50 ఏళ్ల వయసులోనూ లవ్ ప్రపోజల్స్!
టాలీవుడ్ లో `బద్రీ`తో లాంచ్ అయిన అమ్మడు అటుపై మరికొన్ని తెలుగు సినిమాల్లో నటించినా? చివరిగా బాలీవుడ్ లో స్థిరపడింది.
By: Srikanth Kontham | 19 Sept 2025 4:50 PM ISTబాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో `బద్రీ`తో లాంచ్ అయిన అమ్మడు అటుపై మరికొన్ని తెలుగు సినిమాల్లో నటించినా? చివరిగా బాలీవుడ్ లో స్థిరపడింది. తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలే ఎక్కువగా చేసింది. ఇప్పటికీ అక్కడే యాక్టివ్ గా ఉంటుంది. హిందీలో స్టార్ లీగ్ లో చేరలేదు కానీ వచ్చిన అవకాశాలతో సంతోషంగా కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఈ బ్యూటీ ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ వయసు కూడా దాటిపోయింది. నటిగా రిటైర్మెంట్ కు సమీపంలో ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒటరి జీవితానికి గల కారణాలు చెప్పే ప్రయత్నం చేసింది.
సినిమాల్లోకి రాకముందే రిలేషన్ షిప్ లో:
సినిమా కెరీర్ కోసమే వివాహానికి దూరంగా ఉన్నట్లు తెలిపింది. తనని పెళ్లి చేసుకోవాలని చాలా మంది ప్రపోజ్ చేసినట్లు తెలిపింది. కానీ అలా ప్రపోజ్ చేసిన చాలా మంది వివాహం అనంతరం ఇంటికే పరిమితం అవ్వాలి అనే కండీషన్ నచ్చకపోవడంతో పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలిపింది. తాను సినిమాను అంత సులభంగా వదలలేనని ఆ కారణంగానే ప్రపోజల్స్ ని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చింది. తనను ప్రేమించే వ్యక్తి ఎవరైనా సరే తన వృత్తిని కూడా ప్రేమించే వారై ఉండాలని ఆశ పడుతుంది. సినిమాల్లోకి రాకముందు కొన్నాళ్ల పాటు ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలిపింది.
చిన్నవాడైనా పర్వాలేదు:
ఒకరి కొకరు నచ్చడంతో పాటు కుటుంబాలు కూడా నచ్చడంతో పెళ్లి చేసుకోవాలనుకుందిట. కానీ చివర్లో ఆ ప్రేమించిన వాడే సినిమాలు వదిలేస్తేనే పెళ్లి చేసుకుందామని కండీషన్ పెట్టాడుట. ఆ కారణంగా అతడికి గుడ్ పై చెప్పినట్లు తెలిపింది. వివాహ వ్యవస్థకి తానెంత మాత్రం వ్యతిరేకం కాదని, అన్ని అర్హతలు ఉండి, తనని అర్దం చేసుకున్న వాళ్లు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఇప్పటికీ తనని ఇష్టపడే వారి సంఖ్య ఎంత మాత్రం తగ్గలేదంది.
హిట్ తో వరుస అవకాశాలు:
మంచి కుటుంబాల నుంచి సంబంధాలు వస్తున్నాయని, తనలో సగం వయసున్న వారు డేటింగ్ కి ఆహ్వానం చెబుతున్నారంది. తనకు కూడా వయసుతో సంబంధం లేదని మానసిక పరిపక్వత కలిగిన కుర్రాడైతే చాలనుకుం టున్నట్లు తెలిపింది. అమ్మడి సినిమాల విషయానికి వస్తే గదర్ 2 తో భారీ విజయం అందుకుంది. ఈసినిమా 500కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అమీషా పేరు బాలీవుడ్ లో మారు మ్రోగింది. దీంతో వెంట వెంటనే మూడు సినిమాలకు సైన్ చేసింది. వాటిలో రెండు సినిమాలు ఇంకా మొదలవ్వలేదు. ఓ సినిమా మాత్రం రిలీజ్ అయింది. కానీ ఫలితం మాత్రం ఆశించిన విధంగా రాలేదు.
