  Srikanth Kontham   |   14 Sept 2026 2:00 PM IST
లేట్ అయిందా? భార్య‌తో తిట్లు తప్పవు!
X

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బుల్లితెరపై నిర్వహిస్తున్న పాపులర్ క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్‌పతి 18` జ్ఞానాన్ని పంచడమే కాదు. అమితాబ్ వ్యక్తిగత జీవిత విశేషాలను తెలుసుకోవడానికి కూడా వేదికగా నిలుస్తోంది. పోటీదారులతో మాట్లాడే సమయంలో అమితాబ్ తరచుగా కుటుంబం, భార్య జయా బచ్చన్‌తో ఉన్న అనుబంధం గురించి సరదా ముచ్చట్లు పంచుకుంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో జయాబ‌చ్చ‌న్ వేడుకలకు సకాలంలో సిద్ధం కావడానికి తాను ఉపయోగించే ఫన్నీ ట్రిక్‌ను రివీల్ చేసారు.

ఏదైనా పెళ్లికి లేదా కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మీ భార్య జయా బచ్చన్ రెడీ అవ్వడానికి మీరు ఎప్పుడైనా గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందా? అని కంటెస్టెంట్ అడిగారు. దీనికి బిగ్ బి నవ్వుతూ స్పందించారు. అది చాలా మంచి ప్రశ్న. ఆలస్యం కాకుండా ఈవెంట్లకు వెళ్లడానికి ఒక సీక్రెట్ ప్లాన్ ఉపయోగిస్తానని సరదాగా చెప్పుకొచ్చారు. `మేము ఎక్కడికైనా వెళ్లాల్సి వ‌చ్చినా? ముందుగానే ఒక సమయం అనుకుంటాం. అయితే అసలు సమయం కంటే ఒక గంట ముందు సమయాన్నే నేను ఆమెకు చెప్తాను.

ఉదాహరణకు పెళ్లి సమయం సాయంత్రం 6 గంటలకు ఉంటే నేను ఆమెకు 5 గంటలకే అని చెప్తాను. దానివల్ల ఆమె మధ్యాహ్నం 3:30 లేదా 4 గంటలకే రెడీ అవ్వడం ప్రారంభిస్తుంది. అలా మేము అనుకున్న అసలు సమయానికి పర్ఫెక్ట్‌గా అక్కడికి చేరుకుంటాం` అని సరదాగా వ్యాక్యానించారు. అలాగే అమితాబ్ ఇంటి విషయాలను పంచు కున్నారు. ఆలస్యంగా ఇంటికి వస్తే జయా బచ్చన్ కేకలు వేస్తుందా? అని మరొక కంటెస్టెంట్ అడిగినప్పుడు.. ఆ తిట్ల నుంచి తప్పించుకోవడానికి తానేం చేస్తారో చెప్పారు.

ఉదయాన్నే లేవగానే కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూప్‌లో నమస్కారం అని మెసేజ్ పెట్టి తనకు షూటింగ్ ఆలస్యమవుతుందని తన కోసం డిన్నర్ వేచి చూడవద్దని ముందుగానే సమాచారం అందిస్తానని తెలిపారు. అలా చెప్పకపోతే ఇంత ఆలస్యంగా రావడానికి ఇదేనా సమయం? అని జయ క్లాస్ పీకుతుందని న‌వ్వేసారు. ఇలా అమితాబ్ -జ‌యాబ‌చ్చ‌న్ విశేషాలు చెబుతుంటే ఆ దంప‌తుల మ‌ధ్య అన్యోన్య‌త ఎంత ధృడంగా ఉందో అర్ద‌మ‌వుతుంది.

ఈ జంట‌ను చూసిన నెటి జ‌నులు బంధం...ప్రేమ అంటే ఇలా ఉండాలి. విడిపోవాలనుకునే వాళ్లు ఒక్క‌సారి అమితాబ్-జ‌యాబ‌చ్చ‌న్ అద‌ర్శ దంప‌తుల్ని చూసి నేర్చుకోండి అంటూ సూచిస్తున్నారు.అమితాబ్-జ‌యాబ‌చ్చ‌న్ ల‌కు కుమార్తె శ్వేతా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉన్నారు. నవ్య నవేలి నందా, అగస్త్య నందా , ఆరాధ్య బచ్చన్ అనే ముగ్గురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్న సంగ‌తి తెలిసిందే.