బాలీవుడ్ మెగాస్టార్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ !
ఈ కేసులో వివాదాస్పదంగా ఉన్న వివిధ సంస్థలు లేదా వ్యక్తులతో సామరస్యపూర్వక పరిష్కారం కుదరకపోతే కేసును ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అమితాబ్ బచ్చన్ నేరుగా కోర్టు ముందుకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
By: Srikanth Kontham | 10 Oct 2026 12:58 PM ISTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల రక్షణ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో వివాదాస్పదంగా ఉన్న వివిధ సంస్థలు లేదా వ్యక్తులతో సామరస్యపూర్వక పరిష్కారం కుదరకపోతే కేసును ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అమితాబ్ బచ్చన్ నేరుగా కోర్టు ముందుకు హాజరుకావాలని స్పష్టం చేసింది. జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
2022 నవంబరులో అమితాబ్ బచ్చన్ తన పేరు, రూపురేఖలు , గొంతును తన అనుమతి లేకుండా వ్యాపార ప్రకటనలు, లాటరీలు, టీ-షర్టులు, పుస్తకాల ప్రచురణ , ఇతర వ్యాపార లావాదేవీలకు ఉపయోగించకుండా నిషేధించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేకించి `కౌన్ బనేగా కరోడ్‌పతి` (KBC) పేరుతో నకిలీ లాటరీలు నిర్వహిస్తూ ప్రజలను మోసగిస్తున్న యాప్ డెవలపర్‌లను అడ్డుకోవాలని కోరారు. ఆ సమయంలో జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం అమితాబ్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అమితాబ్ పర్సనాలిటీ రైట్స్‌ను ఉల్లంఘించకుండా ఎక్స్-పార్టీ ఇంజంక్షన్ మంజూరు చేసింది.
ఈ కేసు విచారణ ప్రక్రియలో భాగంగా వివాదంలో ఉన్న ప్రతివాదులతో మధ్యవర్తిత్వం ద్వారా ఒప్పందానికి వచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది ప్రతివాదులతో సామరస్యపూర్వక పరిష్కారం కుదిరినా? అమితాబ్ బచ్చన్ వైపు నుండి కొన్ని సాంకేతిక కారణాలు వల్ల ఆ పరిష్కార ఒప్పందంపై అధికారికంగా సంతకాలు పూర్తి చేయలేకపోయారని కోర్టుకు తెలిపారు.
అమితాబ్ బచ్చన్ తరఫు న్యాయవాది ధృవ్ ఆనంద్ ఈ ప్రక్రియను మిగిలిన లాంఛనాలను పూర్తి చేసి ఒప్పంద పత్రాలను కోర్టు రికార్డుల్లో ఉంచేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు ఈ ఒప్పంద ప్రక్రియను పూర్తి చేసేందుకు 2026 నవంబర్ 16 వరకు గడువు మంజూరు చేసింది.
అయితే తదుపరి విచారణ నాటికి పరిష్కార ఒప్పందం పూర్తి కాకపోయినా? విఫలమైనా? పిటిషన్‌దారుడైన అమితాబ్ బచ్చన్ స్వయంగా విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని ఆర్డర్ X రూల్ 2, ఆర్డర్ V రూల్ 3 తో పాటు బీఎస్ ఏ 2023లోని సెక్షన్ 168 ద్వారా కోర్టుకు ఉన్న అధికారాలను ఉపయోగించి వాదనలు కొనసాగించడానికి పిటిషనర్ స్వయంగా హాజరుకావడం అవసరమని కోర్టు పేర్కొంది.
ప్రముఖ వ్యక్తుల పేరు, ప్రఖ్యాతులను వారి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం వల్ల వారి ప్రతిష్టకు తీవ్ర భంగం కలుగుతుందని గతంలోనే కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో నవంబర్ 16న జరగబోయే తదుపరి విచారణ నాటికి ఒప్పందం పూర్తవుతుందా? లేదా? అమితాబ్ బచ్చన్ స్వయంగా ఢిల్లీ హైకోర్టుకు హాజరవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
