ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!
అమిత్ సాధ్, రాజ్‌కుమార్ రావు మధ్య కెరీర్ పోలికలపై అమిత్ స్పందించారు. ఇద్దరూ తమదైన మార్గాల్లో పరిశ్రమలో రాణిస్తున్నారని, రాజ్‌కుమార్ అద్భుతమైన నటుడని ప్రశంసించారు. 2013లో వచ్చిన 'కై పో చే' షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంటూ రాజ్‌కుమార్, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంకితభావాన్ని కొనియాడారు. ఆ ముగ్గురి మధ్య ఉన్న స్నేహం, కెమిస్ట్రీ ప్రత్యేకమైనవని చెప్పారు. ప్రస్తుతం అమిత్ నటిస్తున్న 'ప్రతాప్' నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.
By: Srikanth Kontham | 6 Nov 2026 2:00 PM ISTబాలీవుడ్లో గాడ్‌ఫాదర్ లేకుండా అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో అమిత్ సాధ్- రాజ్‌కుమార్ రావు ముందు వరుసలో ఉంటారు. 2013లో విడుదలైన కల్ట్ హిట్ సినిమా `కై పో చే` చిత్రంతో కలిసి ప్రయాణం ప్రారంభించిన ఇద్దరు నటుల కెరీర్ గ్రాఫ్‌పై తరచూ చర్చలు జరుగుతుంటాయి. అయితే కెరీర్‌కు, రాజ్‌కుమార్ రావు విజయాలకు మధ్య వస్తున్న పోలికలపై తాజాగా అమిత్ సాధ్ స్పందించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఇతర నటుల విజయాలను ఈర్ష్యగా కాకుండా ఆరోగ్యకరమైన దృక్పథంతో చూడాలనే విషయాన్ని అమిత్ సాధ్ మరోసారి నిరూపించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాజ్‌కుమార్ రావుతో తనను పోల్చడంపై స్పందిస్తూ `మేమిద్దరం ఎవరికి తగినట్లుగా వారు పరిశ్రమలో బాగానే రాణించామని భావిస్తున్నాను` అని తెలిపారు. రాజ్‌కుమార్ రావు అసాధారణ నటుడని.. ఆయన ప్రతిభ ఎంతటిదో అందరికీ తెలిసిందేనని అమిత్ కొనియాడారు.
`కై పో చే` సినిమా షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంటూ అమిత్ సాధ్ ఉద్వేగానికి గురయ్యారు. ఆ చిత్రంలో తనతో పాటు నటించిన రాజ్‌కుమార్ రావు .. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ల అంకితభావం తనపై జీవితాంతం ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆ నటులు కనబరిచిన ప్యాషన్, నటన పట్ల వారి నిబద్ధత ఎంతో గొప్పదని.. అలాంటి సహనటులతో పనిచేయడం అదృష్టమని గుర్తు చేసుకున్నారు.
ఆ సినిమా సమయంలో చిత్రబృందం మధ్య ఏర్పడిన అనుబంధం చాలా ప్రత్యేకమైనదని అమిత్ తెలిపారు. ఆ తర్వాత తాను చేసిన ప్రాజెక్ట్‌లలో ఆ స్థాయి మ్యాజిక్‌ను.. ఆత్మీయతను మళ్లీ పునరావృతం చేయడం కష్టమైందని అభిప్రాయపడ్డారు. ముగ్గురు స్నేహితుల మధ్య ఉన్న కెమిస్ట్రీ తెరపై ఎంత సహజంగా పండిందో? తెరవెనుక వారి మధ్య ఉన్న స్నేహం కూడా అంతే బలంగా ఉండేదని వెల్లడించారు.
టెలివిజన్ రంగం నుంచి సినిమాల్లోకి ప్రవేశించి అటుపై ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమిత్ సాధ్ రెండు దశాబ్దాలకు పైగా తనదైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి వివాదాలకుపోకుండా పనిపైనే దృష్టి పెట్టి నటనలో మరింత పరిపక్వత సాధించానని తెలిపారు. ప్రస్తుతం అమిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న `ప్రతాప్` చిత్రం నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.
