అమితాబచ్చన్ జీవితంలో మర్చిపోని అవమానం!
భారతీయ చలనచిత్ర పరిశ్రమంలో బిగ్ బీగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన అమితాబ్ బచ్చన్ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో దేవుడిగా కొలువుదీరారు.
By: Srikanth Kontham | 19 Aug 2026 1:00 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమంలో బిగ్ బీగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన అమితాబ్ బచ్చన్ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో దేవుడిగా కొలువుదీరారు. అయితే అమితాబ్ ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీఇన్నీ కావు. అమితాబ్ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న తొలి నాటి ఇబ్బందికర పరిస్థితులను తాజాగా ఓ వేదికపై గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో తన శారీరక ఎత్తు కారణంగా ఎన్నో విమర్శలను, చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు.
కెరీర్ ప్రారంభ దశలో ఎత్తు శాపంగా మారిందని అమితాబ్ బచ్చన్ తెలిపారు. సాధారణ నటులతో పోలిస్తే అమితాబ్ ఎత్తు చాలా ఎక్కువగా ఉండటంతో దర్శక నిర్మాతలు సినిమాల్లోకి తీసుకోవడానికి వెనుకాడేవారట. ఆ రోజుల్లో హీరోల రూపం, ఎత్తు వంటి విషయాలపై కఠినమైన నిబంధనలు ఉండటంతో అమితాబ్ రూపురేఖలు ఇండస్ట్రీకి సరిపోవని భావించారుట. ఈ కారణంగానే అమితాబ్ ఎన్నో అవకాశాలు చేజారిపోయాయని నిర్మాతల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఎన్నో సార్లు నిరాశే మిగిలిందని వెల్లడించారు.
అంతేకాదు ఒకానొక సందర్భంలో సెట్స్ నుంచి తనను వెళ్లగొట్టిన సంఘటనను కూడా బిగ్ బీ గుర్తు చేసుకున్నారు. ఎత్తు కారణంగా ఇతరులతో సరిగ్గా సరిపోరని భావించి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తనను సెట్ నుంచి బయటకు నెట్టివేశారని..అప్పుడు తన మనసెంతో బాధపడిందన్నారు. ఆ సమయంలో పడిన మానసిక వేదన మాటల్లో చెప్పలేనని.. అయినా తాను ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిలదొక్కుకున్నానని తెలిపారు. సాధారణ నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి నేడు ఇండియన్ సినిమాకు గర్వకారణంగా మారిన ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.
కాలం మారుతున్న కొద్దీ అమితాబ్ నటనపై ఉన్న ప్రతిభే ఆయన్ని పరిశ్రమలో నిలబెట్టింది. ఎత్తును లోపంగా చూసిన వారే.. నేడు అదే ఎత్తును ఆయన పర్సనాలిటీకి పెద్ద బలంగా భావించేలా అమితాబ్ తన నటనతో నిరూపించుకున్నారు. ఏ రంగంలోనైనా ప్రవేశం కష్టంగా ఉంటుందని.. కానీ పట్టుదల, కృషి ఉంటే ఏ అడ్డంకినైనా దాటుకుని విజయం సాధించొచ్చని అమితాబ్ జీవితం నిరూపిస్తుంది. తొలి నాళ్లలో ఎదురైన అవమానాలే తనను మరింత బలమైన నటుడిగా తీర్చిదిద్దాయని భావిస్తుంటాన్నారు.
80 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. `కౌన్ బనేగా కరోడ్‌పతి` (KBC) వంటి పాపులర్ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అమితాబ్ బచ్చన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన జీవిత విశేషాలను, నాటి కష్టాలను అమితాబ్ స్వయంగా పంచుకోవడం యువతరానికి గొప్ప గుణపాఠంలా నిలుస్తుంది. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా లక్ష్యం వైపు అడుగులు వేయాలనే తపనకు అమితాబ్ ప్రయాణమే నిదర్శనం. ఎత్తు ఎక్కువైందని సెట్ల నుంచి వెళ్లగొట్టబడిన సాధారణ యువకుడు నేడు ఇండియన్ సినిమా గర్వించదగ్గ మహామేరువగా ఎదిగిన తీరు అందరినీ ఆలోచింపజేస్తుంది. ఆరంభంలో ఎదురైన అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని సాధించిన విజయమే ఆయన్ని షెహెన్‌షాగా నిలబెట్టింది.
