Begin typing your search above and press return to search.

ఆమిర్ ఖాన్ నాలెడ్జ్‌కు అమితాబ్ ఫిదా!

గ‌తంలో ఆమిర్ ఈ గేమ్‌లో ఒక దశలో తదుపరి పెద్ద మొత్తానికి సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ, షో టైమ్ అయిపోయి, సైరన్ మోగడంతో ఆ అవకాశం అక్కడితో ఆగిపోయింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Aug 2026 11:22 AM IST
ఆమిర్ ఖాన్ నాలెడ్జ్‌కు అమితాబ్ ఫిదా!
X

కౌన్ బనేగా కరోడ్‌పతి కొత్త సీజన్ మొద‌లైన వెంటనే ఆమిర్ ఖాన్‌కు సంబంధించిన ఒక పాత సంఘటన మళ్లీ చర్చనీయాంశంగా మారింది. తాజాగా మొద‌లైన కొత్త సీజ‌న కు త‌మ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఆమిర్ గెస్టుగా పాల్గొన్న సందర్భంగా అమితాబ్ బచ్చన్ చెప్పిన ఒక జ్ఞాపకం, ఆమిర్ నాలెడ్జ్‌పై కొత్త ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా గేమ్ ముగిసిన తర్వాత కూడా ప్రశ్నపై ఆసక్తి చూపిన ఆమిర్ తీరు గురించి బిగ్ బీ చెప్పిన వివ‌రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

గ‌తంలో ఆమిర్ ఈ గేమ్‌లో ఒక దశలో తదుపరి పెద్ద మొత్తానికి సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ, షో టైమ్ అయిపోయి, సైరన్ మోగడంతో ఆ అవకాశం అక్కడితో ఆగిపోయింది. అయితే ఆమిర్ ఆ ప్రశ్న ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి చూపారని, షో పూర్తైన తర్వాత ప్రశ్నను చూసి దానికి సరైన సమాధానం చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆ సందర్భంలో ఆమిర్ సాధారణ పార్టిసిపెంట్ లాగా కాకుండా, ప్రశ్నను ఒక నాలెడ్జ్ ఛాలెంజ్‌గా తీసుకున్నారని అమితాబ్ అభిప్రాయపడ్డారు.

ఈ సంఘటనతో మరోసారి KBC ఫార్మాట్‌పై కూడా డిస్క‌ష‌న్ మొదలైంది. మొద‌టి సీజన్లలో టైమ్ కంట్రోల్, సైరన్ మోగిన వెంటనే గేమ్ ముగిసిపోవడం వంటి నియమాలు చాలా కఠినంగా అమలయ్యేవని పాత ప్రేక్షకులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఫార్మాట్‌తో పోలిస్తే అప్పటి నియమాలు పోటీదారులపై మరింత ఒత్తిడిని సృష్టించేవని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్లపై కూడా డిస్క‌ష‌న్ సాగుతోంది. ప్రముఖ నటులు పాల్గొనే ఎపిసోడ్లలో వారు సాధారణంగా మంచి మొత్తాన్ని గెలుచుకుని దాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తారని ప్రేక్షకులకు ముందే ఒక అంచనా ఉండటంతో, అసలు ఉత్కంఠ కొంత తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రశ్నల కంటే సెలబ్రిటీల మధ్య సంభాషణలు, ఎమోషనల్ మూమెంట్స్, డ్రామాటిక్ ప్రెజెంటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని కొందరు అంటున్నారు.

అయితే ఈ మొత్తం డిస్క‌ష‌న్ లో ప్రత్యేకంగా నిలిచింది ఆమిర్‌పై అమితాబ్ చూపిన గౌరవం. సరైన సమాధానం చెప్పిన తర్వాత ఆయన చూపిన సంతృప్తి, ఆమిర్ నాలెడ్జ్‌ను ప్రశంసించిన తీరు KBC అసలు బలం జ్ఞానమే అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. సెలబ్రిటీ హోదా కంటే, ప్రశ్నను అర్థం చేసుకుని సరైన సమాధానం చెప్పగల సామర్థ్యానికే అమితాబ్ ప్రాధాన్యం ఇచ్చినట్టు ఈ సంఘటన స్పష్టంగా చూపించింది.